Business

టూవీలర్‌ కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌..! – TNI వాణిజ్య వార్తలు

టూవీలర్‌ కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌..! – TNI వాణిజ్య వార్తలు

* ప్రముఖ టూవీలర్‌ ఆటోమొబైల్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు బైక్స్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ధరల పెంపు ఉండనుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ , హెచ్‌ఎఫ్ డీలక్స్ , గ్లామర్ , సూపర్ స్ప్లెండర్ , ఎక్స్‌పల్స్ 200 , ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ , ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ , హెచ్‌ఎఫ్ 100 బైక్స్‌ ధరలు భారీగా పెరిగాయి. హీరో ఎక్స్‌ పల్స్‌ 200టీ, హీరో స్ప్లెండర్ iSmart, హీరో X పల్స్ 200 స్టాండర్డ్‌ వేరియంట్‌, హీరో ప్యాషన్ ప్రో బైక్‌ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు.
*.ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ దూసుకెళ్తున్న నేపథ్యంలో తయారీ సామర్థ్యం పెంచుకోనున్నట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 6,000 యూనిట్ల దాకా బుకింగ్స్‌ను కంపెనీ అందుకుంటోంది. టాటా మోటార్స్‌ దేశంలో నెక్సన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ, ఎక్స్‌ప్రెస్‌–టి మోడళ్లను విక్రయిస్తోంది
*యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్‌ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్‌ద ఫుడ్‌ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్‌ ప్రకటించారు.
*టెలికాం స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి భారత టెలికాం నియంత్రణ మండలి(ట్రాయ్‌) తాజా ప్రతిపాదనలను సోమవారం విడుదల చేసింది. 3,300-3,670 మెగాహెట్జ్‌ బ్యాండ్‌కు చెందిన ప్రైమ్‌ 5జీ స్పెక్ట్రమ్‌ ఒక్కో మెగా హెట్జ్‌ కనీస ధరను రూ.317 కోట్లుగా ప్రతిపాదించింది. గతం(2018)లో ట్రాయ్‌ ప్రతిపాదించిన రూ.492 కోట్ల కనీస ధరతో పోలిస్తే 35 శాతం తక్కువిది. అలాగే, 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ కనీస రిజర్వ్‌ ధరను గతంలో కంటే 40 శాతం తక్కువకు రూ.3,927 కోట్లుగా ప్రతిపాదించింది. గతంలో సూచించిన ధరలతో పోలిస్తే, ఈసారి ట్రాయ్‌ అన్ని బ్యాండ్‌ల కనీస రిజర్వ్‌ ధరను సగటున 39 శాతం తగ్గించింది. 700, 800, 900, 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్‌ బ్యాండ్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం స్పెక్ట్రమ్‌తోపాటు కొత్తగా 600, 3,300-3,670, 24.25-28.5 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెకా్ట్రన్ని వేలం వేయనున్నట్లు ట్రాయ్‌ వెల్లడించింది. అంటే, అన్ని బ్యాండ్లలో కలిపి లక్ష మెగాహెట్జ్‌లకు పైగా స్పెక్ట్రమ్‌ వేలానికి అందుబాటులోకి రానుంది. తాజాగా ప్రతిపాదించిన రిజర్వ్‌ ధర ప్రకారం.. 30 ఏళ్లకు కేటాయిస్తే గనుక ఈ లక్ష మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ.7.5 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంటుంది. 20 ఏళ్లకు కేటాయిస్తే, రూ.5.07 లక్షల కోట్ల వరకు సమకూరవచ్చని అంచనా.
* శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో గ్లోబల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ కేకేఆర్‌ 9.99 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ అనిల్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశీయంగా వినియోగదారులకు మెరుగైన జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను అందించడానికి కేకేఆర్‌ వాటా కొనుగోలు దోహదం చేయగలదని తెలిపారు. వాటా కొనుగోలు విలువను బయటకు వెల్లడించలేదు. అయితే.. ఈ వాటా విలువ దాదాపు రూ.1,800 కోట్లు ఉండవచ్చని అంచనా.
*అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగ ఉపశమిస్తోంది. నిన్నమొన్నటి వరకు 100 డాలర్లపైన పలికిన బ్యారల్‌ చమురు ధర సోమవారం వంద డాలర్ల దిగువకు వచ్చింది. జూన్‌లో డెలివరీ ఇచ్చే బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర నాలుగు డాలర్లు తగ్గి 98 డాలర్లకు చేరింది. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ చమురు ధరా 4.19 డాలర్లు తగ్గి 94.07 డాలర్ల వద్ద ట్రేడైంది.
*5జీ స్పెక్ట్రమ్‌ ధరపై టెలికాం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిళ్లకు దిగాయి. గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసిన ధరను 80-90 శాతం తగ్గిస్తే తప్ప కంపెనీలు వేలంలో పాల్గొనే పరిస్థితి లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) స్పష్టం చేసింది. 5జీ సేవలకు బాగా ఉపయోగపడే 3300-3600 మెగాహెర్జ్‌ (ఎంహెచ్‌జెడ్‌) బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను ఒక్కో ఎంహెచ్‌జెడ్‌ రూ.492 కోట్ల కనీస ధర చొప్పున వేలం వేయాలని గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసింది. ఇంత ధర పెట్టి 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి.. దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు ఒక్కో ఆపరేటర్‌ ఎంత లేదన్నా రూ.49,200 కోట్లు ఖర్చు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో ఏ కంపెనీ కూడా అంత భరించే స్థితిలో లేనందున ఈ ధరను 80 నుంచి 90 శాతం వరకు తగ్గించాలని సీఓఏఐ కోరింది. 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ట్రాయ్‌ కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ లోపే కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి
*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధిపతులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పీఎస్‌బీల పనితీరు, వివిధ ప్రభుత్వ పథకాల అమలులో వాటి పురోగతి, కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యల అమలుపై సమీక్షిస్తారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత పీఎస్‌బీల పనితీరు సమీక్ష కోసం జరుగుతున్న తొలి సమావేశ మిదే. కొన్ని ఉత్పాదక రంగాలకు పీఎస్‌బీలు త్వరగా రు ణాలు మంజూరు చేయడంపై ఇందులో చర్చించనున్నారు.
*షెల్‌ ఎనర్జీ ఇండియా.. రిటైల్‌ ఎల్‌ఎన్‌జీ ( లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో గుజరాత్‌లోని హజీరా వద్ద ఎల్‌ఎన్‌జీ రిటైల్‌ అమ్మకాల కోసం ప్రత్యేక స్టేషన్‌ ఏర్పాటు చేయబోతోంది. ఎక్కువ దూరం ప్రయాణించే సరుకు రవాణా వాహనాలే లక్ష్యంగా ఈ ఎల్‌ఎన్‌జీ ఔట్‌లెట్లు పనిచేయనున్నాయి. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. కాగా ఎల్‌ఎన్‌జీ రిటైల్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న తొలి ప్రైవేట్‌ కంపెనీ షెల్‌ ఎనర్జీ ఇండియా కానుంది.