Movies

‘ఎఫ్‌ 3’లో జిగేల్‌ రాణి

‘ఎఫ్‌ 3’లో జిగేల్‌ రాణి

కథానాయికలు అప్పుడప్పుడూ ఐటెమ్‌ గీతాల్లో మెరుస్తుంటారు. పూజా హెగ్డే కూడా ‘రంగస్థలం’లో ‘జిగేల్‌ రాణి’గా అలరించారు. ఇప్పుడు మరోసారి ఐటెమ్‌ పాటలో నర్తించడానికి ఒప్పుకొన్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. దిల్‌ రాజు నిర్మాత. అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంది. ఆ పాట కోసం పూజా హెగ్డేని ఎంచుకున్నారు. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ వేశారు. అందులోనే శుక్రవారం నుంచి పాట చిత్రీకరణ మొదలెట్టారు. ఈ పార్టీ గీతంలో వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహరీన్‌తో పాటు చిత్రబృందం అంతా పాల్గొనబోతోంది. ఈ పాట సినిమాలో కీలకమైన భాగంలో వస్తుందని, చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు నటించారు. మే 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.