WorldWonders

అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి!

అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి!

సహజీవనం మన సంస్కృతి కాదు.. ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి తర్వాతే ఒక్కటి కావాలి.. పిల్లల్ని కనాలి. లేదంటే మహిళపైనే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. కానీ ఆ తెగలో మాత్రం స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయచ్చు.. పిల్లల్ని కనచ్చు.. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు.. నచ్చకపోతే అతడితో విడిపోవచ్చు కూడా! ఇదంతా అక్కడ కామన్‌! ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. శతాబ్దాల నుంచీ ఇదే ఆనవాయితీ కొనసాగుతోందక్కడ. అలాగని ఇదేదో వేరే దేశంలో ఉందనుకుంటే పొరపాటే! ఎందుకంటే సహజీవనాన్ని అతి సర్వసాధారణ విషయంగా, సహజమైన అంశంగా పరిగణించే ఆ తెగ మన దేశంలో.. అదీ ఉత్తరభారతంలో ఉంది.. ఇంతకీ ఎక్కడుందా తెగ? వింటోన్న కొద్దీ విస్తుపోయేలా ఉండే వారి వింత ఆచారాలేంటో తెలుసుకుందాం రండి..

సహజీవనమైనా, కాపురమైనా.. పెళ్లి తర్వాతే చేయాలనేది మన సంప్రదాయం. ఈ క్రమంలో పొరపాటున పెళ్లికి ముందే గర్భం దాల్చినా, పిల్లల్ని కన్నా.. మగవారి కంటే ముందు ఆడవారినే తప్పు పడుతుంటుంది మన సమాజం. అయితే ‘గరాసియా తెగ’ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పెళ్లికి ముందే నచ్చిన వారితో సహజీవనం చేసి.. పిల్లల్ని కనే సంప్రదాయం ఆ తెగలో అతి సాధారణ విషయం. దీని గురించి ప్రశ్నించే హక్కు, అధికారం అక్కడ ఎవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు.

*వరకట్నం కాదు.. కన్యాశుల్కం!
రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ తెగ విస్తరించి ఉంది. అయితే వీళ్ల సంప్రదాయం ప్రకారం.. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి నిర్ణీత వ్యవధుల్లో రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని.. పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం మొదలుపెట్టేయచ్చు. ఈ క్రమంలో అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి.. వారితో సహజీవనం ప్రారంభింపజేస్తారు. అంటే.. ఇది ఒక రకంగా ఎదురుకట్నం/కన్యాశుల్కంలా అన్నమాట! ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలోనూ పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారట! పైగా వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహించే ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది.

*పెళ్లి.. నామ మాత్రమేనట!
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ల పాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కనచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి (వ్యవసాయం, కూలీ పనులు చేయడం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు), ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చట! ఈ పద్ధతిని ‘దాపా’గా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు. అంటే.. అనుబంధంలో పెళ్లిని అత్యవసరంగా కాకుండా నామ మాత్రంగా వ్యవహరిస్తారన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ క్రమంలో పెరిగి పెద్దై సహజీవనం చేస్తోన్న తమ పిల్లలే వృద్ధ తల్లిదండ్రులకు పెళ్లి చేయడం కొన్ని కేసుల్లో మనం చూడచ్చు. పైగా సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్నా.. ఈ బంధం నుంచి బయటికి వచ్చే వెసులుబాటు కూడా ఇక్కడి మహిళలకు కల్పించారు గరాసియా తెగ పూర్వీకులు. మొత్తానికి పెళ్లి విషయంలో ఇక్కడి స్త్రీలపై లేనిపోని ఆంక్షలు విధించకుండా.. పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ, వారి నిర్ణయాలను గౌరవిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.

గరాసియా తెగ పాటిస్తోన్న ఈ ఆచారాలన్నీ ఈనాటివి కావు.. కొన్ని శతాబ్దాలకు పూర్వమే అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాల్ని ప్రారంభించినట్లు.. వాటినే ఈ తరం వారూ కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇవన్నీ వినడానికి వింతగా అనిపించచ్చు.. కానీ ఈ ఆచారాలే కాలక్రమేణా వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు.. వంటివెన్నో తగ్గించాయని అక్కడి వారు చెబుతున్నారు.