DailyDose

బుర్ర క‌థ‌కు ఆ పేరెలా వ‌చ్చింది? అస‌లు ఫ‌స్ట్‌ ఇవి ఎలా రూపొందాయి?

బుర్ర క‌థ‌కు ఆ పేరెలా వ‌చ్చింది? అస‌లు ఫ‌స్ట్‌ ఇవి ఎలా రూపొందాయి?

ప్రజల ఆచార వ్యవహారాలకు, ఉత్సాహ ఉద్రేకాలకు, సుఖదుఃఖాలకు ‘జానపదం’ అద్దం పడుతుంది. అలాంటి కళారూపాల్లో ‘బుర్రకథ’ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా పల్లెజనాన్ని అలరిస్తూ.. ఇప్పటికీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నది. రాచరికం మొదలు.. ప్రజాస్వామ్యం వరకూ సమాజంలో వచ్చిన ప్రతీ మార్పులో తనదైన పాత్ర పోషించింది. ప్రజలను చైతన్యపరిచింది. స్వాతంత్య్రోద్యమం నుంచి తెలంగాణ విమోచన దాకా.. ప్రతీ ఉద్యమంలోనూ సామాన్యులను ముందుండి నడిపించింది. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, హాస్యం.. వీటన్నిటి సమాహారమే బుర్రకథ. కథకు అనుగుణంగా నవరసాలు పలికించడం ఈ కళాకారుల సొంతం. ఎక్కువగా వీర, రౌద్ర, కరుణరసాల్లో కథ చెబుతారు. సదరు కథ తమ కండ్ల ముందు జరుగుతున్నదా? అనిపించేలా వీక్షకులను కథలో లీనం చేస్తారు.

*యక్షగానమే మూలం
పదహారణాల ప్రజా కళగా పేరొందిన బుర్రకథకు మాతృక యక్షగానం. ఇందులోని ‘జోడు వంతల జంగం కథల’ స్ఫూర్తితో బుర్రకథలు రూపొందాయి. యక్షగానంలో స్త్రీలు ప్రధాన కథకులు. బుర్రకథలో ఆ పాత్ర సామాన్యంగా పురుషులు పోషిస్తారు. కథకుడు వాయించే తంబుర (తంత్రి+బుర్ర) నుంచే ‘బుర్రకథ’కు ఆ పేరు వచ్చింది. ప్రాచీనమైన బుర్రకథ కళారూపానికి డక్కీ కథ, గుమ్మెట కథ, తంబుర కథ, తందాన కథ అనే పేర్లూ ఉన్నాయి. కథ చెప్పేటప్పుడు పలికే వంత.. ‘తందాన తాన’. కాబట్టి దీనిని ‘తందాన పాట’ అని కూడా వ్యవహరిస్తారు. కథ – వంత బుర్రకథ ప్రదర్శన బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ప్రధాన కథకుడు మధ్యలో ఉంటే, ఇరువైపులా వంతలుంటారు. ప్రధాన కథకుడు తంబుర మీటుతూ, నేపథ్యానికి అనుగుణంగా ముందుకూ వెనక్కీ కదులుతూ కథ చెబుతుంటాడు. సందర్భాన్ని బట్టి పళ్లు పటపటా కొరుకుతూ, కళ్లలో రౌద్రం కురిపిస్తాడు. విషాద ఘట్టాల్లో కరుణ రసాన్ని పండిస్తాడు. వంతలు వంతపాడుతూ ఉత్సాహపరుస్తారు.

*ఉద్యమాల్లో కీలకం
బుర్రకథలు ప్రజలకు వినోదం పంచడంతోపాటు వారిని చైతన్యవంతులుగా చేసేవి కూడా. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బుర్రకథ కీలకపాత్ర పోషించింది. సాయుధ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులను స్మరిస్తూ తిరునగరి రామాంజనేయులు రాసిన ‘తెలంగాణ వీరయోధులు’, ఎస్‌.కె.చౌదరి రాసిన ‘హైదరాబాద్‌ ప్రజల స్వాతంత్య్ర పోరాటం’, ‘కాశీం రజ్వీ’, చెర్విరాల బాగయ్య రాసిన ‘షోయబుల్లాఖాన్‌’, కూరపాటి వెంకటరాజు జమీందార్‌ ‘ధర్మయ్యబాబు బుర్రకథ’, అడ్లూరి అయోధ్య రామకవి ‘నైజాం విప్లవం’, ‘నైజాం ప్రజావిజయం’ బుర్రకథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలోనే వచ్చిన ‘ఆంధ్రమహాసభ’ (చౌడవరపు విశ్వనాథం) బుర్రకథ యువత మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తెలంగాణ విమోచన పోరాటోద్యమ కాలంలో ప్రజా నాట్య మండలి ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి బుర్రకథలను మాధ్యమంగా ఉపయోగించుకున్నారు. నాటి తెలంగాణ జీవన స్థితిగతులను వివరించే ‘తెలంగాణ’ బుర్రకథకు షేక్‌ బందగీ వీరగాథను జోడించి చెప్పేవారు.

*కదిలించే సాహిత్యం
బుర్రకథల్లో చక్కటి కవిత్వం ఉంటుంది. వినే ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. బుర్రకథ ప్రేక్షకులు ఎక్కువమంది సామాన్య ప్రజలే. అందుకే కథకులు ఏ కథాంశాన్ని తీసుకున్నా, అప్పటి సమకాలీన పరిస్థితులకు అన్వయించి చెబుతుండేవారు. ప్రజా అభ్యుదయాన్ని కోరుకుంటూ, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేవారు. అయితే, పాశ్చాత్య సంస్కృతి జోరులో ఎన్నో కళారూపాలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయాయి. సామాజిక ప్రయోజనం మిళితమైన బుర్రకథను ఆ జాబితాలో చేరకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.

*చారిత్రక నేపథ్యం
కాకతీయుల కాలం నాటికే ‘తందాన కథలు’ పేరిట బుర్రకథలు జనబాహుళ్యంలో ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్ర’, శ్రీనాథుడి ‘కాశీఖండం’లో తందాన పదాల ప్రస్తావన కనిపిస్తుంది. 13వ శతాబ్దం నాటి ఓరుగల్లులో ‘తందానలు’ మార్మోగేవని వినుకొండ వల్లభుడి క్రీడాభిరామం నుంచి తెలుస్తున్నది.