Devotional

ఇక పెళ్లిల్లె పెళ్ళిళ్ళు

ఇక పెళ్లిల్లె పెళ్ళిళ్ళు

రెండేళ్లుగా కల్యాణాలకు దూరంగా బంధువులు
కరోనా తొలగిపోవడంతో మళ్లీ కళకళ

మాంగల్యం తంతునా.. మమ జీవనం హేతునా.. కంఠే భద్మామి సుభగే…త్వం జీవ శరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు ఈ సారి మారుమోగనున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా దూరం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో పరిణయ ఝరి పరిమళించనుంది. గత రెండేళ్లలో కేవలం వధూవరుల బంధువులు 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతులు ఉండటంతో పెళ్లిళ్లలో కళ తప్పింది. ఈసారి ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో యువతీ యువకులు, తల్లిదండ్రులు సంబర పడుతున్నారు.

*మొదలైన సందడి
ఇప్పటికే కొందరు పెళ్లికార్డులు ఆర్డర్లు ఇస్తూనే కల్యాణ మండపాలు అడ్వాన్సులు ఇచ్చి మరీ బుక్‌ చేసుకోవడం మొదలెట్టారు. మంచి ముహూర్తం కోసం పురోహితులను కలుసుకోవడం ముమ్మరం చేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ మహిళలు కొందరు బంగారు నగలు కొంటుంటే… మరికొందరు చీరలు కొనడం మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు.

*ఒక పెళ్లి ఎంతో మందికి ఉపాధి
పెళ్లంటే రెండు కుటుంబాలు కలవడం అంటారు. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లంటే ముందుగా గుర్చొచ్చేవి పెళ్లి పత్రికలు, నూతన పట్టు చీరలు, వధూవరుల పరిణయ పట్టు వస్త్రాలు, ఫొటోలు, వీడియోలు, ట్రావెల్స్‌ ఏజెంట్లు, పెళ్లి మండపాలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్రీ షియన్స్, బ్యాండ్‌ మేళం వారు. వీరంతా రెండేళ్లుగా ఉపాధి లేక అగచాట్లు పడ్డారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండటంతో ఉపాధి దొరుకుతుందని వారంతా సంబర పడుతున్నారు.

*మూడు నెలలు ముహూర్తాలే
శుభకృత్‌ నామ సంవత్సరంలో వివాహాలు, శుభకార్యాల ముహూర్త తేదీలు
ఏప్రిల్‌ : 13, 14, 15, 16, 17, 21, 22, 24
మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్‌ : 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23.