Politics

మంత్రులకు భారీ షాక్ ఇచ్చిన యోగి !- TNI రాజకీయ వార్తలు

మంత్రులకు భారీ షాక్ ఇచ్చిన యోగి !- TNI రాజకీయ వార్తలు

* అధికారిక పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలని, బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని రాష్ట్ర మంత్రులను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ ఆదేశాలను ఇచ్చారని ఓ అధికారి బుధవారం తెలిపారు. హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలనే నిబంధన ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తుందని యోగి చెప్పారు. అధికారులు సరైన సమయానికి విధులకు హాజరుకావాలని, భోజన సమయం 30 నిమిషాలకు మించకూడదని ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో భోజన విరామ సమయం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు ఉంటుంది. విధులకు ఆలస్యంగా హాజరయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రామాణిక, నాణ్యమైన సేవలను సకాలంలో అందజేస్తామని తెలిపే సిటిజన్స్ చార్టర్‌ను అమలు చేస్తామన్నారు. కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఫైలును సకాలంలో పరిష్కరించాలని, ఏ ఫైలునూ మూడు రోజులకు మించి పెండింగ్‌లో ఉంచడానికి వీల్లేదని చెప్పారు. జాప్యం జరిగితే అందుకు బాధ్యులను నిర్ణయించి, చర్యలు తీసుకుంటామన్నారు.

*రేపే బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ పాదయాత్ర
ప్రజా సంగ్రామయాత్రకు పాలమూరు కమలదళం సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో చేపడుతోన్న రెండోదశ యాత్ర ఈ నెల 14న అలంపూర్‌ నుంచి ప్రారంభంకానుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున జోగుళాంబదేవి ఆలయం బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ప్రారంభిస్తారు. 31 రోజుల పాటు సాగే ఈ యాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.పాదయాత్రలో ప్రతీరోజూ ఉదయం 7:30 నుంచి 8గంటలలోపు మొదలయ్యే పాదయాత్ర 11 గంటలకు ముగుస్తుంది. పాదయాత్ర సందర్భంగా మార్గమధ్యంలో వచ్చే గ్రామాలు, బస్తీల్లో ప్రజలతో బండి సంజయ్‌, ఇతర నేతలు సమావేశాలు, రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకొంటారు. అదేవిధంగా రాత్రి బసచేసే వద్ద ప్రజలతో సమావేశాలు జరుపుతారు. 50 మంది మొదలుకొని 500 మంది వరకు ప్రజలతో ఈ సమావేశాలుంటాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలకనేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డితో పాటు శాంతకుమార్‌, బంగారు శ్రుతి, ఆచారి తదితర నేతలతో ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపి రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసింది.

*టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలి.. లేదంటే..: కిషన్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలని, లేదంటే టీఆర్ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని అన్నారు. టీఆర్ఎస్‌వి రైతు దీక్షలు కాదని.. రాజకీయ దీక్షలని విమర్శించారు. కేసీఆర్‌ రాజకీయ నాటకమాడుతున్నారని, ఢిల్లీలో దీక్ష చేసి లబ్ది పొందాలనుకున్నారని, సీఎం డ్రామాలకు జనం తెరదించుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

*తెలంగాణలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం: రేవంత్
గవర్నర్ తమిళి సైతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయని, వాళ్లకు బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని, రూ. 2వేల 6 వందల కోట్ల విలువైన బియ్యం మాయంపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు.. ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒడ్లు కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఏదో పాకిస్తాన్ ప్రధాని కొనాలి అన్నట్లు ధర్నాలు ఎందుకని ప్రశ్నించారు. రైతుల చావుకు కారణమైన టీఆర్ఎస్, బీజేపీని రైతులు ఉరేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

*ఆక్వా రంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు: అచ్చెన్న
ఆక్వా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని, ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి.. ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో తగ్గించిన ఛార్జీలను రెట్టింపు చేశారని మండిపడ్డారు. జగన్‌ పాదయాత్రలో ఆక్వా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

*జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం: సునీల్‌ దేవ్‌ధర్‌
వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెదకాకాని ఆలయ ప్రాంగణంలో మాంసాహారం ఘటనపై చర్యలేవని ప్రశ్నించారు. క్యాంటీన్‌ నిర్వాహకుడు షరీఫ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నారు. తిరుమల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. జగన్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్‌, ఇసుక, ల్యాండ్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలను బుజ్జగించి హిందువులను కించపరుస్తారా? అని ప్రశ్నించారు. జిన్నాటవర్‌ విషయంలో మైనార్టీలను వెనకేసుకొచ్చారని సునీల్‌ దేవ్‌ధర్‌ తప్పుబట్టారు.

