Devotional

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి – TNI ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి – TNI ఆధ్యాత్మికం

1. వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి కల్యాణ మహోత్సవానికి తితిదే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరై… స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రూ.16 కోట్లతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికలో తొలిసారి జరుగుతున్న కల్యాణం సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 50 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా కల్యాణ వేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

2. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగాఅధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ఆర్బీఐ డైరెక్టర్‌ బి.సుధ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

3. కొనసాగుతున్న ప్రాణహిత పుష్కరాల సందడి
కౌటాల మండలంలోని ప్రాణహిత జన్మస్థలి అయిన తుమ్మిడిహెట్టి వద్ద బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రాణహిత పుష్కరాల సందడి మొదలైంది. కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్‎లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేమనపల్లిలోని పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఏపీ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కర ఘాట్‎లో సరైన సౌకర్యాలేవని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

4. తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్‌ జారీ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ, టోకెన్‌ రహిత దర్శనాలను ప్రారంభించడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుమల క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాత్రి 8 గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో పాటు కిలోమీటర్‌ మేర క్యూలైన్‌ వెలుపలకు వచ్చింది. అప్పటికే జారీ చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్‌ కలిగిన భక్తులు, వర్చువల్‌ సేవా టికెట్లు వంటి వివిధ కేటగిరీలకు చెందిన భక్తులను రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత టోకెన్‌ లేకుండా వచ్చిన భక్తుల్లో 4 వేల మందికి రాత్రి 2.15 గంటల వరకు దర్శనం కల్పించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు 32 వేల మంది భక్తులకు దర్శనం లభించింది.

5. తిరుమలకు వెళ్లి రావడమంటే అమరనాథ్‌ యాత్ర వెళ్లిరావడంలా తయారైందని పీఏసీ చైర్మన్‌ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. తిరుమలలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. టీటీడీ పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినాపాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వంపాలక మండలి పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. వేసవిలో చలువ పందిళ్లు వేయకుండా నిర్లక్ష్యం వహించారు. టీటీడీ అధికారులు తిరుమలను వదిలేసి ముఖ్యమంత్రి రాక కోసం ఒంటిమిట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో రూములను మూసివేశారు. కింద ఉన్న హోటళ్లలో వ్యాపారాలు జరగాలి అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందిఅని విమర్శించారు.

6. రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి మూడురోజుల పాటు సాలకట్ల వసంత్సోవాలు జరగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. తర్వాత వసంతమండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజైన శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతారు. తర్వాత వసంతోత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి,అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

7. ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న Bandi sanjayt
ఖైరతాబాద్ చౌరస్తాలోలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీసీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభంకానుంది. రెండో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ప్రారంభించనున్నారు. ఉదయం జోగులంబ ఆలయంలో బీజేపీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం ఆలంపూర్‌లో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు.

8. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రసాదాలను అర్చకులు, అధికారులు దారి మళ్లించారు. రాత్రి స్వామివారి ఊరేగింపులో ప్రసాదాలు భక్తులకు పంచకుండా అర్చకులు వీధుల్లో నుంచి గుడిలోకి తీసుకెళ్ళారు. అర్చకులు, అధికారులు, రాజకీయ నాయకులు పంచుకునేందుకు ప్రసాదాలు తీసుకెళ్లారని భక్తులు మండి పడుతున్నారు.

9. ఘనంగా సిక్కుల నూతన సంవత్సరం ‘వైశాఖి’ వేడుకలు
సిక్కుల నూతన సంవత్సరం ఖల్సా పంత్ ఫౌండేషన్ డే (వైశాఖి)వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని అమీర్ పేట గురుద్వారాతో పాటు నగరంలోని పలు గురు ద్వారాల్లో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమీర్ పేటలోని గురుద్వారాకు భారీ సంఖ్యలో సిక్కులు తరలి వచ్చారు. గురుద్వరాకు సమీపంలోని గురు గోబింద్ సింగ్ ప్లే గ్రౌండ్ లో పెద్దయెత్తున వేడుకల ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా పలువురు మత ప్రచారకులు గురుకీర్తలను అలపించారు. వేదికపై సిక్కుల పవిత్ర గ్రంధం గురు గ్రంధ్ సాహెబ్ వుంచి భక్తితో కీర్తనలు అలపించారు. ఈ సందర్భంగా ‘ఘటికా’ (తల్వార్లతో)తో విన్యాసాలుచేసూ్త పవిత్ర ఊరేగింపు నిర్వహించారు.అమీర్ పేట గురుద్వారా నుంచి బేగంపేట, గ్రీన్ లాండ్స్, పంజాగుట్ట వరకూ భారీ ఊరేగింపు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారీగా తరలి వచ్చిన వారికి ఉచితంగా భోజనం (గురు కా లంగర్) పంపిణీ చేశారు. అమీర్ పేట గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పలువురు సిక్కులు ఈ వేడుకలకు తరలి వచ్చినట్టు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రెసిడెంట్ భగేందర్ సింగ్, కార్యదర్శి సురేందర్ సింగ్ వెల్లడించారు.

10. శ్రీవారి భక్తులకు టిటిడి విజ్ఞప్తి
తిరుమల కొండ శ్రీవారి భక్తులతో కిటకిట లాడుతోంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి భక్తులను కొండమీదకు అనుమతిస్తుండడంతో శ్రీవారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. క్యూలైన్లన్నీ శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయాయి తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం తిరుమలలో ఒక లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.రోజుకు 80 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంది క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు ఎప్పటికప్పుడు అన్న పానీయాలను అందజేస్తున్నాం ప్రతిరోజు శ్రీవారి సేవలకు కైంకర్యాలకు 6 గంటల సమయం పడుతుంది – టిటిడి తిరుమలలో భక్తులకు వసతి కల్పించడానికి 5వేల కాటేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి – టిటిడిఈ విషయాలను గమనించి భక్తులు ముందస్తు కార్యచరణతో తిరుమల యాత్ర కు రావాలని విజ్ఞప్తి – టిటిడి