WorldWonders

కాటికి తోడుగా వచ్చే కాటికాప‌రుల గురించి ఈ విష‌యాలు తెలుసా!

కాటికి తోడుగా వచ్చే కాటికాప‌రుల గురించి ఈ విష‌యాలు తెలుసా!

 జానపదం.. పల్లెవాసుల జీవితాల్లో అంతర్భాగం. మనసు లోతుల్లోంచి వచ్చే స్వచ్ఛమైన భావాలకు ప్రతిరూపం. పుట్టినప్పటి నుంచీ గిట్టే వరకూ.. ప్రతి సందర్భంలోనూ ఉత్సాహపరిచే కళా సాధనం. మరణం తర్వాత కూడా కాటికి తోడుగా వచ్చేదే.. కాటి కాపరుల గానం! మృతుల గుణగణాలను కీర్తిస్తూ.. ‘అంతిమ యాత్ర’కు ఉద్వేగాన్ని జోడిస్తారు కాటికాపరులు.

*శైవాన్ని పాటించే బుడగ జంగాలలో బేడవర్గానికి చెందినవారు కాటి కాపలు. వీరిని ‘కాటి కాపరులు’ అని కూడా వ్యవహరిస్తారు. తమ కట్టడి/ మిరాశీ గ్రామాల్లో అన్ని కులాలనూ ఆశ్రయిస్తారు. మరణానికి సంబంధించిన కథలు చెబుతూ, గేయాలను ఆలపిస్తారు. కట్టడి గ్రామంలో ఎవరైనా మరణిస్తే, తక్షణం అక్కడికి చేరుకుంటారు. కర్మకాండలు పూర్తయ్యే వరకూ ఉంటారు. మృతుని జీవిత విశేషాలను పాటలుగా పాడతారు. గుణగణాలను కీర్తిస్తారు. ఇంద్రజాల విద్యలనూ ప్రదర్శిస్తారు.

**ఆకట్టుకునే ఆహార్యం
వీరి వేషధారణ గంభీరంగా ఉంటుంది. రంగుల దుస్తులు, మెడలో పెద్ద గంటలు, పూసల దండలు, చంద్రవాల గొలుసు, రుద్రాక్ష మాలలు వేసుకొంటారు. నొసట పసుపు, విభూతితో పెద్ద బొట్టు, కళ్లకు కాటుక పెట్టుకుంటారు. చేతి వేళ్లకు రకరకాల ఉంగరాలు ధరిస్తారు. బుర్ర మీసాలు పెంచుకుంటారు. శివుడు, హరిశ్చంద్రుడు, లోహితాశ్రుడు, పాము చిత్రాలున్న రేకుల కిరీటం ధరిస్తారు. ఒక చేతిలో గంట, మరో చేతిలో ‘నపిర’ అనే సంగీత వాద్యం పట్టుకొంటారు. ఎడమ వైపు చంకలో జోలె ఉంటుంది. అందులో గారడీకి అవసరమైన ఎముకలు, గచ్చకాయలు, రాళ్లు, చెక్క బొమ్మల్లాంటి వస్తువులు ఉంటాయి.

**ఇంద్రజాల విద్య
వీక్షకులను ఆకట్టుకునే ఇంద్రజాల నైపుణ్యం వీరి సొంతం. వీరి వద్ద గవ్వలు, పసుపు కుంకుమలతో అలంకరించిన ‘అమ్మవారి బొమ్మ’ ఉంటుంది. తమ చేతిలో ఉన్న ఎముకతో ఆ బొమ్మను తాకిస్తూ.. ‘ఓం మహంకాళీ శాంభవీ’ అంటూ క్షణంలో మండ్ర గబ్బలు, తేళ్లు, ఎలుకలనూ పుట్టిస్తారు. నోట్లోంచి ఇనుప గోళీలు, మేకులూ తీస్తారు. కనికట్టు విద్యతో ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. వీరు దీపావళి తరువాత చెట్లతీర్థం పోయి, పోచమ్మ బోనాలు చేసుకుంటారు. ఆ తరువాత తమ కుల దైవం గుస్సాయి పండుగ ముగించుకొని, తమ కట్టడి గ్రామాలకు బయల్దేరతారు. తిరిగి శ్రావణమాసంలో ఇళ్లకు వస్తారు. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఇంటి దగ్గర ఉంటూ, మిగతా సమయమంతా సంచారంలోనే గడుపుతారు. మిరాశీ గ్రామానికి వెళ్లి, గ్రామ పెద్దలను కలుస్తారు. తమ రాక సమాచారాన్ని చెబుతారు. ఆ తర్వాత గ్రామంలో బోనుగను ఊపుకొంటూ పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతారు. నాలుగు బాటల కూడలిలో ఇంద్రజాలం ప్రదర్శిస్తారు. ఇందులో ఇద్దరు కళాకారులు ఉంటారు. ఒకరు ప్రధానంగా సంభాషిస్తూ విద్యలు ప్రదర్శిస్తుంటే, మరొకరు ‘బోనుగ’ను ఊదుతూ వంత పాడుతుంటారు. బొమ్మలతో దండాలు పెట్టిస్తూ, అవే మాట్లాడుతున్నట్లుగా భ్రమ కలిగిస్తారు. పాములు, తేళ్లు, కప్పలను సృష్టించి ప్రేక్షకులను భయకంపితులను చేస్తారు. శివశంకరుడిని తలచుకొని నోట్లోంచి రాళ్లను, గచ్చకాయలను తీస్తారు. ఊర పిచ్చుకను సృష్టించి, అరిపించి మాయం చేస్తారు.

**శవయాత్రలోనూ..
తమ మిరాశీ గ్రామంలో ఏ కులం వారు చనిపోయినా, అంతిమ సంస్కారాల్లో పాల్గొంటారు. ఇద్దరు లేక ముగ్గురు పురుషులు ఒక బృందంగా శవం ముందు నడుస్తూ, చనిపోయిన వ్యక్తి గుణగణాలను, గొప్పదనాన్ని రాజులతో పోలుస్తూ పాట కట్టి ఆలపిస్తారు. శివశంకరుడు, హరిశ్చంద్ర మహారాజు, పోశమ్మ తల్లి, వినాయకుడి పాటలూ పాడుతారు. ఒకరు పాడితే, మిగిలిన ఇద్దరు కర్రతో చేసిన గంటను వాయిస్తూ, ‘రామ రామా’ అంటూ వంత కలుపుతారు. ఇంటి నుంచి శవయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యేదాకా శవం వెంటే ఉంటారు. మారుతున్న కాలంతోపాటే కాటిపాపల కళారూపం కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది.