ScienceAndTech

ఎంత కాల‌మైనా తుప్పుప‌ట్ట‌ని ఈ క‌ళాకృతులను ఎలా త‌యారు చేస్తారంటే..

ఎంత కాల‌మైనా తుప్పుప‌ట్ట‌ని ఈ క‌ళాకృతులను ఎలా త‌యారు చేస్తారంటే..

తెలంగాణ గడ్డ మీద అనేకానేక కళారూపాలు పురుడుపోసుకున్నాయి. అద్భుత కళాఖండాలు రూపుదాల్చాయి. మన ఖ్యాతిని ఖండాలు దాటించాయి. వాటిలో ఒకటి.. బిద్రి. పర్షియా నుంచి బహమనీ సుల్తానుల ద్వారా భారత్‌ చేరుకున్న హస్తకళ ఇది. తెలంగాణ కళాకారుల చేతిలో పడగానే ఆ కళకు కొత్త కళ వచ్చింది.
e1
మధ్యయుగపు బిద్రీ కళాకృతులు అద్భుత పనితనాన్ని కలిగి ఉంటాయి. నల్లని ఉపరితలంపై మెరిసే వెండి తీగలు, రేకులతో చేసిన అలంకరణలు ఆ వస్తువుకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఎంతకాలమైనా తుప్పు పట్టకుండా ఉండటం బిద్రీ కళాకృతుల ప్రత్యేకత. 15వ శతాబ్దం నుంచే బీదర్‌ కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన బిద్రీ కళ కాలక్రమంలో హైదరాబాద్‌ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కళాకృతులను భారతదేశానికి తీసుకొచ్చిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు.. బిద్రీ కళనూ ప్రోత్సహించారు. తమ రాజ్యాలలో ఈ పరిశ్రమకు ప్రోత్సాహం అందించారు. రోజువారీ జీవితంలో ఉపయోగించే హుక్కా, పాన్దాన్‌, వాష్‌ బేసిన్లు, కూజాలు, అత్తరు సీసాలు, కొవ్వొత్తి స్టాండ్లు, సబ్బు పెట్టెలను బిద్రీ కళతో చేయించుకున్నారు. ఆయా వస్తువులపై అందమైన నగిషీలు చెక్కించి వాడిన ఘనత నిజాం నవాబులది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బీదర్‌.. ఒకప్పుడు నిజాం పాలనలో ఉండేది. అక్కడినుంచి నైపుణ్యం కలిగిన కళాకారులను హైదరాబాద్‌ రప్పించి, ఇక్కడే కర్మాగారాలను ఏర్పాటు చేయించారు. ఫలితంగా బీదర్‌, గోల్కొండ (హైదరాబాదు) ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ కళ మనుగడలో ఉంది.
e3
*తయారీ విధానం
బిద్రీ ( Bidri Work ) కళాఖండాల తయారీకి కావలసిన మట్టి ఎక్కువగా బీదర్‌ ( Bidar ), పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. బిద్రీ పాత్రల తయారీలో రెండు మూడు రకాల మిశ్రమ లోహాలను వాడుతారు. రాగి, తుత్తునాగంలను 1:16 నిష్పత్తిలో కలిపి, బిద్రీ పాత్రలను తయారుచేస్తారు. ఒక వస్తువును రూపొందించడంలో ఐదు దశలు ఉంటాయి. లోహాలను కరిగించి పోత పోయడం, నమూనా రూపకల్పన, చెక్కడం-మలచడం, లోపల అమర్చడం, నలుపు చేయడం, మెరుగు పెట్టడం అనే ప్రక్రియలు ఇందులో ప్రధానమైనవి. ముందుగా కావాల్సిన పాత్రకు సంబంధించిన మూసను తయారుచేసి పోతపోస్తారు. పోత పోసిన పాత్రపై కాపర్‌ సల్ఫేట్‌ ద్రావణంతో నలుపు చేస్తారు. ఈ దశలోనే పాత్రపై అవసరమైన చిత్రాలు చెక్కుతారు. ఆ తర్వాత వెండి, ఇత్తడి లేదా బంగారపు తీగలను, తొలిచిన నమూనాలోనికి జొప్పించి, స్థిరంగా ఉండేలా చేస్తారు. వెండి తీగలను పాత్రపై తాపడం చేయడం చాలా శ్రమతో కూడిన వ్యవహారం. ఏమరుపాటు ఉండకూడదు. వేళ్లు వేగంగా కదలాలి. చాలా ఓర్పు ఉండాలి. అదే బిద్రీ పని ఒక కళగా గుర్తింపు పొందడానికి కారణమైంది. ఆ తర్వాత పాత్రకు నలుపు రూపాన్ని స్థిరపరచడానికి అమ్మోనియం క్లోరైడ్‌, సోడియం క్లోరైడ్‌ లాంటి రసాయనాలను మట్టి ముద్దలో కలిపి, దానిని పాత్రపై మెత్తుతారు. చివరికి పాత్ర ఉపరితలాన్ని నూనె, బొగ్గు మిశ్రమంతో నాలుగైదుసార్లు బాగా రుద్ది కడుగుతారు. పలుమార్లు ఇలా చేయడం వల్ల పాత్రకు మెరుపు వస్తుంది.
e4
*కట్నంలో భాగం..
మహమ్మదీయుల జీవితంలో బిద్రీ పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. ప్రతి కుటుంబంలోనూ తమ జీవితకాలంలో ఒకటి రెండు బిద్రీ పాత్రలను సంపాదించు కొనేవారు. వధువుకు కట్నంగా ధనంతోపాటు బిద్రీ పాత్రలు కూడా అడిగేవారు. ఒకప్పుడు తెలంగాణ హస్తకళల్లో ప్రముఖ స్థానం పొందిన ఈ కళాకృతులకు ఇప్పుడు ఆదరణ కరువైంది. దీంతో వీటిని తయారుచేసే కళాకారుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మ్యూజియంలలో ఈ వస్తువులు ప్రదర్శితమవుతున్నాయి. దీన్నిబట్టి బిద్రీ కళాఖండాల ప్రాముఖ్యం అర్థం చేసుకోవచ్చు.
e5
e6
e7