DailyDose

ఈ యుద్ధ క‌ళ తెలిసి చేతిలో కర్ర ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే

ఈ యుద్ధ క‌ళ తెలిసి చేతిలో కర్ర ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే

యుద్ధ విద్యలు అంటే.. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో వంటివే అనుకుంటాం. ‘సిలంబం’ అన్న పేరు వినడమూ కొత్తే కావచ్చు. నాడు స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్‌ సైన్యం గ్రామాల్లోకి చొరబడుతున్నప్పుడు.. కర్రలు, కత్తులు, బరిసెలు పట్టి కదనరంగంలోకి దూకారు సిలంబం యుద్ధవీరులు. కత్తివేటుకు ఇద్దరి చొప్పున.. కర్రదెబ్బకు ఒక్కరి చొప్పున మట్టుబెడుతూ.. జబ్బచరిచి, మీసం మెలేశారు. ఆ వీరుల కళ గురించి వివరంగా..

*ఆపద సమయంలో చేతికర్ర చేతిలో ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే. అదే కత్తి తిప్పడం తెలిసిన వ్యక్తి చేతిలో చురకత్తి ఉంటే వేటువేస్తూ.. పోటు పొడుస్తూ.. ప్రత్యర్థుల కుత్తుకలు తెగనరకవచ్చు. ఒక్క కత్తిసాము, కర్రసాము.. వంటివే కాకుండా ఇలాంటి ఎనిమిది రకాల యుద్ధవిద్యలకు మూలం ‘సిలంబం’. ఇదొక ప్రాచీన యుద్ధకళ. ద్రవిడ సంస్కృతిలో భాగమై.. తమిళనాడు కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన మర్మకళ. ఆ దెబ్బకు హడలిపోయిన బ్రిటిషర్లు సిలంబంపై నిషేధం విధించారు. అలా కొనేండ్లపాటు ఈ యుద్ధకళ గురించి దేశం మరిచిపోయింది. ఈ కళ తెలిసిన కొంతమంది గ్రామస్తులు రహస్యంగా తమ బిడ్డలకు నేర్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిలంబం’ మార్షల్‌ ఆర్ట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో ఈ ప్రాచీన యుద్ధవిద్య మళ్లీ ప్రాణం పోసుకుంది. సిలంబంలో శిక్షణ తీసుకుంటూ సింహాల్లా దూకుతున్నారు విద్యార్థులు.
stAMP
అధికారిక హోదా
సిలంబంకు మళ్లీ జీవంపోసింది దక్షిణాది సినిమాలే. బ్రిటిషర్లు నిషేధించిన తర్వాత ఈ కళ అంతర్గత ప్రదర్శనలకే పరిమితమైంది. దీనికంటూ అధికారిక హోదా కల్పించడానికి తమిళనాడు దివంగత ఎంజీఆర్‌ తీవ్ర కృషి చేశారు. తన సినిమాల్లో ఎక్కడో ఓ చోట చొప్పించేవారు. అలా తెలుగునాట కూడా కత్తిసాము, కర్రసాములతో అద్భుతమైన ఫైట్స్‌ చిత్రీకరించారు. తమిళనాడులోని సిలంబం వీరాభిమానులు.. కరాటేను తలపించేలా ‘బెల్ట్‌’ వ్యవస్థనూ ప్రవేశపెట్టారు. 2021లో తమిళ యువజన సంక్షేమ శాఖ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’లో ఈ క్రీడను చేర్చింది. దీంతో సిలంబం క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కోటాలో 3 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తున్నది.
stAMP2
పతకాల పంట!
సిలంబంలో భాగమైన కర్రసాము విద్యలో తెలుగు విద్యార్థులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. తమిళనాడు వేదికగా జరిగే జాతీయ సిలంబం పోటీల్లో మనోళ్లు బంగారు పతకాలూ సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరుకు చెందిన కక్కిరేణి సాత్విక మంచిర్యాల జిల్లాలో జరిగిన కర్రసాము పోటీల్లో బంగారు పతకం సాధించింది. తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి సిలంబం పోటీల్లో వెండి పతకం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కొన్ని కుటుంబాలు కర్రసామును వారసత్వంగా పిల్లలకు నేర్పుతున్నాయి. సిలంబంకు అధికారిక హోదా రావడంతో పాఠశాలల్లో, బీచ్‌లలో, పార్కులలో కరాటే, తైక్వాండో, జూడోతో పాటుగా సిలంబం కూడా బోధిస్తున్నారు. టోర్నమెంట్లు సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఈ యుద్ధవిద్యను అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలే నేర్చుకుంటున్నారని చెబుతున్నారు తమిళనాడుకు చెందిన సిలంబం శిక్షకుడు ఐశ్వర్య మణివణ్ణన్‌. సిలంబం అనేది అచ్చమైన తమిళ పదం. సిలం అంటే కొండ, కంబు అంటే వెదురు. కేరళలో దొరికే ఈ కర్రలు తయారు చేస్తారు. అగస్త్య రుషి సిలంబానికి ఆద్యుడని అంటారు.