Agriculture

మామిడికి రికార్డు ధర

మామిడికి రికార్డు ధర

వరంగల్‌లో మామిడికి రికార్డు ధర పలికింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో బుధవారం టన్నుకు మామిడి రూ.80 వేలు దక్కింది. గత ఏడాది కంటే మామిడి సీజన్‌ నెల రోజులు ఆలస్యంగా వచ్చినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఏటా మార్చి మొదటి వారంలో సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ సారి ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభమైంది.
డిసెంబర్‌, జనవరి నెలల్లో అధికంగా వర్షాలు కురవడం వల్ల పూత రాలిపోయి.. దిగుబడి కూడా తగ్గింది. ఇప్పుడిప్పుడే మామిడి కాయలు వస్తుండగా రంజాన్‌ మాసం ప్రారంభమైనందున కాయలకు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది సీజన్‌ ప్రారంభంలో టన్నుకు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండగా, ఈ సారి టన్నుకు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. మార్కెట్‌కు మామిడికాయలు ఎక్కువగా వస్తే ధరలు చాలా తగ్గే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.