WorldWonders

ఈ గ్రామంలో 500 మంది పేర్లు ‘పోలీసు’

ఈ గ్రామంలో 500 మంది పేర్లు ‘పోలీసు’

“ఒరేయ్, ఒరేయ్…పోలీసూ.., ఇలా రారా..ఇది మీ ఇంట్లో ఇచ్చేయ్. ఓయ్ పొట్టి పోలీసా, నాలుగు రోజులుగా ఎక్కడికెళ్లిపోనావు?
ఇదిగో పోలీసమ్మ 50 మందికి వంటలొండాలి ఎంత ఇమ్మంటావు?”
ఇలా పోలీసు అని పిలుస్తూ, పలకరిస్తూ, మాట్లాడుకొంటున్నవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని మత్స్యలేశం అనే గ్రామంలోని ప్రజలు. ఈ గ్రామాన్ని కొవ్వాడ అని పిలుస్తారు. గ్రామం జనాభా దాదాపు 4,500. అందులో ఐదు వందల మంది ‘పోలీసులే’. అయితే, వీరంతా పోలీసు ఉద్యోగం చేస్తున్నవారు కాదు.కానీ వీళ్లను ఎవరైనా పోలీసు అనే పిలవాలి. ఆధార్ కార్డులో కూడా పోలీసు అని రాసుంటుంది. ఆసక్తికరంగా ఉంది కదూ!
m1
resolution checker
**ఈ పోలీసు కథ ఏంటి?
ఈ గ్రామంలో కొన్ని తరాల నుంచి కూడా పుట్టిన పిల్లలకు పోలీసు అనే పేరు పెట్టే ఆచారం ఉన్నట్లు స్థానికులు చెప్పారు.”ఆడోళ్లకి పోలీసమ్మ అని, మగాళ్లకి పోలీసు అని పేరు పెట్టుకుంటాం. కుటుంబంలో ముందు పుట్టిన పిల్లలకు ఈ పేరు తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఈ పేరు పెట్టుకుంటేనే వారికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇంట్లో ఆ పేరుతో పిలిచినా, బయట మాత్రం వేరే పేర్లతోనే పిలిపించుకుంటారు” అని బర్రి పోలీసు అనే మహిళ బీబీసీకి తెలిపారు.

“ఆధార్ చూస్తే కానీ నమ్మరు”
కొవ్వాడ మత్స్యలేశం ఒక మత్స్యకార గ్రామం. గ్రామస్థుల్లో అత్యధికులు మత్స్యకారులే. వీరంతా వేట కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు కూడా వెళ్తుంటారు. అలా వెళ్లే మత్స్యకారులను అక్కడి పోలీసులు, కోస్టు గార్డు, మెరైన్ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రశ్నిస్తూ ఉంటారు.”అలా ప్రశ్నించేటప్పడు మా పేరు అడుగుతారు. పోలీసని చెబితే నమ్మరు. మరిన్ని ఎక్కువ ప్రశ్నలు వేసి అనుమానంగా చూస్తారు. మా ఆధార్ కార్డును ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు. మీ పేరు ‘పోలీసా ‘ అని అడుగుతారు. అవును అని చెప్తాం. అదేంటి పోలీసు పేరు పెట్టుకోవడమేంటి…అందులోనూ, మీలో చాలా మందికి ఇదే పేరు ఉందేంటి..? అని ఆశ్చర్యంగా అడుగుతారు”.”పోలీసు అనే పేరుని అడ్డుపెట్టుకుని మీరేదైనా చట్ట వ్యతిరేక పనులు ప్లాన్ చేసుకుని వచ్చారా అని గుజరాత్‌లో పోలీసులు అనుమానంగా అడిగిన రోజులు ఉన్నాయి” అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కొవ్వాడ మత్స్యకారుడు మైలపల్లి పోలీసు.