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం.. కొత్త రాజకీయ పార్టీ: జడ శ్రావణ్‌కుమార్‌
కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగాయని, ఉప ప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉండేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగాయని, ఉప ప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆయన విజయవాడలో మండిపడ్డారు. దళితులు నివసిస్తున్న గ్రామాల్లో ఇప్పటికీ సరైన వసతులు లేవన్నారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని వర్గాలకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. నగరంలో 120 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏడాదిలో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట తప్పారన్నారు.

*’కాదేది బాదుడుకు అనర్హం’ అన్నట్లుంది వైకాపా తీరు: లోకేశ్
జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వం పెంచిన పన్నులపై తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని తెదేపా నేత లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్‌ ముందుకొచ్చారని చెప్పారు. దేశంలో మొత్తం వరిలో 40 శాతానికిపైగా తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నది తెలిపారు. రాష్ట్రంలో 61 లక్షల మందికిపైగా రైతులు వరిని పండిస్తున్నారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని వెల్లడించారు. రైతులకు కేంద్రం అండగా ఉండాలని కోరే హక్కు ప్రతి రాష్ట్రానికి ఉంటుందన్నారు. ధాన్యం కొనకుండా కేంద్రం మన రైతుల పట్ల వ్యవహరించిన తీరు క్రూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులు, ఇతర వర్గాలవారిపై కేంద్రం దృక్పథాన్ని తెలియజేస్తుందని విమర్శించారు.

* ప్రతీ గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి గంగుల
రాష్ట్రంలో నేటి నుంచి రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ… మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి యాబై రోజులపైన పడుతుందన్నారు. మధ్య దళారులకు సంబంధం లేకుండా ఎంఎల్పీ ఇచ్చి తామే కొంటున్నామని తెలిపారు. ఇందుకోసం పదిహేను వేల కోట్లు ప్రభుత్వనికి భారం పడనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు బ్యాంక్‌లను సంప్రదించినట్లు తెలిపారు. బ్యాంక్‌లు ముందుకు వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోలు జరగగానే డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని అన్నారు. వాస్తవానికి గోదాములు అన్ని ఎఫ్సీఐ పరిధిలో ఉంటాయన్నారు. ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గోదాముల కొరత ఉందని, ఇవాళ కలెక్టర్లతో సమావేశంలో చర్చించి గోదాముల పెంపుపై నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రల పెంపు అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రోడ్డున పడేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అండగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు

* మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా
సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు దాడిశెట్టి తీసుకున్నారు. ఆయన తన ఛాంబర్‌లో బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కాగా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ.. రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

* పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా
పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ నేపథ్యం: 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు.

*ప్రతీ గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి గంగుల
రాష్ట్రంలో నేటి నుంచి రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ… మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి యాబై రోజులపైన పడుతుందన్నారు. మధ్య దళారులకు సంబంధం లేకుండా ఎంఎల్పీ ఇచ్చి తామే కొంటున్నామని తెలిపారు. ఇందుకోసం పదిహేను వేల కోట్లు ప్రభుత్వనికి భారం పడనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు బ్యాంక్‌లను సంప్రదించినట్లు తెలిపారు. బ్యాంక్‌లు ముందుకు వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోలు జరగగానే డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని అన్నారు. వాస్తవానికి గోదాములు అన్ని ఎఫ్సీఐ పరిధిలో ఉంటాయన్నారు. ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గోదాముల కొరత ఉందని, ఇవాళ కలెక్టర్లతో సమావేశంలో చర్చించి గోదాముల పెంపుపై నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రల పెంపు అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రోడ్డున పడేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అండగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

*బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు: కేఈ ప్రభాకర్‌
బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ పేర్కొన్నారు. 56% బీసీలుంటే 24 శాతానికి రిజర్వేషన్లను జగన్ సర్కార్‌ కుదించిందన్నారు. బీసీల మీద జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని కేఈ ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు.

