Devotional

వైభవంగా హ‌నుమాన్ శోభాయాత్ర‌. – TNI ఆధ్యాత్మికం

వైభవంగా  హ‌నుమాన్ శోభాయాత్ర‌. – TNI ఆధ్యాత్మికం

1. హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొన‌సాగుతున్నాయి. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు, కర్మాన్‌ఘాట్‌ నుంచి కోఠి వరకు హనుమాన్‌ శోభాయాత్ర ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో నగరంలోని 21 మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమ‌లు చేస్తున్నారు. గౌలిగూడ నుంచి ప్రారంభ‌మైన శోభాయాత్ర రాత్రి 8 గంటలకు ముగుస్తుందని, ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. కాగా, హనుమాన్‌ జయంతి సందర్భంగా నగరంలో బార్లు, మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు మూసిఉంటాయ‌ని చెప్పారు.

2. కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు..పెరిగినభక్తుల రద్దీ
నేడు (శనివారం) చిన్న హనుమాన్‌ జయంతి కావడంతో కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. రామ లక్ష్మణ జానకీ, జై భోలో హనుమాన్‌ కీ.. అంటూ వేలాదిగా తండోప తండాలుగా కొండమీదకు తరలివస్తున్నారు. అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారిని దర్శంచుకునేందుకు భక్తులు దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆంజనేయస్వామి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు

3. బయోమెట్రిక్‌ మార్గంలో ఆలయంలోకి!
టీటీడీ నిబంధనలను అతిక్రమించిన అధికారులు మరోసారి విమర్శల పాలయ్యారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే బయోమెట్రిక్‌ మార్గం నుంచి గుడిలోకి వెళ్లే అవకాశం ఉండగా.. శుక్రవారం వేకువజామున ఓ ఉన్నతాధికారి బంధువులైన ఇద్దరు మహిళలు బయోమెట్రిక్‌ పక్కనే ఉన్న మార్గం నుంచి ఆలయంలోకి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. నిబంధనలు పాటిస్తూ, భక్తులు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఇలా నిబంధనలను అతిక్రమించడం చర్చనీయాంశమయ్యింది. ఓవైపు శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుంటే అధికారులు తమ కుటుంబ సభ్యులను ఇలా అడ్డదారుల్లో ఆలయంలోకి అనుమతించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

4. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. నేటితో ముగియనున్న వసంతోత్సవాలు
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. తిరుమల శ్రీవారిని శుక్రవారం 82,722 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి. వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, శ్రీకృష్ణ, సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక స్నప్న తిరుమంజనం జరగనుంది.

5.వైభవంగా కొనసాగుతున్న ప్రాణహిత పుష్కరాలు
మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. కాగా… పార్కింగ్ పేరిట ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు వేమనపల్లిలోని పుష్కర ఘాట్‌లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.

6. స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి
తిరుమల శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. జీయర్‌స్వాములు, మంత్రి వేణుగోపాలకృష్ణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

7. యాదగిరిక్షేత్రంలో నేత్రపర్వంగా ఊంజల్‌ సేవ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయంలో స్వయంభువులను కొలిచిన ఆచార్యులు ప్రతిష్ఠా అలంకారమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించి తులసీదళాలు, కుంకుమలతో సహస్రనామార్చనలు చేశారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. కొండపైన చరమూర్తుల ఆలయంలో నిత్యకైంకర్యాలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. సాయంత్రంవేళ ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండాల్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు అద్దాల మండపంలోని ఊంజల్‌సేవలో అధిష్ఠింపజేసి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.

8. అయోధ్యలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆయన సతీమణి ఉషాతో కలిసి శుక్రవారం లఖ్‌నవూ నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రైల్వేస్టేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఫజియాబాద్‌ ఎంపీ లల్లూ సింగ్‌ వారికి సాదర స్వాగతం పలికారు. నాయుడు దంపతులు అక్కడి నుంచి నేరుగా రాముడి జన్మస్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం సందర్శకుల పుస్తకంలో ఆ శ్రీరాముని ఆశీర్వాదం పొందినట్టు వెంకయ్య రాశారు. ఈ సందర్భంగా రామజన్మ భూమిలో జరుగుతున్న నూతన ఆలయ నిర్మాణ పనుల గురించి రామ జన్మభూమి తీర్థ్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు వెంకయ్యకు వివరించారు. వెంకయ్య దంపతులు వారాణసిని కూడా సందర్శించారు.

9. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ఆంజనేయ మాలదారులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే మాలధారులు దీక్ష విరమణ చేస్తున్నారు. స్వామివారిని 50 వేల మందికిపైగా దర్శించుకున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో కొండగట్టులో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సింధుశర్మ, అడిషనల్‌ ఎస్పీ రూపేష్‌ కుమార్‌ పరిశీలించారు.

10. తామ్రభరణి నదికి ప్రత్యేక పూజలు తమిళ ఉగాది, గురుపెయర్చి సందర్భంగా శ్రీ వైకుంఠం ప్రాంతంలోని తామ్రభరణి నదికి ప్రత్యేక అభిషేకపూజలు నిర్వహించారు. తొలుత నది తీరం పక్కనే ఉన్న గుణవతిఅమ్మాళ్‌ ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేక, అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పూర్ణకుంభం ఊరేగింపుగా నది వద్దకు తీసుకొచ్చారు. పంచామృతం సహా 21 సుగంధద్రవ్యాలతో అభిషేకం, పూర్ణ కుంభాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు