Devotional

అమరనాథ్‌ యాత్రకు ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్ – TNI ఆధ్యాత్మికం

అమరనాథ్‌ యాత్రకు ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్  – TNI ఆధ్యాత్మికం

1. అమరనాథ్ యాత్ర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా, ఈ యేడాది యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌జీ శ్రైన్ బోర్డ్ సీఈవో నితీశ్వర్ కుమార్ తెలిపారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్లు నితీశ్వర్ తెలిపారు. కొవిడ్-19 పాండమిక్ తర్వాత ప్రారంభం ప్రారంభం కానున్న ఈ యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. జమ్మూలోని రాంబన్ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రకు సుమారు మూడు లక్షల మంది భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై నితీశ్వర్ మాట్లాడుతూ ‘‘ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, యెస్ బ్యాంకులకు చెందిన సుమారు 446 బ్రాంచీల్లో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. మూడు లక్షల మంది భక్తులు ఈ యాత్రకు హాజరవుతారని అనుకుంటున్నాము’’ అని అన్నారు.

2. సింహాచలం దేవస్ధానం ట్రస్టు బోర్డును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
శ్రీ వరాహా లక్ష్మినరసింహ స్వామి సింహాచలం దేవస్ధానం ట్రస్టు బోర్డును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్తల మండలి అనువంశిక ఛైర్మన్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు, సభ్యులుగా 14 మందిని నియిమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ట్రస్టులో ఎక్స్ అఫిషీయో మెంబర్‌గా ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారని, రెండేళ్ళ పాటు పాలకమండలి కొనసాగుతుందని పేర్కొంటూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

3. పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్ లైసైన్స్ రద్దు
పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. అన్నదానానికి భోజనం సరఫరా చేసే క్యాంటీన్‌లో కోడి మాంసం వండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దేవాదాయ శాఖ అధికారులు క్యాంటీన్ను సీజ్ చేసి… లైసెన్స్ రద్దు చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు.. క్యాంటీన్ను సీజ్ చేశారు. ఈనెల 1న క్యాంటీన్ నిర్వహణ నిర్వాహకుడు లైసెన్సు పొందినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌ తీసుకున్న వారం రోజుల్లోనే నిబంధనల ఉల్లంఘించడం తీవ్ర విమర్శలకు తావించ్చింది. క్యాంటీన్ నిర్వహణ లైసెన్స్ రద్దుచేస్తూ దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ డిపాజిట్‌ను జరిమానా కింద జమ చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.”బండి మాత్రం లోపలికి వచ్చిందని తెలిసింది. అక్కడ వాళ్లను అడిగితే బయట తయారు చేయించాము. వెజిటేరియన్ క్యాంటీన్లో తయారు చేయించాం. ఈ రెండూ ముందు నాన్వెజ్ బండిలోకి ఎక్కించాము. తర్వాత వెజ్ తీసుకెళ్లడానికి బండి లోపలికి వచ్చిందని చెప్పారు. బండి కూడా రావడం తప్పే. అందుకే అతడి లైసెన్స్ రద్దు చేస్తున్నాం. ఇంతకు ముందు ఏమైనా ఇలాంటివి జరిగాయా అన్న విషయంపై ఆలా తీస్తున్నాం.” -ఈమని చంద్రశేఖర్‌రెడ్డి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ క్యాంటీన్‌ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలంపాటలో దక్కించుకున్నాడు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్‌ వ్యాపారం కూడా ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వారు నోరు మెదపడం లేదు. క్యాంటిన్‌ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్‌ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై విమర్శలు తీవ్రస్థాయిలో రావడంతో దేవాదాయ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆలయంలోని క్యాంటీన్ను సీజ్ చేశారు.

4. వైభవంగా రాజన్న కల్యాణోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవానికి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు, ఆలయ ఈవో రమాదేవి తలంబ్రాలు సమర్పించారు.స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య రెండున్నర గంటల పాటు కల్యాణం కనులపండువగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వధువు పక్షాన ఈవో రమాదేవి కట్నకానుకలు మాట్లాడుకున్నారు.అనంతరం స్వామివారిని పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణ వేడుక ఆలయంలో నిర్వహించడం తో చాలామంది భక్తులు ఆలయం బయటే ఎండలో ఉండిపోయారు. ఎల్‌ఈడీ టీవీలు పనిచేయకపోవడంతో శివపార్వతులు గోల గోల చేశారు. కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్‌–సరిత దంపతులు, వ్యాఖ్యాతగా తిగుళ్ల శ్రీహరిశర్మ, చంద్రగిరిశరత్‌ వ్యవహరించారు. కల్యాణోత్సవానికి లక్షమంది కిపైగా తరలివచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది.