Politics

అలిగిన మంత్రులకు ఎమ్మెల్యేలకు త్వరలో `రిటర్న్ గిఫ్ట్

Auto Draft

ఏపీ అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 11న ఏపీలో కొత్త కేబినెట్ కోలువుదీరింది. జగన్ 2.0 కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 25 మంది పాత మంత్రుల్లో 11 మంది ని తిరిగి తీసుకుని కొత్తగా 14 మందికి అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ మంత్రుల్లో ఎక్కువ మంది కొత్తగా విజయం సాధించిన వారు.. ఉన్నారు. అదేసమయంలో గత ఎన్నికలకు కేవలం ఆరు మాసాలు. మూడు మాసాల ముందు మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో పార్టీలోని సీనియర్లు.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులు చెరిగారు. అంతేకాదు.. తమ అనుచరులతో నిరసనలు కూడా చేయించారు.

టైర్లు కాల్పించారు. కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. ఇది.. మంత్రి పదవులు ఆశించిన భంగ పడిన సీనియర్ల సంగతి. ఇక అప్పటికే మంత్రులుగా ఉంది.. 2.0 కేబినెట్లో అవకాశం రాని వారు కూడా తక్కువ తినలేదు. “మా జిల్లాలో ఆయనను ఉంచి నన్ను ఎలా తొలగిస్తారు. ఉంటే.. నన్ను కూడా కొనసాగించండి. లేక పోతే ఆయనను కూడా తీసేయండి“ అని ఒకరు డిమాండ్ చేస్తే.. “మా సామాజిక వర్గంలో మిగిలిన వారందరినీ కొనసాగించి.. నన్ను మాత్రమే ఎందుకు తీసేశారు. నేను వైఎస్ కుటుంబానికి దోస్తీ.. నన్ను తీసేస్తారా? టాఠ్! ఒప్పుకొనేది లేదు. ఇదిగో రాజీనామా!“ అని మరొకరు హఠం చేశారు.

ఇక అప్పటికే సీనియర్లుగా ఉండి.. తమకు అవకాశం చిక్కని వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా.. ఒకరిద్దరు అనుచరులతో తీవ్ర వ్యాఖ్యలే చేయించారు. ఇక ఒకాయినైతే.. ఏకంగా.. నా తఢాకా చూపిస్తా.. నేను విధ్వంస రాజకీయాలు చేయడంలో దిట్టను అని.. తెరమీదికి వచ్చారు. ఇలా.. తలకొక రకంగా.. రాజకీయాలను వేడెక్కించారు. అయితే.. వరుస పెట్టి వీరందరినీ పార్టీ అధిష్టానం బుజ్జగించింది. అంతేకాదు.. కొందరిని స్వయంగా పిలిచి మాట్లాడింది. మొత్తానికి ఇప్పటికైతే.. బుజ్జగింపుల పర్వం దాదాపు పూర్తయింది. దీంతో ఆయా నాయకులు .. ఏం చేస్తాం.. అంటూ.. సర్దుకు పోయే ధోరణిలో ఉన్నారు.

అయితే.. వీరు సర్దుకు పోయినా.. పార్టీ అధిష్టానం.. వీరు చూపించిన `ప్రేమ`ను మాత్రం సర్దుకు పోయేలా కనిపించడం లేదని తాడేపల్లి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఇలా ధిక్కారం చేసిన నాయకులకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించు కున్నట్టు వార్తలు వస్తున్నాయి. “వాళ్లు మనకు అంత చేసిననప్పుడు.. మనం ఎంతో కొంత చేయాలి.. లేకపోతే.. లావైపోతాం!“ అన్న `శ్రీమంతుడి` టైపులో.. వైసీపీ అధిష్టానం కూడా.. పార్టీలోని అసమ్మతి నేతలను పేరుపేరునా గుర్తుంచుకుని మరీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో సదరు జాబితాను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం.

సరే! ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ ఏంటని అంటే.. ఆయా అసమ్మతి నేతలకు ఇంట్లోనే పొగపెట్టాలని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఎలాగంటే.. వారి వారి జిల్లాల్లో వారి వారి గ్రాఫ్ను సర్వేలతో కొలిచి.. “ఇదిగో ఇదీ.. మీ పనితీరు“ అని మొహం మీద చూపించాలని నిర్ణయించుకుందట. అంతేనా.. అక్కడితో కథ అయిపోతుందా? అంటే.. కాదు.. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు.. “మీ పనితీరును సర్వే చేయించాం.. ప్రజలు మిమ్మల్ని తిప్పికొడుతున్నారు. సో.. వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ లేదు. మీ తరఫున.. ఇక్కడ వేరేవారికి టికెట్లు ఇస్తున్నాం“ అని కుండబద్దలు కొట్టబోతోందని.. అంటున్నారు. అంటే.. ఇప్పుడు నోరేసుకుని.. పడిపోయిన వారికి.. నోరు మూయించే కార్యక్రమానికి వైసీపీ అధిష్టానం.. రిటర్న్ గిఫ్ట్ రూపంలో షాక్ ఇవ్వనుందని అంటున్నారు తాడేపల్లి రాజకీయ నాయకులు. మరి నేతలు ఏం చేస్తారో చూడాలి.