DailyDose

ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్‌ సూపరండీ ..

ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్‌ సూపరండీ ..

ఆర్టోస్‌.. ఇది పక్కా లోకల్‌.. ఈ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్‌’ వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
j2
*‘ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్‌! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది’ అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. ‘ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం’ అనే స్థాయిలో ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే.

j3
*మూడు తరాల కృషి
ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి స్పేర్‌ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది
Artos-Drink002
*1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగి, అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.