Devotional

నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై బ్రహ్మోత్సవాలు  – TNI ఆధ్యాత్మికం

1. ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మ చైత్రమాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో తొలి ఐదు రోజులు అమ్మవారికి వివిధ రకాల వాహన సేవలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఆలయ వేదపండితులు, అర్చకులు ఆది దంపతుల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు చేయించి వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం 4.30 గంటల నుంచి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13, 14 తేదీల్లో ఉదయం ఎనిమిది గంటలకు మూలమంత్ర హవనం, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ జరుగుతాయి. 15న గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఎనిమిది నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ కవి పండితులతో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటలకు కల్యాణం జరుగుతుంది. 17వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పూర్ణాహుతి, ధాన్యకొట్రోత్వం, వసంతోత్సవం, అవభృత స్నానం, మూకబలి, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి. 18వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 7.30 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, 8.30 గంటలకు దుర్గామల్లేశ్వరులకు పుష్పయాగ శయనోత్సవం (పవళింపు సేవ), 19, 20 తేదీల్లో రాత్రి తొమ్మిది గంటలకు ఏకాంత సేవ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు.
*వాహన సేవలు ఇలా..
బ్రహ్మోత్సవాల సందర్భంగా గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు ఐదు రోజులు వాహన సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు 12వ తేదీన వెండి పల్లకీసేవ, 13న రావణ వాహన సేవ, 14న నంది వాహన సేవ, 15న సింహ వాహన సేవ, 16న వెండి రథోత్సవాన్ని జరుపుతారు. రోజూ సాయంత్రం ఐదు గంటలకు రాయబార మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై జమ్మిదొడ్డి, కోమల విలాస్‌, సామారంగం చౌక్‌, బ్రాహ్మణవీధి, రథం సెంటర్‌ మీదుగా తిరిగి దుర్గగుడి మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకునేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.

2. సీతారాములకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా సీతారామలక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలిపి, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తర్వాత రంగనాయక మండపంలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషస్త్రక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, ఈవో జవహర్‌రెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు

3. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంతోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్సులు, మాడవీధులు, లడ్డూకౌంటర్లు, అఖిలాండం భక్తులతో కిటకిటాడుతున్నాయి. సోమవారం సాయంత్రం వరకు ఈ వారాంతపు రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి.

4. ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. టీటీడీ వేద పండితులు ఆదివారం శాస్త్రోక్తంగా ఽధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కోదండరాముడిని శేషవాహనంపై ఊరేగించారు. రాజంపేట నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, ఆయన సతీమణి సుచరిత కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు.

5. కమనీయం.. రాములోరి కల్యాణం!
జగదభిరాముడు.. లోకాభిరాముడు.. శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఏటా కన్నులపండువగా జరిగే రాములోరి కల్యాణ వేడుక కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు కేవలం ఆంతరంగికంగానే జరిగింది. ఈ ఏడాది మాత్రం శ్రీరామ నవమి వేడుకలు మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత మండపంలో అశేష భక్తజనకోటి జయజయ ధ్వానాల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగాయి. శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని తిలకించి.. భక్తులు పులకించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు సీతారాముల కల్యాణ వైభోగాన్ని కనులార చూసి పరవశించారు. జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌.. అంటూ భక్తులు పారవశ్యం.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. కల్యాణ తంతును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు.. మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఒక్క శ్రీ సీతారామచంద్రమూర్తికి తప్ప మరే దేవుడికీ నిర్వహించని విలక్షణమైన ఉత్సవం మహాపట్టాభిషేకం. ఇది భద్రాచలంలో మాత్రమే నిర్వహిస్తారు. సోమవారం జరిగే పట్టాభిషేక వేడుకకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మన రాష్ట్రంలోనూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో సీతారాముల కల్యాణం ఆదివారం కన్నులపండువగా జరిగింది. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలను, ముత్యాలను ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ఝాన్సీలక్ష్మీ దంపతులు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరి క్షేత్రపాలకులైన సీతారాముల దివ్యకల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది.

6. సీతారాములకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా సీతారామలక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలిపి, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తర్వాత రంగనాయక మండపంలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషస్త్రక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, ఈవో జవహర్‌రెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

7. హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు

8. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి.

9. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను మంత్రి ఆర్కే రోజా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయమర్యాదలతో రోజాకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి రోజాకు ఈవో భ్రమరాంబ అందజేశారు.

10. కన్నడ హీరో, రాక్‌స్టార్‌ యశ్‌, కేజీఎఫ్‌ 2 చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీం తీర్థ యాత్రలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో కేజీఎఫ్‌ 2 హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంత‌రం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే నిన్న(ఆదివారం) ధర్మస్థల మంజునాథ్‌స్వామి, కుక్కే సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేజీఎఫ్‌– 2 బృందం ఉన్నారు. యశ్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగపడ్డారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండా కుక్కెకి వెళ్లిపోయారు. ఈ నెల 14న కేజీఎఫ్‌–2 దేశవ్యాప్తంగా విడుదలవుతున్న తరుణంలో చిత్రబృందం పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది.

11. సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళి సై
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు.
సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమిళి సై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

12దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అయితే పలుచోట్ల అవాంఛీనయ ఘటనలు నమోదయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శోభాయాత్రల సందర్భంగా స్వల్ప మతఘర్షణలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో ఊరేగింపుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం ఈ ఘర్షణలకు కారణమయింది. హింస, వాహన దహనాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు బాష్ఫవాయు గోళాలను ప్రయోగించాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్ఫ్యూ విధించినట్టు ఖర్గోన్‌ అడిషనల్ కలెక్టర్ ఎస్‌ఎస్ ముజల్దే వెల్లడించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో కొందరు వ్యక్తులు రాయిలు విసురుతున్నట్టు కనిపించింది. కొంతమంది వాహనాలకు నిప్పు అంటిస్తూ కనపడ్డారు. ఈ ఘర్షణల్లో పోలీసులతోపాటు పౌరులు కూడా గాయపడ్డారు. నాలుగు ఇళ్లు కాలిపోగా, ఒక దేవాలయం ధ్వంసమైంది.

13. 14 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14న ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని నాలుగు మాడవీధులలో ఊరేగించి వసంతోత్సవ మండపానికి తరలిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తరువాత తిరిగి ఆలయానికి చేరుస్తామన్నారు. 15న బంగారు రథంపై ఊరేగింపు, 16న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని వివరించారు.ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తామన్నారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవ‌ను టీటీడీ రద్దు చేసిందని అధికారులు పేర్కొన్నారు.

14. యాదాద్రిలో దర్శనానికి 2 గంటలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి.