Devotional

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం – TNI ఆధ్యాత్మికం

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం – TNI ఆధ్యాత్మికం

1. టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్‌ కెహెచ్.రాజేశ్‌ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శ్రీ సీతారామలక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అమరనాథరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణప్రసాద్, శ్వేత సంచాలకులు ప్రశాంతి పాల్గొన్నారు.

2. ఈ ఏడాది Hajj యాత్రకు 10లక్షలమందికి అనుమతి
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం 10లక్షల మంది యాత్రికులను అనుమతించనుంది.సౌదీ అరేబియా ప్రభుత్వం కొవిడ్-19 టీకాలు వేయించుకున్న 65 ఏళ్ల వయసు లోపు వారికి తీర్థయాత్రకు అనుమతించనున్నట్లు సౌదీ సర్కారు శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో ముస్లింలు హజ్ చేయగలరని నిర్ధారిస్తూనే యాత్రికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది.కేటాయించిన కోటాల ఆధారంగా ప్రతి దేశం నుంచి నిర్దిష్ట సంఖ్యలో యాత్రికులు తీర్థయాత్ర చేయడానికి అనుమతించనున్నారు.సౌదీ అరేబియా వెలుపలి నుంచి వచ్చే వారు 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్ కొవిడ్ పరీక్ష ప్రతికూల ఫలితాన్ని సమర్పించవలసి ఉంటుంది.

3. తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సాంబశివరావు, జస్టిస్‌ నాగార్జున దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వారు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ నేషనల్‌ బ్యాంక్‌(నాబార్డ్‌) చైర్మన్‌ జీఆర్‌ చింతల శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు లడ్డూప్రసాదాలు, క్యాలెండర్‌, డైరీ, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.

4. తిరుమలలో మొదలైన సీనియర్‌ సిటిజన్ల దర్శనాలు
దాదాపు రెండేళ్ల తర్వాత వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు శనివారం నుంచి ప్రత్యేక దర్శనాలు మొదలయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 2020 మార్చి రెండవ వారం నుంచి టీటీడీ అన్ని రకాల ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ దర్శనాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలను మొదలుపెట్టినప్పటికీ కొవిడ్‌ పూర్తిస్థాయిలో తగ్గని నేపథ్యంలో ఈ ప్రత్యేక దర్శనాన్ని మాత్రం ప్రారంభించలేదు. అయితే ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిన క్రమంలో శనివారం నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాలను మొదలుపెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా వీరికి టోకెన్లు కేటాయించారు. ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు శనివారం ఉదయం 10 గంటల స్లాట్‌లో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

5. వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం శ్రీరామ నవమి కావడంతో కీలక ఘట్టమైన కోదండరామస్వామి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ వేదపండితులు, అధికారులు. స్థానిక నేతలు హాజరయ్యారు

6.. ముత్యాల పల్లకీలో సీతమ్మ విహారం
కొడుంగైయూర్‌ తిరువళ్లువర్‌నగర్‌లోని సీతారామ కల్యాణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 14 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం భద్రాచలం జరిగే విధంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు సమితి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. సీతారాముల కల్యాణానికి అవసరమైన అక్షింతలను వారం రోజుల రామ దీక్ష చేపట్టిన ముత్తయిదువులు శుక్రవారం రాత్రి వడ్లను గోటితో ఒలిచి బియ్యంగా మార్చి తలంబ్రాలుగా సిద్ధం చేశారు. అనంతరం సీతమ్మవారికి మంగళ స్నానం అనంతరం విశేషాలంకరణ సేవలను భాస్కర పంతుల బృందం నిర్వహించింది. సమితి సభ్యులైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ కల్యాణ సేవా సమితి ట్రస్ట్‌ నిర్వాహకులు పి.మధుమతి రామచంద్రన్‌, వి.రామయ్య శెట్టి, బి.రమేష్‌, మొలగనూరు విజయ్‌కుమార్‌, మంజుల మధుబాబు, బి.దయాకర్‌, జి.లావణ జయప్రకాష్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

7. భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరపనున్నారు.అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో ముందుగా పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావిస్తారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 1,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

8. భద్రాచల రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌‌, సత్యవతి రాథోడ్‌ ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందించారు.సీతారాముల కల్యాణం తిలకించేందుకు రెండేండ్ల తర్వాత భక్తులకు అనుమతించారు. దీంతో భద్రాచలం,ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలనుఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నది.

9. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకుచేరుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 70,727 మంది భక్తులు దర్శించుకోగా 38,970 మంది తలనీలాలుసమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండా ఆదాయం రూ. 3.88 కోట్లువచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించడం లేదని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.

10. చింతమడకలో కొలువైన పట్టాభిరాముడు..పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్‌ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పట్టాభిరాముడు కొలువుదీరాడు. శ్రీరామ నవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందునుంచే మొదలైంది. పట్టాభిరాముల ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం, కలశ స్థాపన కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగాయి.శ్రీరామ నవమి రోజు పురస్కరించుకుని ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవం, శిఖర సంప్రోక్షణ, కల్యాణోత్సవంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి మహిళలు మంగళహారతులు, కుంకుమ తిలకం దిద్దగా, గ్రామస్తులు శ్రీరామ భజనలతో కూడిన ఆధ్యాత్మికతతో వాతావరణంలో సాదరంగా ఆహ్వానించారు.

11. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు అమెరికాకు చెందిన రవి ఐకా అనే వ్యక్తి భారీ మెత్తంలో విరాళం అందించారు. ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాల కొనుగోలుకు ఈ విరాళాన్ని అందజేశారు.అమెరికాకు చెందిన రవి ఐకా అనే వ్యక్తి తితిదే ఎస్వీబీసీకి రూ.1.32 కోట్లు విరాళం అందించారు. శనివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విజయవాడకు చెందిన రామకృష్ణ అనే దాత ప్రతినిధి విరాళం డీడీని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాల కొనుగోలుకు దాత ఇప్పటికే రూ.7 కోట్లు విరాళం ప్రకటించగా, అందులో రూ.4.20 కోట్లు అందజేసి ఉన్నారు.

12. భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం
భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పురాణాబజార్‌ నుంచి శోభాయాత్రను ఎంపీ బాపురావు ప్రారంభించారు. భజరంగదల్, బీజేపీ నేతల సందడిగా శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. రాంలీల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనున్నది. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.