Kids

జూలో ఏ జంతువులకు ఎంతెంత పెడతారు?

జూలో ఏ జంతువులకు ఎంతెంత పెడతారు?

ఈ లెక్కలు జూపార్కులో ఏనుగులు ఎన్ని ఉన్నాయో…తాబేలు బురువెంతో చెప్పేవి కాదు. జూ పార్క్‌లో అవి తీసుకునే కిలోల ఆహారం…
హైదరాబాదులోని జవహార్‌లాల్‌నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు)లో ఏ జంతువుకు ఏ ఆహారం పెడతారు? ఎంత మోతాదులో ఇస్తారన్న విషయాలు చాలా మందికి తెలియవు. జూపార్కులోని జంతువులు, పక్షులు ఏం తింటాయి… వాటి ఆలనాపాలనా ఎలా ఉంటుంది… వాటికి జబ్బు చేస్తే ఎలా? ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ తినే ఆహారానికి, జూలో ఇచ్చే ఆహారానికి తేడా వుంటుంది. అడవుల్లో సహజసిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అయితే ఆ ఆహారాన్ని వాటికవే వేటాడి సంపాదించుకుంటాయి. జంతువుల వయసు పెరిగి సత్తువ తగ్గినప్పుడు ఆహారం దొరకక ఆకలితో చచ్చిపోతాయి. కొన్నిసార్లు వ్యాధుల బారిన పడతాయి. అదే జూలో అయితే సమయానికి బలవర్థకమైన ఆహారం, ఆవసరమైనప్పడు మందులు ఇస్తారు. దీంతో అడవుల్లో తిరిగే జంతువులకంటే జూలో పెరిగే జంతువులు ఎక్కువ కాలం జీవిస్తాయనడంలో సందేహం లేదు. జూలో ఎవరికెంత పెడతారో తెలుసుకుందామా…
**ఏనుగు 250 కిలోలు..
రోజు మొత్తంలో ఏనుగుకి సుమారు 250 కిలోల ఆహారం తీసుకుంటుంది. 100 కిలోల జమ్ము గడ్డి, 50 కిలోల చొప్ప, 20 కిలోల రావి ఆకు, 5 కిలోల రాగి సంకటి, 8 కిలోల దాణా (మొక్క జొన్న, గోధుమ పొట్టు, తౌడు, వేరుశనగ చెక్క అన్నీ కలిపి)తోపాటు అరకిలో బెల్లం, ఒక కొబ్బరికాయ.
**సింహాలు, పులులు..
ఉదయం అర లీటరు పాలు, ఒక గుడ్డుతోపాటు ఆడవాటికి ఆరు కిలోల మాంసం, మగ వాటికి 8 కిలోల మాంసం, పావు కిలో కాలేయం.
**చీతాలు, జాగ్వార్‌లకు…
పావు లీటర్‌ పాలు, మూడు కిలోల మాంసం, వంద గ్రాముల కాలేయం.
**జిరాఫీకి…
ఉదయం ఒక కిలో క్యారట్‌, 2 కిలోల అరటిపండ్లు, 5 కిలోల రావి ఆకు, 2 కిలోల గడ్డి 1 కిలో ఆపిల్‌, 2కిలోల దుంపలు, అర కిలో ఉల్లిగడ్డ, సాయంత్రం 5 కిలోల గడ్డి, 2 కిలోల దాణా, 2 కిలోల దుంపలు
**ఎలుగుబంటికి…
ఉదయం అర లీటర్‌ పాలు, అర కిలో బ్రెడ్‌, 50 గ్రాముల తేనె, ఒక గుడ్డు. సాయంత్రం 2 కిలోల జొన్న గటక, అర కిలో పండ్లు (వీటిలో అన్నిరకాల పండ్లు ఉంటాయి)
**ఖడ్గమృగానికి…
ఉదయం 4 కిలోల దాణా (మొక్క జొన్న, గోధుమ పొట్టు, తౌడు, వేరుశనగ చెక్క అన్నీ కలిపి), 40 కిలోల గడ్డి, 5 కిలోల రావి ఆకు, 4 కిలోల అరటిపండ్లు, 2 కిలోల చెరుకు, అర కిలో బెల్లం.
**మొసలికి..
అర కిలో చనిపోయిన చేపలు, కిలో మాంసం
**సరీసృపాలకు…
పాములు వారంలో ఒకరోజు మాత్రమే ఆహారం తీసుకుంటాయి. ప్రతి సోమవారం ఒక బ్రాయిలర్‌ కోడి, ఒక కప్ప, ఒక తొండతోపాటు ప్రత్యేకంగా పెంచుతున్న కొన్ని కీటకాలు.
**పక్షులకు…
జూపార్కులో పెంచుతున్న అన్నిరకాల గింజ ధాన్యాలు, పండ్లతోపాటు రోజుకు రెండు చొప్పున డ్రై ఫ్రూట్స్‌.
**తాబేలు..
జూపార్కులో అతి తక్కువ ఆహారం తీసుకునేది తాబేలు. దీనికి ప్రతిరోజూ 100 గ్రాముల బొప్పాయి, కీర, టమాట లాంటి మెత్తటి ఆహారం ఇస్తారు. అవసరం మేరకు మెనులో మార్పులు చేస్తారు. సాధారణంగా జంతువుల అభిరుచిని బట్టి వాటికి ఆహారం అందిస్తారు. వాటికి జ్వరం, ఇతర జబ్బులు చేసినప్పుడు వాటికి వైద్యచికిత్సలు అందిస్తూ వాటి అవసరం మేరకు, అవి తినగలిగేలా ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తుంటామని జూ అధికారులు తెలిపారు.