DailyDose

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు – TNI తాజా వార్తలు

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు – TNI తాజా వార్తలు

* తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు అయింది. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు

*కేరళలోని పాలక్కాడ్‌ టౌన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరిని ఒక వర్గం వారు శనివారం మధ్యాహ్నం దారుణంగా నరకిచంపారు. పాలక్కాడ్ టౌన్‌లో షాపు నడుపుతున్న శ్రీనివాసన్ (45)ను అక్కడకు చేరుకున్న దుండగులు దాడి చేశారు. మోటార్ బైక్‌పై అగంతకులు వచ్చారని, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడని చెబుతున్నారు. పాలక్కాడుకు సమీపంలోని ఓ గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతను చంపిన 24 గంటలు కూడా తిరక్కుండానే తాజా ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వస్తుండగా పీఎఫ్ఐ నేత సుభైర్ (43)ను దుండగులు ఎలప్పుల్లి వద్ద నరికిచంపారు. కాగా, శ్రీనివాసన్‌పై దాడి, హత్య వెనుక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందని బీజేపీ ఆరోపించింది.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాసానికి చేరుకొని, నూతన వధూవరులైన చెరుకులపాడు వంశీధర్‌ రెడ్డి, ప్రియదర్శినిని ఆశీర్వదించారు.కర్నూలు జిల్లాకు విచ్చేసిన సీఎంకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

*పీలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 140 బస్తాల సిమెంట్‌ను అందించనున్నట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ వెల్లడించారు. ఏపీ సచివాలయంలో ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్టణంలో ఉన్న నిరుపేదలు లక్షమందికి ఇళ్లు కట్టించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వశక్తులు ఒడ్డి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ను ఇచ్చేవారని ఇకపై తాము 140 బస్తాల సిమెంట్‌ను అందించనున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పేరు తీసుకొచ్చేలా తమ శాఖ కృషి చేస్తుందని వివరించారు.

*యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బేటీ అయ్యారు, శనివారం సివిల్ సప్లైస్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఇతర పౌరసరఫరాల సంస్థ ఉన్నతోద్యోగులు పాల్గొన్నారు. ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మకు తెలంగాణ ఈ యాసంగిలో చేయబోయే ధాన్యం సేకరణ వివరాల్ని వెల్లడించారు, యాసంగిలో తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు, నూక శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో ఉంచుకొని అధనపు భారాన్ని భరించి ధాన్యం సేకరణ చేస్తున్నామని, సీఎంఆర్ సమయంలో అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులు స్రుష్టించవద్దన్నారు

*పోలీస్‌ స్టేషన్‌లో పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. పోస్టుమార్టం పూర్తైన అనంతరం సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.

కాగా వచ్చే నెల 4వ తేదీన సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని తమతో సాయి గణేష్ చెప్పాడనీ బంధువులు చెబుతున్నారు.

*ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి వీర బాదుడురెడ్డిగా మారారని శైలజానాథ్‌ అన్నారు. పాదయాత్రలో పేదలపై ముద్దులు కురిపించిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు పన్నులతో పిడిగుద్దులు కురిపిస్తున్నారని శైలజానాథ్‌ ఆరోపించారు. అప్పులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకో?: అని సాకే శైలజానాథ్‌ అన్నారు.

*కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలను వదలాలంటూ గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు, మత్స్యకారులు, గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

*జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఫలితాలను సెప్టెంబరు 11వ తేదీన వెల్లడిస్తారు. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా 2.5లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం ఆగస్టు 7వ తేదీ నుంచి రిజిస్ర్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11లోపు అభ్యర్థులు రిజిస్ర్టేషన్లను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

