Devotional

సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం – TNI ఆధ్యాత్మికం

సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం – TNI ఆధ్యాత్మికం

1. రాములోరి కల్యాణానికి ఘడియలు దగ్గరపడుతున్న వేళ.. భద్రాద్రి దివ్య క్షేత్రం శ్రీరామనామస్మరణతో మారుమోగుతోంది. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు.. రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతించిన వేళ.. భద్రాచలం పురవీధులు సీతారాముల కల్యాణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో.. నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఎదుర్కోలు మహోత్సవం ఇవాళ సాయంత్రం జరగనుండగా.. కమనీయమైన జగదభి రాముడు – సీతమ్మదేవి కల్యాణమహోత్సవం ఆదివారం జరగనుంది.
*దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రం శ్రీ రామస్మరణతో పులకించిపోతోంది. లోక కల్యాణంగా భావించే జగదభి రాముడి జగత్ కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఈ సారి భారీగా తరలిరానున్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేకుండానే సాగిన రాములోరి కల్యాణం.. ఈ సారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న మొదలైన తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. సకల హంగులతో నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవం.. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా భద్రాద్రి దివ్వక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణ మహోత్సవానికి ముందు రోజు నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవానికి మిథిలా మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
*ముస్తాబవుతున్న ఆలయ పరిసరాలు..
ఇక తిరుకల్యాయణ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన శ్రీ సీతారాముల వారి కల్యాణ వేడుకను ఆద్యంతం వైభవోపేతంగా నిర్వహించేందుకు భద్రాచలం పరిసరాలన్నీ ముస్తాబవుతున్నాయి. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. ఎటుచూసినా స్వాగత ద్వారాలతో భద్రాచల పురవీధులు కళకళలాడుతున్నాయి. కల్యాణ వేదిక చుట్టూ చలువ పందిళ్లతో సిద్ధం చేస్తున్నారు. వీఐపీల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 లక్షల లడ్డూలు, 2.50 లక్షల తలంబ్రాలు ప్యాకెట్లను అధికారులు సిద్ధం చేశారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 60 తలంబ్రాల కౌంటర్లు, 25 ప్రసాదాల కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. 1400 మందికి పైగా పోలీసులు.. బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.పట్టాభిషేకం వేడుకలో పాల్గొననున్న గవర్నర్: రేపు నిర్వహించే సీతారాముల వారి కల్యాణ క్రతువుకు.. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 11న నిర్వహించే పట్టాభిషేకం వేడుకలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పాల్గొనున్నారు.

2. మల్లేశ్వరస్వామి దేవస్థానం మెస్‌, క్యాంటీన్‌ సీజ్‌
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో మాంసాహారం వండిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానంలో మెస్‌, క్యాంటీన్‌ను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. మరోవైపు.. బీజేపీ, పలు ధార్మిక సంఘాల నాయకులు దేవస్థానంలో శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. దేవస్థాన ఆవరణలో వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు ఏమిటని ప్రశ్నించారు. మెస్‌ కాంట్రాక్ట్‌ లైసెన్సును వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనుచరుడు, ఎంపీటీసీ భర్త షరీ్‌ఫకు ఎలా ఇచ్చారంటూ డిప్యూటీ కమిషనర్‌ను నిలదీశారు. తొలుత పెదకాకాని గ్రామస్తులు క్యాంటీన్‌, మెస్‌ ప్రాంతాలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆవుపాలతో శుద్ధి చేశారు.

