NRI-NRT

జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం

జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం

ఈ సంవత్సరం జీ7 సదస్సులో పాల్గొనాలని భారత దేశాన్ని ఆహ్వానించబోతున్నట్లు జర్మనీ సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ఆహ్వానం త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. జర్మనీ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు బవేరియన్ అల్ప్స్‌లోని ష్లోస్ ఎల్మావులో వచ్చే నెల 26 నుంచి 28 వరకు జరుగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ సదస్సు జరగబోతోంది. జీ7 సదస్సుకు భారత్‌ను మొట్టమొదటిసారి 2003లో ఆహ్వానించారు. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని ఫ్రాన్స్ ఆహ్వానించింది. 2005 నుంచి 2009 వరకు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారత్‌కు ప్రాతినిధ్యంవహించారు. 2019లో ఈ సదస్సుకు ఫ్రాన్స్ సుహృద్భావ భాగస్వామిగా భారత్‌ను ఆహ్వానించింది. 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. అయితే కోవిడ్ మహమ్మారి వల్ల ఈ సమావేశం జరగలేదు. 2021లో బ్రిటన్ ఆహ్వానించింది, మన దేశంలో కోవిడ్ రెండో ప్రభంజనం కారణంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇదిలావుండగా, రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం నేపథ్యంలో భారత్‌ను జీ7 సదస్సుకు ఆహ్వానించడంపై శ్రద్ధ చూపడం లేదనే వార్తలను జర్మనీ ఖండించింది. ఈ సదస్సుకు భారత్‌తోపాటు మరికొన్ని దేశాలను కూడా ఆహ్వానించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, జర్మనీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఫిబ్రవరిలో జర్మనీలో పర్యటించారు.2019లో అప్పటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్‌లో పర్యటించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్‌ (ఐజీసీ) జరుగుతాయి. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.