NRI-NRT

అమెరికా వీసా రెన్యువల్‌ మరింత సులభం

అమెరికా వీసా రెన్యువల్‌ మరింత సులభం

అమెరికా వీసాలను రెన్యువల్‌ చేసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త. దేశంలో మొత్తం 11 నగరాల్లో ఇంటర్వ్యూలు అవసరం లేకుండా వీసా రెన్యువల్‌ చేసుకునేందుకు డ్రాప్‌బాక్స్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు అమెరికా దౌత్యకార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమకు దగ్గరలో ఉన్న నగరంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుని వీసా రెన్యువల్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. వీసా రెన్యువల్‌ కోసం అపాయింట్‌మెంట్‌ ఉన్నవారు కూడా ముందుగా కేటాయించిన కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ పట్టణాల్లోని డ్రాప్‌బాక్స్‌ను ఉపయోగించుకుని రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా కాన్సులేట్‌లలో ఉన్న వీసా కేంద్రాల్లో ఇంటర్వ్యూలు లేకుండా వీసా పునరుద్ధరించాలనే దరఖాస్తును ఎలాంటి ఫీజు అవసరం లేకుండానే సమర్పించవచ్చు. చండీగఢ్‌, జలంధర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, పూణె, కోచిలలో రూ.650 నామమాత్ర ఫీజు చెల్లించి డ్రాప్‌బాక్స్‌ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది చివరివరకు ఇంటర్వ్యూలు అవసరం లేకుండానే వీసా రెన్యువల్‌ చేసుకునే అవకాశాన్ని అమెరికా ప్రభుత్వం కల్పించింది. అమెరికన్‌ కాన్సులేట్‌లు ఉన్న పట్టణాలతో పాటు ఇతర పట్టణాల్లో కూడా డ్రాప్‌బాక్‌ ్స సౌకర్యం కల్పించడం వల్ల ప్రయాణభారం తగ్గడంతో పాటు వేగంగా వీసాలు రెన్యువల్‌ చేసుకునే అవకాశం కలుగుతుందని కాన్సులేట్‌ వర్గాలు తెలిపాయి.