3. రాములోరి కల్యాణానికి రండి!
ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలంటూ సీఎం జగన్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆ లయం డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్‌లు శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 15న రాత్రి 8 నుంచి 10గంటల మధ్య జరిగే కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని సీఎంను కోరారు. 9 నుంచి 19 వరకు ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎంకు తెలిపారు

4. భైంసా, హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు హైకోర్టు అనుమతి
నిర్మల్‌ జిల్లా భైంసా, హైదరాబాద్‌ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలు నిర్వహించుకోవడానికి హైకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన శోభాయాత్రలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై కేసరి హనుమాన్‌ యువ సంఘం, హిందూవాహిని, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ తదితర సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ కే లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. స్థానికంగా ఎవరికి వారుకాకుండా ఒకే శోభాయాత్ర నిర్వహించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

5. భద్రాద్రికి పోదాము రారండి!
ఎన్నాళ్లకెన్నాళ్లకు! శ్రీరామచంద్ర ప్రభువును కల్యాణ రాముడిగా ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం… జానకీమాతను దాశరథి పరిణయమాడే ఆ వేళ అచంచల భక్తి భావంతో ఆధ్యాత్మిక లోకంలో విహరించే భాగ్యం భక్తులకు లభించనుంది. రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో తొలిసారి సీతారాముల కల్యాణం భక్తుల సమక్షంలో కన్నులపండుగగా జరగనుంది. కరోనా పరిస్థితుల కారణంగా 2020, 2021లో కల్యాణ వేడుకలను పరిమిత సంఖ్యలో ప్రభుత్వ నేతలు, అధికారుల సమక్షంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో ఈసారి ఎప్పటిలాగే భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించనున్నారు.శ్రీ రామనవమి రోజైన ఆదివారం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణం జరగనుంది. శనివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం కేసీఆర్‌ విచ్చేసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. సోమవారం జరిగే మహాపట్టాభిషేకానికి గవర్నర్‌ తమిళిసై దంపతులు రానున్నారు. శ్రీరామ నవమి వేడుకల కోసం భద్రాద్రి సర్వాంగసుందరంగా ముస్తాబైంది.ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, టెంట్లు వేశారు. కల్యాణం అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేసేందుకు 60 కౌంటర్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక కోసం వివిధ ప్రాంతాల నుంచి 850 బస్సులను నడపనున్నారు. ఇందులో టీఎ్‌సఆర్టీసీ 450 బస్సులను, ఎపీఎస్‌ ఆర్టీసీ 400 బస్సులను నడపనున్నాయి. కాగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.

6. భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు.అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

7. రాములోరి కల్యాణానికి వేళాయె…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.
*పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం
రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ టెంపుల్‌ చైర్మన్‌ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్‌ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
*11, 12 తేదీల్లో గవర్నర్‌ పర్యటన
రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు.

8. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఝలక్ ఇచ్చింది. మరికాసేపట్లో టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనుంది. నేడు 12వ దర్శనానికి టీటీడీ టోకెన్లను జారీ చేస్తోంది. నేటి కోటా పూర్తవగానే టోకెన్ల జారీని నిలిపివేసి తిరిగి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

9. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలానికి హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ 70 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే భక్తుల కోసం 9, 10 తేదీల్లో రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా 70 స్పెషల్‌ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంజీబీఎ్‌సతోపాటు ఎల్‌బీనగర్‌ ముఖ్య కూడళ్లనుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, రిజర్వేషన్‌ కౌంటర్ల నుంచి టికెట్లు బుక్‌చేసుకోవచ్చన్నారు. రద్దీ పెరిగితే బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు తెలిపారు.

