Devotional

ఆలయాల్లో పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారో…తెలుసా…? – TNI ఆధ్యాత్మికం

ఆలయాల్లో పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారో…తెలుసా…?   – TNI ఆధ్యాత్మికం

1. ఆలయాల్లో పుష్పయాగం నిర్వహించడానికి చాలా కారణాలున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల కానీ, అధికార అనధికారుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తుంటారు. అయితే కొన్నిఆలయాల్లో మాత్రమే పుష్పయాగం నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతుంటుంది. పుష్ప యాగానికి ముందు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆతర్వాత పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు

2. సెంచరీ కొట్టిన శ్రీవారి హుండీ ఆదాయం
దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా రూ.128.81 కోట్ల ఆదాయం లభించింది. కొవిడ్‌ పరిస్థితుల నుంచి తిరుమల నెమ్మదిగా కోలుకుంటున్న క్రమంలో పూర్వపు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్‌ కారణంగా తిరుమలలో రెండేళ్లపాటు దర్శనాలపై ఆంక్షలు కొనసాగాయి. అయితే ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో మార్చి మొదటివారం నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, ఆఫ్‌లైన్‌ టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు, వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, వర్చువల్‌ సేవలకు వచ్చే భక్తుల సంఖ్యను దాదాపు 60 నుంచి 70వేలకు పెంచారు.దీంతో తిరుమల క్షేత్రం రెండేళ్ల తర్వాత భక్తులతో సందడిగా మారింది. గత నెలలో 19,72,656 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. రూ.128.81కోట్ల హుండీ ఆదాయం లభించింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రస్తుతం సగటున 65 వేల లోపు ఉన్నప్పటికీ హుండీ ఆదాయం సగటున రూ.4 కోట్లు లభిస్తుండటం గమనార్హం. ప్రత్యేకించి 19వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా రూ.5.13 కోట్లు లభించింది. అదే రోజు 80,429 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

3. సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం-ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగింపు
విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి రెండేళ్ల కాలపరిమితితో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూ, మరో 14 మందిని సభ్యులుగా నియమించింది. సువ్వాడ శ్రీదేవి, పంచాడి పద్మ, వంకాయల సాయినిర్మల, దశమంతుల రామలక్ష్మి, ఎం.రాజేశ్వరి, శ్రీదేవివర్మ పెన్మత్స, బయ్యవరపు రాధ, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, దొడ్డి రమణ, గంట్ల శ్రీనుబాబు, ఆర్‌.వీరవెంకటసతీష్‌, వారణాసి దినేశ్‌రాజ్‌, కె.నాగేశ్వరరావులకు సభ్యులుగా స్థానం కల్పించింది. దొడ్డి రమణ గాజువాక ప్రాంతంలో వైకాపా తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. దినేశ్‌రాజ్‌ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు.
*గతంలో సంచైత నియామకంతో వివాదం
రెండేళ్ల కిందట 2020 మార్చి 3న రాత్రివేళ సింహాచల ఆలయ ఛైర్‌పర్సన్‌గా ఆనందగజపతిరాజు కుమార్తె సంచైత గజపతిరాజుతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో పెద్ద దుమారమే రేగింది. తెల్లవారగానే సంచైత బాధ్యతలు చేపట్టారు. దీనిపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆమె నియామకాన్ని రద్దుచేసి, అశోక్‌ను కొనసాగిస్తూ తీర్పు వెలువడింది.

4. శివలింగంపై సూర్యకిరణాలు
వేలూరు చెన్నై స్థానిక కాట్పాడి సమీపం విన్నంపల్లిలో వెయ్యేళ్ల పురాతన అగస్త్యేశ్వరాలయం ఉంది. ఆలయ గర్భగుడిలోని శివలింగంపై ఏడాదికి ఒకరోజు సూర్యకిరణాలు ప్రసరిస్తుంటాయి. ఆ ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటలకు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారం రోజులు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

5. శ్రీవారి సర్వదర్శనం కోసం రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు
తిరుమలలో సర్వ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు వెయ్యి చొప్పున రేపటి నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ నెలకు సంబంధించి టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి కోసం తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇవాళ జారీ చేస్తున్నామని తెలిపారు. ఎల్లుండి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కాగా నిన్న శ్రీవారిని 68,009 మంది భక్తులు దర్శించుకోగా 39,518 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు వచ్చిందని వివరించారు.