Business

ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం! – TNI వాణిజ్య వార్తలు

ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం!   – TNI వాణిజ్య వార్తలు

* ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అప్రమత్తమైంది. తమ కంపెనికి చెందిన స్కూటర్లను రీకాల్‌ చేస్తామంటూ ప్రకటించింది.2022 మార్చి 26న తమిళనాడులో ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో ఒకినావా స్కూటు తగలబడి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనంగా మారింది. మరో రెండు రోజులకే తమిళనాడులోని తిరుచ్చిలో మరో స్కూటర్‌లో బ్యాటరీ కాలిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన ఒకినావా ప్రైస్‌ ప్రో మోడళ్లను రీకాల్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.ఒకినావా రీకాల్‌ చేయాలని నిర్ణయించిన ఒకినావా ప్రైస్‌ ప్రో మోడల్‌ స్కూటర్లు దేశవ్యాప్తంగా 3,125 అమ్మడుడయ్యాయి. కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఉన్నర ఒకినావా షోరూమ్‌లకు వెళ్లి వీటిని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలా తీసుకున్న స్కూటర్ల భద్రతను మరోసారి సంపూర్ణంగా పరిశీలించనుంది ఒకినావా.

ఒకినావా స్కూటర్‌ కేంద్ర కార్యాలయం, తయారీ యూనిట్‌ హర్యాణాలో ఉంది. ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా ఒకినావాకి సంబంధించి మొత్తం 25,000 స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. ఇందులో హై స్పీడ్‌ వెహికల్‌ విభాగంలో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అందులో బ్యాటరీ పనితీరు, రక్షణ వ్యవస్థలను చెక్‌ చేయాలని ఒకినావా నిర్ణయించింది.

*దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఐదు రోజుల పాటు కొలంబో స్టాక్‌ ఎక్సేంజ్‌ని మూసివేయాలని సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్‌ 22 వరకు కొలంబో స్టాక్‌ ఎక్సేంజీలో ఎటువంటి లావాదేవీలు జరగవు. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్‌ఈసీ అభిప్రాయ పడింది.శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

*ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్‌ ట్రక్కుల విభాగంలోకి అడుగు పెట్టనుంది. హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్లపై ట్రయల్స్‌ను ప్రారంభించింది. ప్రోటోటైప్‌ టిప్పర్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 220 కిలోమీటర్ల వరకూ ఇది ప్రయాణించనుంది. ట్రయల్స్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌ సమీపంలో కంపెనీ ఏర్పాటు చేయనున్న యూనిట్‌లో దీన్ని ఉత్పత్తి చేయనున్నట్లు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు. టిప్పర్ల ద్వారా జరిగే రవాణాలో ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ కొత్త మలుపు కాగలదన్నారు. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లు, ఘాట్‌ రోడ్లు మొదలైన అన్ని రకాల మార్గాల్లో దీన్ని పరీక్షించనున్నట్లు ప్రదీప్‌ వివరించారు.

*హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వాటా పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖ అదనంగా 44 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల సమాచారం. మార్చి చివరి నాటికి రేఖ ఝున్‌ఝున్‌వాలాకు ఎన్‌సీసీలో 2.62 శాతానికి సమానమైన 1.6 కోట్ల షేర్లు ఉన్నాయి. 2021 డిసెంబరు చివరి నాటికి కంపెనీలో రేఖకు 1.9 శాతం వాటాకు సమానమైన 1.16 కోట్ల షేర్లు ఉన్నాయి. ఝున్‌ఝున్‌వాలా తన పేరు, రేఖ పేరుతో ఎన్‌సీసీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. 2015 డిసెంబరులో మొదటిసారిగా రేఖ పేరు మీద రాకేశ్‌ ఎన్‌సీసీ షేర్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం రాకేశ్‌కు ఎన్‌సీసీలో 10.94 శాతానికి సమానమైన 6,67,33,266 షేర్లు ఉన్నాయి. గత త్రైమాసికంలో ఆయన వాటాలో ఎటువంటి మార్పులేదు. భార్య వాటా పెరగడంతో మొత్తం వాటా 0.72 శాతం పెరిగి 13.58 శాతానికి చేరింది.

