DailyDose

రెండో టైమ్ జోన్ కావాలని ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి

రెండో టైమ్ జోన్ కావాలని ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి

సూర్యోదయం ఎన్ని గంటలకు మొదలవుతుంది? అని ఎవరైనా అడిగితే, విశాఖపట్నంలో ఉంటే ఉదయం 5.30 గంటలకు కాస్త అటూఇటూగా ఉంటుందని చెబుతారు. అదే హైదరాబాద్‌లో ఉంటే ఇది 6 గంటలకు కాస్త అటూఇటూగా ఉంటుంది.విశాఖపట్నం, హైదరాబాద్‌ల మధ్య సూర్యోదయానికి పావు గంట తేడా ఉంటుంది. మరి మన దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య టైమ్‌లో తేడా గురించి ఎప్పుడైనా ఆలోచించారా?ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ లోహిత్ జిల్లాలోని డాంగ్‌లో మొదట సూర్యోదయం అవుతుంది. ఇక్కడ వేసవిలో ఉదయం 4 గంటలకే సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఉదయం 9 గంటలకు ఇక్కడ స్కూళ్లు, ఆఫీసులు మొదలయ్యే సరికే ఇక్కడ మధ్నాహ్యం సమయంలో హైదరాబాద్‌లో కాసేంత ఎండ ఉంటుంది.అరుణాచల్‌లో సాయంత్రం 4.30కే సూర్యాస్తమయం అవుతుంది. దీంతో స్కూళ్లు, ఆఫీసుల్లో ఐదు గంటలకే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. శీతాకాలంలో అయితే, పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. నాలుగు గంటలకే ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు.దీంతో ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోతాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవల మేఘాలయతో సరిహద్దు ఒప్పందానికి సంబంధించిన నివేదికను సమర్పిస్తూ అసెంబ్లీలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.‘‘ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాల్సిన అవసరముంది. ఈ టైమ్ జోన్ భారత్ ప్రధాన భూభాగం కంటే రెండు గంటలు ముందుకు ఉంటే.. చాలా విద్యుత్ ఆదా అవుతుంది. పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. మన ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. అప్పుడు మన జీవ గడియారంతో మనం అనుసరించే టైమ్‌ కూడా కలుస్తుంది’’అని ఆయన అన్నారు.సూర్య రశ్మి అందుబాటులో ఉండే సమయాన్ని కోల్పోవడం, విద్యుత్ వినియోగం పెరగడం లాంటి కారణాలను చూపుతూ ఆయన ప్రత్యేక టైమ్ జోన్‌ను డిమాండ్ చేస్తున్నారు.‘‘స్వాతంత్ర్యానికి ముందు భారత్‌లో బాంబే టైమ్, కలకత్తా టైమ్ పేరుతో రెండు టైమ్ జోన్లు ఉండేవి. వీటితో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. ఫలితంగా విద్యుత్ కూడా ఆదా అయ్యేది. కానీ, గందరగోళాన్ని తొలగించే చర్యల పేరుతో ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం రెండు టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స్టాండార్డ్ టైమ్ జోన్‌ను తీసుకొచ్చింది’’అని ఆయన అన్నారు.అస్సాం మాత్రమే కాదు.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్ లాంటి ఈశాన్య రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఎప్పటికప్పుడే కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.భూమిని 360 రేఖాంశాలుగా విభజించారు. రేఖాంశాలంటే భూమిపై ధ్రువాలను తాకుతూ నిలువుగా ఉండే ఊహా రేఖలు. రెండు రేఖాంశాల మధ్య నాలుగు నిమిషాల దూరం ఉంటుంది. అలా భూమిని 24 టైమ్ జోన్లుగా విభజించారు.మరో విధంగా చెప్పాలంటే భూమి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే 24 గంటల సమయాన్ని 360 డిగ్రీలకు విభజించారు.దీని ప్రకారం, 15 డిగ్రీల దూరాన్ని భూమి తిరగడానికి ఒక గంట సమయం పడుతుంది. అంటే ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు.అన్ని టైమ్ జోన్లూ ప్రధాన టైమ్ జోన్‌కు అనుగుణంగా ఉంటాయి. ప్రధాన టైమ్ జోన్‌నే ‘‘ప్రైమ్ మెరీడియన్’’ అంటారు. ఇది లండన్‌లోని గ్రీన్‌విచ్ గుండా వెళ్తుంది. అందుకే దీన్ని గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)అని కూడా పిలుస్తుంటారు.