NRI-NRT

లాగిన కొద్ది కదులుతున్న విద్యార్ధి వీసాల కుంభకోణం

లాగిన కొద్ది కదులుతున్న విద్యార్ధి వీసాల కుంభకోణం

విద్యార్థి వీసా మంజూరు విషయంలో అమెరికా చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే.. ఇది తెలిసి కూడా ఏజెంట్లు, కన్సల్టెంట్‌ కంపెనీలు.. విద్యార్థుల అమెరికా ఆశలను తమకు ఆదాయ మార్గంగా మార్చుకుని మోసం చేస్తున్నారు. అభ్యర్థులకు నకిలీ సర్టిఫికెట్లను అంటగట్టి.. దరఖాస్తు చేయిస్తున్నారు. ఈ క్రమంలో వాటి కోసం.. అభ్యర్థుల నుంచి రూ.లక్షలు గుంజుకుంటున్నారు. ఇలా స్టూడెంట్‌ వీసా కోసం ఏజెంట్లను నమ్మి.. నకిలీ పత్రాలు సమర్పించిన తెలుగు విద్యార్థులను ఢిల్లీలోని చాణక్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా దౌత్యకార్యాలయం చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులపాటు సోదాలు నిర్వహించి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మందికిపైగా విద్యార్థులను, వీరిని ముంచేసిన ఏజెంట్లను, కన్సల్టెంట్‌ కంపెనీ నిర్వాహకులను మొత్తం 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వీసా పొందేందుకు ఈ విద్యార్థులు ఏజెంట్లను, కన్సల్టెంట్‌ కంపెనీలను ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన వీరు.. అడ్డదారుల్లో వారిని ప్రోత్సహించారు. నకిలీ ఉద్యోగ అనుభవ పత్రాలతోపాటు, బ్యాంకుఖాతాల్లో నగదు ఉన్నట్టు నకిలీ డాక్యుమెంట్లను అందించారు. ఇంటర్వ్యూల సమయంలో వీటిని గుర్తించిన దౌత్య కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు విద్యార్థులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఒక అభ్యర్థి ఈ నెల 7న ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీలో స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు అపాయింట్‌మెంట్‌ లెటర్‌తోపాటు గుంటూరులోని ఒక బ్యాంకు నుంచి రూ.20 లక్షల ఎడ్యుకేషన్‌ లోను మంజూరైనట్లు పత్రాలు సమర్పించాడు. ఇంటర్వ్యూ సందర్భంగా పత్రాలను తనిఖీ చేయగా అవి నకిలీవని తేలడంతో ఎంబసీ అధికారులు చాణక్యపురి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అటు చెన్నై, ఇటు హైదరాబాద్‌లో యూఎస్‌ ఎంబసీలు ఉండగా ఢిల్లీలో ఎందుకు దరఖాస్తు చేసుకున్నావని యువకుడిని ప్రశ్నించడంతో గుట్టు బయటపడింది. విజయవాడలోని పటమటలో స్ర్పింగ్‌ ఫీల్డ్‌ ఓవర్సీస్‌ కన్సల్టెంట్‌కు చెందిన కేశవ్‌ అనే ఏజెంట్‌ తనను ఇక్కడికే పంపారని చెప్పడంతో బాధ్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నకిలీ పత్రాల ముఠా గురించి కూపీ లాగడంతో విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో బాధ్యులతోపాటు బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

మోసం గురూ!రూ.25 వేల నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి ఉద్యోగ అనుభవం సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు ఓ విద్యార్థి పోలీసులకు వెల్లడించాడు. అమెరికాలో విద్య కోసం వెళ్లాలంటే రూ.లక్షలు బ్యాంకు ఖాతాలో ఉండాల్సిందేనని, బ్యాంకుల నుంచి లోన్లు మంజూరైనట్లు ఖాతాల్లో డబ్బులు చూపినందుకు ఏజెంట్‌ రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారని చెప్పాడు. కొన్ని ఐటీ సంస్థలు కేవలం రూ.5వేలకే వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు గుర్తించారు. మరోవైపు, విజయవాడలో సోదాలు చేపట్టిన ఢిల్లీ పోలీసులు పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల అడ్ర్‌స ఉండటంతో అక్కడ కూడా దర్యాప్తు చేశారు. ఈ నకిలీలకు హైదరాబాదే కేంద్రంగా ఉందని గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు ఏపీలోని విజయవాడ, గుంటూరు, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌కు చెందిన 12మంది విద్యార్థులతోపాటు మొత్తం 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వీరిని విచారిస్తున్నారు. వారిని త్వరలోనే ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు చాణక్యపురి పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.