NRI-NRT

విద్యార్థులు కు గుడ్ న్యూస్… పెరగనున్న వీసా స్లాట్లు

విద్యార్థులు కు గుడ్ న్యూస్…  పెరగనున్న వీసా స్లాట్లు

అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఐ-20(ప్రవేశ అర్హత పత్రం) ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతలోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విద్యార్థుల వీసాలకు డిమాండు అధికంగా ఉండటంతో కొన్ని ఆంక్షలను కూడా విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఒక సీజనులో ఒకదఫా మాత్రమే విద్యార్థి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేలా చూడనున్నట్లు తెలిసింది. సాధారణంగా ఒకసారి వీసా తిరస్కరణకు గురైన తరవాత కొద్ది రోజుల వ్యవధిలో అదే కాన్సులేట్‌ లేదా ఇతర కార్యాలయాల్లో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవటం ఇప్పటి వరకు పరిపాటిగా ఉంది. ఈ విధానంతో ఇంటర్వ్యూ స్లాట్లు లభించక ఇతర విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. అధికారిక సమాచారం లభిస్తే కాని విధి విధానాలపై స్పష్టత రాదు.

30 శాతం వరకు అదనంగా… ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు వీసా స్లాట్లను కనీసం 30 శాతం అదనంగా కేటాయించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరోనా ముందు వరకు రోజుకు 600-800 వరకు వీసా స్లాట్లు కేటాయించే వారు. కరోనా సమయంలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా ఆ సంఖ్యను వెయ్యికిపైగా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పర్యాటక వీసాలు(బి1, బి2) జారీ చేయటంలేదు. గతంలో వీసా తీసుకుని గడువు తీరి పునరుద్ధరణ చేసుకోవాలనుకునే వారికి ఇంటర్వ్యూతో పని లేకుండా డ్రాప్‌ బాక్స్‌ సౌకర్యాన్ని కల్పించింది. ఆ స్లాట్లను కూడా విద్యార్థులకు కేటాయించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్‌: తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దేశం నుంచి అమెరికాకు వెళ్లే వారిలో వీరే అధికంగా ఉంటారు. అందుకే వీసా ఇంటర్వ్యూ కోసం వేచి ఉండే సమయం హైదరాబాద్‌లోనే అత్యధికంగా 913 రోజులు ఉన్నట్లు ఆధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారికి ఇక్కడి కాన్సులేట్‌ సేవలందిస్తోంది. స్లాట్లు లభిస్తే ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు