Business

నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..! – TNI వాణిజ్య వార్తలు

నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!  – TNI వాణిజ్య వార్తలు

* భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు సోమవారం రోజున నష్టాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌తో సూచీలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేశారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు లేదా 0.81 శాతం పతనమై 58,965 వద్ద ముగిసింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 17,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.62 శాతం పెరగగా…స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ 0.06 శాతం క్షీణించడంతో మిడ్ అండ్‌ స్మాల్ క్యాప్ షేర్లు మిశ్రమ ఫలితాలను పొందాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా,సన్ ఫార్మా లాభాలను గడించాయి. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ భారీ నష్టాల్లో మూటగట్టుకున్నాయి. గత వారం హెచ్‌డీఎఫ్‌సీ మెగా-విలీనాన్ని ప్రకటించన తదుపరి రోజు నుంచిహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వరుసగా ఐదు సెషన్లలో భారీ నష్టాలను పొందాయి. విలీన ప్రకటన తరువాత వచ్చిన లాభాలు మొత్తం నీరుగారిపోయాయి. నిఫ్టీలో హెచ్‌సిఎల్ టెక్ టాప్ లూజర్‌గా నిలిచింది.

*ఈ వారం మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు స్థూల ఆర్థిక గణాంకాలు నిర్ధేశించే వీలుంది. ఈ వారంలో ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మహావీర్‌ జయంతి, అంబేడ్కర్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడే కారణంగా గురు, శుక్రవారాల్లో మార్కెట్లు పనిచేయవు. స్థూలంగా ఈ వారం స్టాక్‌ మార్కెట్లు మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. గత వారం ఆర్‌బీఐ పరపతి విఽధానం సానుకూలంగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో పాజిటివ్‌గానే క్లోజయ్యాయి. ఈ వారం కూడా సానుకూల ధోరణిలోనే సాగే అవకాశాలున్నాయి.

*5జీ స్పెక్ట్రమ్‌ ధరపై టెలికాం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిళ్లకు దిగాయి. గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసిన ధరను 80-90 శాతం తగ్గిస్తే తప్ప కంపెనీలు వేలంలో పాల్గొనే పరిస్థితి లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) స్పష్టం చేసింది. 5జీ సేవలకు బాగా ఉపయోగపడే 3300-3600 మెగాహెర్జ్‌ (ఎంహెచ్‌జెడ్‌) బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను ఒక్కో ఎంహెచ్‌జెడ్‌ రూ.492 కోట్ల కనీస ధర చొప్పున వేలం వేయాలని గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసింది. ఇంత ధర పెట్టి 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి.. దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు ఒక్కో ఆపరేటర్‌ ఎంత లేదన్నా రూ.49,200 కోట్లు ఖర్చు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో ఏ కంపెనీ కూడా అంత భరించే స్థితిలో లేనందున ఈ ధరను 80 నుంచి 90 శాతం వరకు తగ్గించాలని సీఓఏఐ కోరింది. 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ట్రాయ్‌ కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ లోపే కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి

*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధిపతులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పీఎస్‌బీల పనితీరు, వివిధ ప్రభుత్వ పథకాల అమలులో వాటి పురోగతి, కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యల అమలుపై సమీక్షిస్తారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత పీఎస్‌బీల పనితీరు సమీక్ష కోసం జరుగుతున్న తొలి సమావేశ మిదే. కొన్ని ఉత్పాదక రంగాలకు పీఎస్‌బీలు త్వరగా రు ణాలు మంజూరు చేయడంపై ఇందులో చర్చించనున్నారు.

*షెల్‌ ఎనర్జీ ఇండియా.. రిటైల్‌ ఎల్‌ఎన్‌జీ ( లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులోభాగంగా త్వరలో గుజరాత్‌లోని హజీరా వద్ద ఎల్‌ఎన్‌జీ రిటైల్‌ అమ్మకాల కోసం ప్రత్యేక స్టేషన్‌ ఏర్పాటు చేయబోతోంది. ఎక్కువ దూరం ప్రయాణించే సరుకు రవాణా వాహనాలే లక్ష్యంగా ఈ ఎల్‌ఎన్‌జీ ఔట్‌లెట్లు పనిచేయనున్నాయి. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. కాగా ఎల్‌ఎన్‌జీ రిటైల్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న తొలి ప్రైవేట్‌ కంపెనీ షెల్‌ ఎనర్జీ ఇండియా కానుంది.

*రిటైల్‌ మదుపరుల్లో ఎక్కువ మంది స్టాక్‌ మార్కెట్‌ కంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)లో మదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల్లోకి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1.64 లక్షల కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఇందులో రూ.1.24 లక్షల కోట్లు సిప్‌ల రూపంలో సమకూరాయి. కొవిడ్‌ దెబ్బతో 2020-21లో ఈ పథకాల నుంచి మదుపరులు రూ.25,966 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో దేశంలో ఈక్విటీ ఎంఎఫ్‌ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ ఈ ఏడాది మార్చి నాటికి రూ.13.65 లక్షల కోట్లకు చేరింది. 2021 మార్చితో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ.