10. తెలంగాణ సరిహద్దులో శ్రీరామనవమి.. అదిగో భద్రాద్రి.. ఎటపాక ఇదిగో..
సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దున ఉన్న ఎటపాక మండలంలో జటాయువు మండపం, గుండాల గ్రామంలోని ఉష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావిని భక్తుల దర్శనార్థం సిద్ధం చేశారు. ఏటా భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం,ముక్కోటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు జటాయువు మండపం,ఉష్ణగుండాలను దర్శించుకుంటారు. ఈనెల 10న శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 11న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలంలోని రామాలయంలో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి..గౌతమి అదిగో చూడండి… అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని సీతారాముల కల్యాణానికి భక్తులు తరలివస్తున్నారు.శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే భక్తులు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే వేలాది మంది భద్రాద్రికి ఏటా వస్తుంటారు. అంతేకాకుండా రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. తలంబ్రాల తయారీ, పెళ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకెళుతుంటారు. కరోన కారణంగా స్వామి వారి కల్యాణాన్ని గత రెండేళ్లుగా వీక్షించే భాగ్యాన్ని భక్తులు నోచుకోలేదు.అయితే ఈఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధానకూడల్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
**ఉష్ణగుండాల ప్రాశస్త్యం
సీతమ్మ వారు వనవాస సమయంలో గోదావరిలో స్నానమాచరించే క్రమంలో చన్నీళ్లు పోసుకునేందుకు కొంత అసౌకర్యానికి గురైనట్టు చరిత్ర. ఆ సమయంలో లక్ష్మణుడు తన విల్లంబును ఇసుక తిన్నెల్లో ఎక్కుపెట్టి సంధించగా అక్కడ వేడి నీళ్లు వచ్చాయని ప్రతీతి. ఆ ప్రాంతంలోని గోదావరి ఇసుక తిన్నెల్లో బావి తీస్తే ఇప్పడు కూడా వేడి నీళ్లు వస్తుంటాయి. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేడినీటిని తలపై చల్లుకుంటారు.
*జటాయువు విశిష్టత
సీతారాముల వనవాస సమయంలో సీతమ్మ వారు పర్ణశాల కుటీరంలోనే తలదాచుకున్నారు. రావణాసురుడు ఇక్కడనే సీతమ్మ వారిని అపహరించారు. ఆకాశ మార్గాన ఎత్తుకెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి రావణాసురున్ని నిలువరించేందుకు భీకర పోరాటం చేసిన క్రమంలో రెక్క ఒకటి తెగి పడిన ప్రదేశమే ఎటపాక. మొదట్లో జటాయుపాక, ఆ తరువాత జటపాక, కాలక్రమంలో ఎటపాకగా రూపాంతరం చెందింది. పక్షి కాలుపడిన గుర్తులు నేటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. చిన్నపాటి మండపాన్ని గ్రామస్తులే నిర్మించారు.
*యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం)
ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రదేశం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే శ్రీరామగిరి అని పేరు. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించినట్టు స్థలపురాణం చెబుతోంది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరి మాత పేరుతోనే ఇక్కడి నదిని శబరి నది అంటారు. సబరియే నదిగా మారిపోయిందనే కథ కూడా ఉంది. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహితసంబంధం గల పవిత్రప్రాంతమిది.ఈప్రాంతానికి సమీపంలో రేఖ పల్లిలో (రెక్కపల్లి)(జటాయువు యొక్క రెండవ రెక్క పడిపోయిన చోటు) రెక్కను చూసి జటాయువును చూశారు. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలుచేశారు. గోదావరి తీరంలో ఓపెద్ద శిలపై దానికి పిండ ప్రదానం చేసినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ శిలను మనం దర్శించవచ్చు. ముందు ఈ కొండపై రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ తల్లివారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇక్కడి స్వామిని సేవించిన వారికి అన్ని రకాల మానసిక చింతలు తొలగి ధైర్య స్థైర్యాలు, స్థితి ప్రజ్ఞత ఏర్పడతాయని పెద్దలు చెబుతుంటారు.

11. శ్రీశైలమల్లన్న ఉండి ఆదాయం 3.87 కోట్లు
శ్రీశైల దేవస్థానం ఉభయ దేవాలయాలు మరియు పరివార దేవాలయాల హుండీల లెక్కింపులో16 రోజుల హుండీ రాబడి రూ: 3,87,79,312/-వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. హుండీ లెక్కింపు నగదుతో పాటు 229 గ్రాముల బంగారు, 6 కేజీల 100 గ్రాముల వెండి కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఈ లెక్కింపులో దేవస్థానం అధికారులు బ్యాంక్ అధికారులు శివ సేవకులు పాల్గొన్నారు.