*నిజాం ప్రభువుల పీడను వదిలించుకోవడానికి నాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, ఇప్పుడు దేశంలో ఉన్న నయా దొరల పీడను వదిలించుకోవడానికి మరో భారీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా.. సమైక్యంగా ఉద్యమించాలని, అప్పుడే దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోగలమని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత మల్లు స్వరాజ్యం సంతాప సభ విజయవాడలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఆయుధాలతో మతకలహాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హిజాబ్‌, హజార్‌ వంటి ఆచారాలు ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు వాటిని వివాదం చేస్తున్నారన్నారు. దేశ సంపదను 100 కుటుంబాల చేతుల్లో పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 2 లక్షల టన్నుల సామర్థ్యం గల గొడౌన్లు ఉన్నాయని, వాటిని ఆదాని, అంబానీలకు ఇవ్వబోతున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత మల్లు స్వరాజ్యం .. తన పూర్తి జీవితాన్ని పోరాటాలకు కేటాయించి సార్థకం చేసుకున్నారని చెప్పారు. పోరాటం ద్వారా దేనినైనా సాధించుకోవచ్చన్న స్ఫూర్తిని ఆమె ప్రజల్లో నింపారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.శ్రీనివాసరావు, సీహెచ్‌ బాబూరావు, పి.మధు తదితరులు పాల్గొన్నారు.

*భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళనలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు చేశారు. బస్సులను అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. గొల్లపూడి నుంచి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆయన చార్జీల భారంపై ప్రయాణికులతో మాట్లాడారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు, తుట్టగుంట, వెన్నూతల గ్రామాల్లో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారాలను ప్రజలకు వివరించారు. పోరంకి నుంచి ఉయ్యూరు వరకు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి చార్జీల భారాలను ప్రయాణికులకు వివరించారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు.

* కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిలో అత్యధిక మందికి టీకాలు అందించిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఏపీలో నిర్దేశిత 15-18 వయస్సు వారిలో 102.9ు మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు పేర్కొంది. అత్యధిక మందికి వ్యాక్సిన్‌ వేసిన రాష్ట్రాల్లో ఏపీ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌(80.8ు) రెండో స్థానంలో ఉందని తెలిపింది. కాగా.. దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాలు, యూటీల్లో 15-18 ఏళ్ల వారిలో 40 శాతం మందికి కూడా రెండు డోసులూ పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. నాగాలాండ్‌, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌, అసోం, పంజాబ్‌, చండీగఢ్‌, దాద్రా అండ్‌ నగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూలో 40 శాతం కన్నా తక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగినట్టు పేర్కొంది.

*వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఆంక్షలు విధిస్తోంది’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరంలో కూడా అమ్మఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టిందన్నారు. అందులో భాగంగానే విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి కట్‌ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. అమ్మఒడి పథకానికి పేద తల్లులను అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభు త్వం సిద్ధమైందన్నారు. ప్రణాళిక లేని వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతుందన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీంతోపాటు ఆధార్‌ కార్డుల్లో జిల్లా పేర్లు మార్చుకోవాలనే నిబంధన ప్రజలను మండుటెండల్లో ఆధార్‌ కేంద్రాల ముందు నిలబెడుతుందన్నారు.

*రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా మరో అడుగుపడనుందా? ఆ ప్రాంతం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారనుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటికే రెండు విశ్వవిద్యాలయాలు ఉన్న ఈ ప్రాంతంలో మరో యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుండటమే ఇందుకు కారణం. గజ్వేల్‌ నియోజకవర్గంలో త్వరలో ఓ ప్రైవేటు వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు కానుందని సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలోనే తొలి ప్రైవేటు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతంగా గజ్వేల్‌ నిలుస్తుంది. అంతేకాక మూడు విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. కావేరి వ్యవసాయ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. కావేరి సీడ్స్‌ సంస్థ ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. అయితే, గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండలం పాములపర్తిలో ఈ వర్సిటీ ఏర్పాటయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కావేరి సీడ్స్‌ సంస్థకు మర్కుక్‌ మండలం పాములపర్తి, వర్గల్‌ మండలం గౌరారం పరిధిలో దాదాపు 400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో దాదాపుగా 90 ఎకరాలు కొండపోచమ్మ రిజర్వాయర్‌లో పోయాయి. మిగిలిన భూమిలోని 200 ఎకరాల్లో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.

*జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను ఎత్తివేస్తే హైదరాబాద్‌కు పశ్చిమాన ఉన్న పర్యావరణం పూర్తిగా నాశనమవుతుందని పీపుల్స్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. శుక్రవారం పీపుల్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ‘సేవ్‌ హైదరాబాద్‌- సేవ్‌ జంట జలాశయాలు’ అనే అంశంపై చర్చా గోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా ఐఐసీటీ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కలపాల బాబూరావు మాట్లాడుతూ 111జీఓ తొలగింపుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరగడం తప్పా ఇంకేమి ఉండదని అన్నారు. జంట జలాశయాల నిర్మాణం తర్వాతే నగరంలో వరదలు తగ్గుముఖం పట్టాయని, వాటికి ముప్పు కలిగితే భవిష్యత్తులో ఇబ్బందులేనని చెప్పారు. ఆక్రమణలను తొలగించి మూసీ నదిని సుందరీకరణ చేయాల్సి ఉందని అన్నారు. వీటన్నింటిపై త్వరలో నివేదిక విడుదల చేస్తామని తెలిపారు. ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బీ.రామలింగేశ్వరరావు ప్రసంగిస్తూ మిషన్‌ భగీరథ పేరుతో వందలాది కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకురావడం వల్ల భారం పెరుగుతోందని, ఇక్కడ ఉన్న నీటిని వినియోగించడం వల్ల ఆ ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మాజీ సలహాదారు ఈఆర్‌ సాగర్‌ ధార తన అభిప్రాయాలు చెబుతూ నగర పర్యావరణాన్ని కాపాడుకోవడం అత్యవసరమని అన్నారు. కన్వీనర్‌ లుబ్నా శరావత్‌ ప్రసంగిస్తూ వాతావరణ మార్పుల కారణంగా నగరాల్లోనూ పెద్దఎత్తున వరదలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జంట జలాశయాలను హాని కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం 111 జీవోను ఎత్తివేస్తున్నారని ప్రశ్నించారు.

*హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దుండిగల్, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ఏరియాల్లో వడగళ్ల వాన కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ వర్షం మరో 45 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట్ – ఝూరాసంఘం ప్రాంతంలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. మరో 30 నిమిషాల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది.

*రష్యా చేస్తున్న దాడులను నిలువరించడం నుంచి రష్యాపై దాడులకు పాల్పడే వరకు వచ్చింది ఉక్రెయిన్. పరోక్షంగా ఈ విషయాన్ని రష్యానే వెల్లడించడం గమనార్హం. యాబై రోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో గత రెండు రోజులుగా తమ భూభాగంలోని గ్రామాలపై ఉక్రెయిన్‌ దాడి చేస్తోందని రష్యా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ దాడుల్ని ఖండిస్తున్న ప్రకటించిన రష్యా.. తమ భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై తమ మిసైళ్ల దాడుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది

*కరోనా వైరస్‌ కారణంగా డ్రాగన్‌ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్‌ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. వివరాల ప్రకారం.. కరోనా వైరస్‌ కారణంగా షాంఘైలో క‌ఠిన ఆంక్ష‌లు అమలవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘ‌ర్ష‌ణ‌కు దారి తీశాయి. పీపీఈ కిట్‌ ధరించి ఓ వీధికి వ‌చ్చిన పోలీసులు.. అక్‌సడ ఉన్న నివాసితుల ఇండ్ల‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ల‌లో పెట్టేందుకు పోలీసులు ముంద‌స్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్రంమంలో ఓ మహిళ.. త‌మ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నార‌ని ఆరోపించింది. దీంతో త‌మ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

*మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) నిర్మించిన వాగ్‌షీర్‌ జలాంతర్గామి ఈ నెల 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని అధికారులు శుక్రవారం తెలిపారు. పీ75 స్కార్పిన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్‌మెరైన్‌ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కిందని, ఇందులో 6 సబ్‌మెరైన్‌ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్‌ ఫ్రిగేట్స్‌ ఉన్నాయని ఎండీఎల్‌ చైర్మన్, ఎండీ నారాయణ్‌ ప్రసాద్‌ తెలిపారు.

* చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా కేసుల పెరుగుదల నమోదవుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. శనివారం కరోనా పాజిటివిటీ రేటు 4 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య సున్నా. మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,158గా ఉంది.