*క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై విధించే ఆదాయ, జీఎస్‌టీ పన్నులపై ప్రభుత్వం త్వరలో మరింత స్పష్టత ఇవ్వబోతోంది. తరచూ అడిగే ప్రశ్న (ఎఫ్‌ఏక్యూ) పేరుతో దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్‌బీఐ, రెవెన్యూ శాఖ ఒక ముసాయిదా పత్రం సిద్ధం చేస్తున్నాయి. ఈ పత్రం సిద్ధమైన తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదంతో విడుదల చేస్తారు. క్రిప్టో కరెన్సీ లాభాలను ఆర్థిక మంత్రి ఇటీవలే ఆదాయ పన్ను పరిధిలోకి తెచ్చారు.

*ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నా దేశంలో పసిడికి డిమాండ్‌ తగ్గడం లేదు. దీంతో 2022 మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం లో దేశంలోకి పసిడి దిగుమతులు 4,614 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3,48,357 కోట్ల చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 33.34 శాతం ఎక్కువ. చమురు, పసిడి దిగుమతుల భారంతో ఎగుమతి దిగుమతుల మధ్య ఉండే వాణిజ్య లోటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 19,241 కోట్ల డాలర్లకు (సుమారు రూ.14.52 లక్షల కోట్లు) చేరింది. గత ఆర్థిక సంవత్సరం ప్రపంచ పసిడి వినియోగంలో చైనా తర్వాత మన దేశం రెండో స్థానంలో నిలిచింది. మన దేశానికి దిగుమతయ్యే బంగారంలో ఎక్కువ భాగం నగల తయారీకి వినియోగిస్తున్నారు.

*రుణదాతల పనితీరును సమీక్షించే క్రమంలో ఆర్ధిక శాఖా మంత్రి సీతారామన్ ఈ నెల 23 న పీఎస్‌బీల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం(2022-23) బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఇది మొదటి పూర్తి సమీక్ష సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై రుణదాతల పనితీరు, సాధించిన పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23 న ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతులతో సమావేశం కానున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను నిర్మలా సీతారామన్ ఇప్పటికే కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్) సహా ఆయా విభాగాలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమగ్ర సమీక్ష జరగనుంది

*ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తి తన భర్త అయిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను వివాదం నుంచి గట్టెక్కించేందుకు కీలక ప్రకటన చేశారు. భారత్‌ నుంచి ఆర్జిస్తున్న సొమ్ముతో సహా తన మొత్తం ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మధ్యనే ముగిసిన పన్ను మదింపు సంవత్సరానికి కూడా తన నిర్ణయం వరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా వృత్తిపరమైన జీవితం, నా భర్త రాజకీయ కెరీర్‌ పూర్తిగా వేర్వేరు. ఎన్నో ఏళ్లుగా ఇన్ఫోసి్‌సలో నాకున్న వాటా కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. అది నా తండ్రి కృషికి సాక్ష్యం. ఆ విషయం పట్ల నేనెంతో గర్వపడుతున్నాను. బ్రిటన్‌లో నా పన్ను హోదా నా భర్తకు సమస్యగా మారడం లేదా కుటుంబాన్ని ప్రభావితం చేయడం నాకిష్టం లేదని’’ ట్విటర్‌లో పేర్కొన్నారు.

*ట్విట్టర్ బోర్డులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ చేరికపై మరో కుబేడురు జెఫ్ బెజోస్‌కు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక విమర్శ చేసింది. అయితే దీనికి మస్క్ ఇచ్చిన సమాధానం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ట్విట్టర్ చాలా యాక్టివ్‌గా ఉండే మస్క్.. తరుచూ హాస్యభరితంగా, వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తుంటారు. అలాగే తనపై వాషింగ్టన్‌ పోస్ట్‌లో వచ్చిన ఆర్టికల్‌పై కూడా ఆయన అదే విధంగా స్పందించారు. ట్విట్టర్‌ బోర్డులో మస్క్ చేరికను వ్యతిరేకించిన వాషింగ్టన్ పోస్ట్‌.. ఒక ఆర్టికల్‌లో ‘‘ధనవంతులు మన కమ్యూనికేషన్ ఛానళ్లను నియంత్రించకుండా నిరోధించడానికి సోషల్ మీడియా వేదికలపై ధనికుల నియంత్రణ తగ్గించాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ బోర్డ్‌కి మస్క్ నియామకం తెలియజేస్తుంది’’ అని రాసుకొచ్చారు. మార్క్ అండర్సన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఆర్టికల్‌కి సంబంధించిన క్రాప్డ్‌ ఇమేజ్‌ని షేర్ చేశారు. దీనికి మస్క్ సమాధానం ఇస్తూ ‘‘నవ్వు ఆగడం లేదు. కడుపు పగిలేలా నవ్వొస్తుంది’’ అంటూ సమాధానం రాసుకొచ్చారు.