*ఆ ఇద్దరూ ఒక్కటే: రామకృష్ణ
గ్యాస్, పెట్రోల్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుని నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఎదుట ధర్నాకు దిగింది. ఇందులో భాగంగా విజయవాడలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాంతర్లు, విసనకర్రలు, కట్టె పుల్లలు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టినట్లు చెప్పారు. విద్యుత్ కోతలపై వీధి ప్రదర్శన ద్వారా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

*సమస్యకు పర్యాయ పదం ఆదివాసీలు : రాజన్నదొర
సమస్యకు పర్యాయ పదం ఆదివాసీలు అని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. దశల వారీగా గిరిజనుల కష్టాలు తీరుస్తానని మాటిస్తున్నానన్నారు. ఇంత వరకూ ఎంత నిజాయితీతో బతికానో… ఇకపై కూడా అలానే ఉంటానన్నారు. కొఠియా వివాదం బ్రిటీష్ కాలం నుంచి ఉందన్నారు. కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందన్నారు. త్వరలో ఆంధ్రాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు రాజన్నదొర పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంకా డోలీ కష్టాలు కొనసాగటం దురదృష్టకరమన్నారు. రోడ్లు వేసి డోలీ వ్యవస్ధను రూపుమాపుతానని.. అలాగే పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని రాజన్నదొర పేర్కొన్నారు.

*మంత్రులుగా ఉన్న వాళ్లందరం జగన్ సైనికుల్లా పని చేస్తాం: రోజా
పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశాలమైన తీరరేఖ ఉందని… టూరిజానికి చాలా స్కోప్ ఉందన్నారు. గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తూ తొలిసంతకం చేసినట్టు ఆమె తెలిపారు. తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.. కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.. అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు. పార్టీ పెట్టక ముందు నుంచే జగన్ అడుగు జాడల్లో నడిచినట్టు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్లందరం జగన్ సైనికుల్లా పని చేస్తామన్నారు. మంత్రి వర్గంలో ఈక్వేషన్స్ బేస్ చేసుకొని కేటాయింపులు చేశారన్నారు. జగన్ లాంటి నేతతో కలిసి నడవడం తమ అదృష్టమన్నారు. జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని రోజా పేర్కొన్నారు. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు. సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో రూపొందిస్తామని రోజా పేర్కొన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు.

*సీఎం ఎజెండానే నా ఎజెండా: సురేశ్‌
ఇక నుంచి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని పురపాలకపట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. సచివాలయంలో ఆయనకు ఆ శాఖ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసిశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమీక్ష జరిపారు. సీఎం ఎజెండానే తన ఎజెండాగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనిఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేద్దామని చెప్పారు. విద్యామంత్రిగా దాదాపు సార్లు తాను సీఎంతో సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నాననప్రతి విషయాన్నీ ఆయన క్షుణ్ణంగా సమీక్షిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల్లో పెండింగ్‌ సమస్యలువాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మికార్యదర్శి రామ్మోహన్‌సీడీఎంఏ ప్రవీణ్‌టిడ్కో ఎండీ శ్రీధర్‌స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్‌సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ పాల్గొన్నారు.

*పవర్‌ హాలిడే లేకుండా చర్యలు: పెద్దిరెడ్డి
పరిశ్రమలకు పవర్‌ హాలిడే లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌ సమర్థంగా అమలు చేస్తామన్నారు. గనుల శాఖలో సంస్కరణలతో మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానని.. తనకు కేటాయించిన మూడు శాఖల ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తెస్తానని తెలిపారు. కేబినెట్‌ కూర్పుపై పార్టీలో ఎటువంటి అసంతృప్తులూ లేవన్నారు.

