DailyDose

ఏపీ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు – TNI తాజా వార్తలు

ఏపీ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు – TNI తాజా వార్తలు

*ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్‌, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గతంలోనే గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే.

*భద్రాద్రి రామయ్య కల్యాణంపై వివాదం
పురాతన సంప్ర దాయాలు, అల వాట్లకు భిన్నంగా కొత్త విధానాలను శ్రీరామ కల్యా ణంలో అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. స్వామి వారి కల్యాణంలో శ్రీరామచంద్రప్రభు అనడానికి బదులుగా శ్రీరామనారాయణ అంటున్నారని, పలు సంప్రదాయాలకు విరుద్ధంగా కల్యాణం నిర్వహిస్తుంటే ప్రధాన అర్చకుడు అడ్డుకోవడం లేదని రిట్‌లో పేర్కొన్నారు.ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన వెంకటరమణ దాఖలు చేసిన రిట్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి శుక్రవారం విచారించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమన్నారు. ఆలయ అధికారుల వాదనల తర్వాతే ఉత్తర్వుల విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు.
.
*ప్రమాదభరితమైన డ్రగ్స్‌పై అవగాహన కల్పించుకోవాలనిఎక్కడైనా డ్రగ్స్‌ విషయం తెలిస్తే హెల్ప్‌ లైన్‌ నెం.9492099100కు దయచేసి సమాచారం అందించాలని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి సూచించారు. బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ పాఠశాలలో శుక్రవారం డ్రగ్‌ నిషేధిత క్యాంపస్‌ పేరుతో విద్యార్థులకు డ్రగ్స్‌ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ కు అలవాటు పడితే జీవితాంతం అది వ్యక్తి గతమైన అలవాటుగా మారుతుందని, సమాజంపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ఆత్మవిశ్వాసంతో దాన్ని నిరోధించుకోవలసిన అవసరం ఉందనిఅందుకు తగిన సూచనలను చేశారు.
*గుంటూరు జిల్లాలోని బాపట్ల కుక్కలవారిపాలెంలో పెన్షన్ దారులకు వాలంటీర్లు చినిగిన నోట్లను పంపిణీ చేశారు. దీనిపై వాలంటీర్‌‌ను ప్రశ్నించగా..తమకు ఇవే ఇచ్చారంటూ లబ్ధిదారులకు సమాధానం ఇస్తున్నారు. బ్యాంక్‌కు వెళ్లి మార్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. ఈ వాలంటీర్ పరిధిలోనే దాదాపు పది మందికి ఇదే పరిస్థితి నెలకొంది. వాలంటీర్ తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*త్వరలో మళ్లీ టీఎస్ ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని ఏబీఎన్‌తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచడానికి పెరుగుతున్న డీజిల్ ధరలే కారణమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లోనే బస్సు ఛార్జీలు పెంచామని సజ్జనార్‌ తెలిపారు. పల్లెవెలుగుసిటీ ఆర్డినరీకి ఆపై బస్సులకు పెంచామన్నారు. డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

*తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన నిలబడ్డాను. సీఎం జగన్‌కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్‌ అన్నప్పుడే నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు.

*తూర్పుగోదావరి నన్నయ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేగింది. నన్నయ హాస్టల్‌లో 15 మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ఇందుకు సూత్రధారిగా భావిస్తున్న ఓ విద్యార్థికి అధికారులు టి.సి ఇచ్చి పంపేశారు. వీకెండ్‌లో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి హాస్టల్‌కు గంజాయి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చామని నన్నయ వీసీ ఆచార్య జగన్నాథరావు తెలిపారు. నన్నయ క్యాంపస్‌లో గంజాయి నివారణకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి రిటైర్డ్ మిలటరీ అధికారిని సెక్యూరిటీగా నియమించనున్నారు.

*విశాఖపట్నం నగరంలోని మేఘాద్రిగడ్డను బీజేపీ నేతలు శనివారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులున్నాయన్నారు. నూరేళ్లనాటి తోటపల్లి ప్రాజెక్టులకు నిర్వహణ వ్యయం కూడా ఇవ్వకపోవడంతో గేట్లు పని చేయటం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర నుంచి తరతరాలుగా లక్షలాది మంది పొట్టకూటి కోసం వలస పోతున్నారని సోమువీర్రాజు అన్నారు

*రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం ఉదయం ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మూడు భవనాల్లోని ఐదు దుకాణాలు దగ్ధమైనట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. 20 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజిందర్ అత్వాల్ తెలిపారు.మరోవైపు ఆనంద్ పర్వత్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బీఎల్ కపూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.

* సీనియర్ నటులు బాలయ్య మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ‘‘ప్రముఖ నటులు, సినీ దర్శక నిర్మాత మన్నవ బాలయ్య గారి మరణం విచారకరం. 300కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. బాలయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చంద్రబాబు తెలిపారు

*నంద్యాల ఏ. కోడూరు ఎంపీపీ పాఠశాలలో చిక్కీలో పురుగులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్ఈఓ రామసుబ్బయ్య విచారణ చేపట్టారు. అయితే చిక్కీ ప్యాకెట్లపై తయారీ తేది లేకపోవడాన్ని విద్యాశాఖ అధికారులు గమనించారు. పాఠశాలలో మిగిలిన చిక్కీ ప్యాకెట్లను సైతం తనిఖీ చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు

*న్నమయ్య: జిల్లాలోని రామసముద్రం మండలం దాశార్లపల్లెలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శంకర అనే రైతుకు చెందిన ఆవు దూడను చిరుత లాకెళ్లి చంపి తిన్నది. మూడు రోజులుగా ఈ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

*దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది.

*ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్‌ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దల మంది ట్విటర్‌ యూజర్లను ట్యాగ్‌ చేస్తూ సీఎంవో ట్విటర్‌ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్‌ చేసిన ట్వీట్లను డిలీట్‌ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు

*డ్రగ్స్‌ దందా వెనుక సీఎం కేసీఆర్‌ సన్నిహితులుటీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. డ్రగ్స్‌ దందాకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందని, దీంతో రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017లోనే డ్రగ్స్‌ దందా వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని సీఎంను ఆయన ప్రశ్నించారు. కాగా రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా గవర్నర్‌ వ్యవస్థను సీఎం గౌరవిస్తారని సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎంకు ఏజెంట్‌గా పనిచేస్తే గవర్నర్‌ మంచివారా? అని ఆయన ప్రశ్నించారు.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి ఆయన మీడియా సంస్థ ఇందిరా టెలివిజన్‌ కేసులో కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. ఇందుకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో.. ఇదే ఆఖరి అవకాశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదావేసింది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి మధుసూదన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని ఇందిరా టెలివిజన్‌ సంస్థ గతేడాది డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. కానీ అది ఇంతవరకు దాఖలు చేయలేదు.

*మహమ్మారి నేపథ్యంలో పెద్ద ఇళ్లకు డిమాండు బాగా పెరిగింది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో కోటి రూపాయల పైబడిన ధరల్లోని అపార్ట్‌మెంట్ల అమ్మకాలు జోరు గా సాగాయి. ఏడు ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్లు 83 శాతం వృద్ధితో 10,988 అమ్ముడుపోయాయని జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5994 ఉన్నాయి. ఆ నగరాల్లో హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, పూణె, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ఉన్నాయి. రూ.1-1.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు 6,187 అమ్ముడుపోగా రూ.1.5 కోట్లు పైబడిన విలువ గల ఫ్లాట్లు 4,801 అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫ్లాట్లు కలిపి దేశంలో మొత్తం అమ్మకాలు 51,849 ఉన్నాయి.

*యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీల ఈక్విటీలో వాటా కోసం 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,400 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. ఇందులో సగం 102 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,700 కోట్లు) అదానీ గ్రూపు ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) ఈక్విటీలో పెట్టుబడి పెట్టనుంది. మిగతా మొతాన్ని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌), అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) కంపెనీల ఈక్విటీలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తర్వాత ఈ పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి.

*కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్‌-బీ కేడర్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌(సీజీఎల్‌) ఎగ్జామ్‌లో అనంతపురం జిల్లా కుర్రాడు టాప్‌ లేపాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో అనంతపురం నగరానికి చెందిన బాగేపల్లి శ్రీనివాస్‌ తేజ ప్రథమ ర్యాంకు సాధించాడు. నిర్వహించిన సీజీఎల్‌ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా దాదాపు అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో తమ కుమారుడు శ్రీనివాస్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు

*మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో అవినీతి బాహుబలి అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆయన సకుటుంబ సపరివారంగా రూ.వందల కోట్లు దోచేశారని ఆ పార్టీ ధ్వజమెత్తింది. ఆ పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి జే ట్యాక్స్‌ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా దోచుకొంటుంటే ఆయన దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను బీ ట్యాక్‌ ్సతో దోపిడీ చేశారని విమర్శించారు. ‘‘బాలినేని తాను జగన్‌ బంధువునని చెప్పుకొంటూ ఈ మూడేళ్లలో దారుణంగా దోచుకొన్నారు. ఆయన అవినీతి సంపాదన రూ.1,700 కోట్లు దాటిపోయింది. మంత్రి బాలినేని కారులో హవాలా సొమ్ము రూ.5 కోట్లు దొరికింది. ఆ కారుపై బాలినేని స్టిక్కర్‌ ఉంది. అయినా ఆయనపై ముఖ్యమంత్రి ఏ చర్యా తీసుకోలేదు. టీడీపీ హయాంలో ఒక యూనిట్‌ విద్యుత్‌ను బయట రూ.ఆరుకు కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ.22కు కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో భారీగా కమీషన్లు వసూలు చేసి సీఎం, విద్యుత్‌ మంత్రి బాలినేని పంచుకొంటున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో మంత్రి వాటాగా రూ.500 కోట్లు దక్కాయని విద్యుత్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు విపరీతంగా ఉన్నాయి. వాటిని కూడా మంత్రి వదిలిపెట్టలేదు.

*విద్యుత్‌ చార్జీల పెంపుదలనుకరెంటు కోతలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఆందోళనలకు దిగింది. జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి పేదల నడ్డివిరుస్తోందనిఇళ్లకు విద్యుత్‌ ఇవ్వకుండా పేదమధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా కొవ్వలిలో లాంతరువిసనకర్రకొవ్వొత్తులతో పార్టీ నాయకులుకార్యకర్తలతో కలిసి ఆయన నిరసన తెలిపారుఇంటింటికీ తిరిగి కొవొత్తులు పంపిణీచేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణిరాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ తదితరుల నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించార

*కృష్ణాజిల్లాలో 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. గుడివాడ మండలంలోని మోటూరు గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వెంటనే వారిని పాఠశాల సిబ్బంది… గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా విద్యార్థినులు స్పృహ తప్పారని హాస్టల్ వార్డెన్ తెలిపారు. బాధిత విద్యార్థులంతా 6, 7 తరగతులకు చెందినవారని తెలిపారు. ఆహారం కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికల వైద్యసేవలను రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.