*బైక్‌ ట్యాక్సీ ప్లాట్‌ఫామ్‌ ర్యాపిడో కొత్తగా 18 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,370 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. స్విగ్గీ, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలతో పాటు ఇప్పటికే ర్యాపిడోలో పెట్టుబడులు పెట్టిన మరికొన్ని పీఈ సంస్థల నుంచి ఈ పెట్టుబడులు సమకూరాయి.
*ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు జారీ చేయాలనే యోచనను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విరమించుకున్నట్టు తెలుస్తోంది. పేపర్‌ కరెన్సీ నోట్లతో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నా ప్లాస్టిక్‌ నోట్లు.. భారత ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులకు ఏ మాత్రం సరిపడవని బ్యాంకింగ్‌ అధికారులు చెప్పడమే ఇందుకు కారణం. ఒకసారి ఈ నోట్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనైతే.. వాటి రూపురేఖలు మారిపోయి మార్చుకోవడమూ సాధ్యం కాదని బ్యాంకర్లు స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికి తోడు యూపీఐ చెల్లింపుల వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందడం, ఆర్‌బీఐ త్వరలో డిజిటల్‌ కరెన్సీ జారీ చేయడమూ ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

*ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేశ్‌ శర్మ జీతం భారీగా పెరగనుంది. ఆయన జీతం పది రెట్లు పెంచేందుకు బ్యాంక్‌ ఒక తీర్మానాన్ని వాటాదారుల ఆమో దం కోసం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ఆమోదం పొందితే ప్రస్తుతం రూ.2.4 లక్షలు ఉన్న ఆయన నెల వేతనం రూ.20 లక్షలకు పెరుగుతుంది. అలవెన్సులు, ఇతర ప్రోత్సాహకాలూ ఇదే స్థాయిలో పెరుగుతాయి.

*దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. మార్కెట్లోకి సరికొత్త మల్టీపర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ఎర్టిగా విడు దల చేసింది. ఈ ఎంపీవీ ధరలు రూ.8.35 లక్షలు-రూ.12.79 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో మాన్యువల్‌, ఆటోమెటిక్‌ ట్రాన్‌్లమిషన్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే సీఎన్‌జీ వెర్షన్‌ ఎర్టిగాను కూడా కంపెనీ తీసుకువచ్చింది. హైబ్రిడ్‌ టెక్నాలజీ, ఆల్‌ న్యూ అడ్వాన్స్‌డ్‌ సిక్స్‌ స్పీడ్‌ ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌తో ఎర్టిగాను తీసుకువచ్చినట్లు తెలిపింది. దేశీయ మార్కెట్లోకి ఎర్టిగా తీసుకువచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసినట్లు మారుతి సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషీ టకయుచీ వెల్లడించారు. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా సీఎన్‌జీ వేరియంట్‌ 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని తెలిపింది.

*ప్రపంచంలో అందరికంటే ధనవంతుడైనప్పటికీ, ఎలాన్‌ మస్క్‌కు ట్విటర్‌ కొనుగోలు భారీ కసరత్తేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్విటర్‌కు చెందిన ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలుకు మస్క్‌ ఆఫరిచ్చాడు. ఈ లెక్కన కంపెనీ విలువ 4,340 కోట్ల డాలర్లు (దాదాపు రూ.3.30 లక్షల కోట్లు) అవుతుంది. మస్క్‌ వ్యక్తిగత ఆస్తి 25,060 కోట్ల డాలర్లలో ఆరో వంతుకు సమానమిది. అయితే, మస్క్‌ సంపదలో సింహభాగం తన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’కు చెందిన ఈక్విటీ వాటా రూపంలో ఉంది. కాబట్టి, ట్విటర్‌ టేకోవర్‌ కోసం మస్క్‌ ‘టెస్లా’లో వాటా విక్రయించడం లేదా షేర్లను తనఖా పెట్టి పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి రావచ్చని విశ్లేషకులంటున్నారు. గడిచిన కొన్ని నెలల్లో ట్విటర్‌లో 9 శాతానికి పైగా వాటా కొనుగోలుకు 260 కోట్ల డాలర్లు వెచ్చించిన మస్క్‌ వద్ద ప్రస్తుతం 300 కోట్ల డాలర్ల వరకు నగదు నిల్వలు ఉండవచ్చని బ్లూంబర్గ్‌ అంచనా వేసింది. ట్విటర్‌లోని మిగతా 90 శాతం వాటా కొనుగోలుకు 3,900 డాలర్లకు పైగా నిధులు అవసరమవుతాయి. అంటే, తన వద్దనున్న 300 కోట్ల డాలర్లకు అదనంగా 3,600 కోట్ల డాలర్లు సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం 3.65 కోట్ల టెస్లా షేర్లను విక్రయించాల్సి రావచ్చు. కంపెనీలోని మస్క్‌ వాటాలో ఈ షేర్లు ఐదో వంతుకు సమానం.