*మంత్రి పదవి రాలేదని టీడీపీపై అక్కసు: కూన
స్పీకర్‌ తమ్మినేని సీతారాం తనకు మంత్రి పదవి రాలేదన్న అక్కసును టీడీపీపై చూపిస్తున్నారని టీడీపీ నేత కూన రవి కుమార్‌ వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదంటున్న సీతారాం దమ్ముంటే స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘తమ్మినేని మాటలు హాస్యాస్పదం. ఉపముఖ్యమంత్రిగా ఉన్న దళిత మహిళను తొలగించడం ఏం సామాజిక న్యాయం? శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి ఏం న్యాయం జరిగింది?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎ1 ఇసుక మాఫియా డాన్‌గా తమ్మినేని అవతరించారు. ఇసుక అక్రమ రవాణాతో రోజుకు రూ.కోటి ఆర్జిస్తున్నారు. ఆయన తీరుపై ఆముదాలవలస ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇక్కడ వచ్చే తీర్పే రాష్ట్రం అంతా వస్తుంది. టీడీపీకి 160 సీట్లు ఖాయం’ అని చెప్పారు.

*ఆ వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీయడమే: కాల్వ
మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కావాలంటే సీఎం జగన్ రెడ్డిని ఆరాధించాలని చెప్పడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు పదవుల ‎కోసం జగన్ రెడ్డికి పూజలు, భజనలు చేసినట్లు పాత్రికేయులు చేయాలా?, అలా మాట్లాడానికి సిగ్గనిపించటం లేదా? అని ఆయన ప్రశ్నించారు. అభినవ నీరో జగన్ ను కీర్తించడానికి ఇది నియంతృత్వం కాదు, ప్రజాస్వామ్యమన్న విషయం మంత్రి మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల వైసీపీ నేతల అకృత్యాలు, ప్రభుత్వ అసమర్థ, అవినీతి చర్యలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. వైసీపీ అరాచక పాలనపై సమాజాన్ని చైతన్యం చేసేందుకు జర్నలిస్టులు మరింత క్రియాశీలం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జర్నలిస్టులను అవమానించేలా మాట్లాడినందుకు మంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు.

*ఆ వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీయడమే: కాల్వ
మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కావాలంటే సీఎం జగన్ రెడ్డిని ఆరాధించాలని చెప్పడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు పదవుల ‎కోసం జగన్ రెడ్డికి పూజలు, భజనలు చేసినట్లు పాత్రికేయులు చేయాలా?, అలా మాట్లాడానికి సిగ్గనిపించటం లేదా? అని ఆయన ప్రశ్నించారు. అభినవ నీరో జగన్ ను కీర్తించడానికి ఇది నియంతృత్వం కాదు, ప్రజాస్వామ్యమన్న విషయం మంత్రి మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల వైసీపీ నేతల అకృత్యాలు, ప్రభుత్వ అసమర్థ, అవినీతి చర్యలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. వైసీపీ అరాచక పాలనపై సమాజాన్ని చైతన్యం చేసేందుకు జర్నలిస్టులు మరింత క్రియాశీలం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జర్నలిస్టులను అవమానించేలా మాట్లాడినందుకు మంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు.

*అది సామాజిక న్యాయమా?: చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, ప్రజలపై పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రక అవసరం. టీడీపీ గెలుపు కేవలం పార్టీ కోసమే కాదు..రాష్ట్రం కోసం అవసరం. ఏపీలో కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణం. జగన్‌ మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 16 వేలకోట్ల భారం మోపారు. ఏపీలో అన్నివర్గాల ప్రజలను చిదిమేసి.. ఇప్పుడు సామాజిక న్యాయం అంటారా?. ఆయా వర్గాల ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రెండు పదవులిచ్చి సామాజిక న్యాయం అంటారా?. ’’ అని చంద్రబాబు ప్రశ్నించారు

*జగన్‌ది రైతు వంచన ప్రభుత్వం: జనసేన నేత
పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర చేపడితే కానీ జగన్‌లో చలనం రాలేదని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. మూడేళ్లు నిద్ర నటించి నష్టపరిహారం ఇచ్చేందుకు ఇప్పుడు ఆరాట పడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి ఇంతకాలం కర్షకుల కష్టం కనిపించ లేదా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల పక్షపాతి పవన్ అని, జగన్‌ది రైతు వంచన ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా నిలబడటం లేదు కాబట్టే జగన్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు లాగానే రైతులు కూడా ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతారేమో? అని ప్రశ్నించారు.