DailyDose

వేగంగా శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ పనులు

వేగంగా శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ పనులు

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా ఉన్న శంషాబాద్‌ విమానాశ్రయంలో చివరిదశ విస్తరణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏటికేడూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా విస్తరణ చేపట్టిన జీఎంఆర్… 3.4కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా వసతులు కల్పిస్తోంది. ప్రస్తుతం ఇప్పుడున్న ప్యాసింజర్‌ టెర్మినల్‌కు ఉత్తర వైపు రన్‌వే నిర్మించి అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 2008 మార్చి 23న జీఎంఆర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో నాలుగోది. దిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత అత్యంత రద్దీగల ఎయిర్‌పోర్టుగా నిలిచింది. తొలుత ఏడాదికి కోటి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే లక్ష్యంతో ఎయిర్‌పోర్టు నిర్మించారు. కానీ ఊహించని రీతిలో ఏటికేడు వృద్ధి నమోదు కావడంతో… 3కోట్ల 40 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా జీఎంఆర్ విస్తరణ చేపట్టింది. ప్రస్తుతం ప్రతి ఏటా రెండు కోట్లమందికిపైగా ప్రయాణాలు చేస్తున్నారు. మూడు దశల్లో విమానాశ్రయం విస్తరణ పూర్తైతే… ఏటా 15 నుంచి 20శాతం లెక్కన ప్రయాణాలు పెరిగినా మరో ఐదారు ఏళ్ల వరకు ఇబ్బంది ఉండదని జీఎంఆర్​ భావిస్తోంది.

విమానాశ్రయ విస్తరణలో భాగంగా తొలిదశలో 1,05,000 చదరపు మీటర్ల వైశాల్యంతో టెర్మినల్‌-1 అభివృద్ధి చేశారు. ఏటా కోటి40లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా సదుపాయాలు కల్పించారు. లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో హాంగర్స్‌, ఎయిర్‌ కంట్రోల్‌ టవర్‌… టెక్నికల్‌ భవనం, నిర్వహణ హ్యాంగర్స్‌ తదితర వాటి కోసం 49,500 చదరపు మీటర్లు వైశాల్యం వినియోగించారు. 1800 కార్ల పార్కింగ్‌ సౌకర్యం, ఓ హోటల్‌ నిర్మాణం చేశారు. ఇప్పటికే తూర్పు భాగాన 15,742 చదరపు మీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది.విస్తరణతో ఎయిర్‌పోర్టు వైశాల్యం 3లక్షల79వేల 370 చదరపు మీటర్లకు పెరిగింది. అందులో 149 చెక్‌ ఇన్‌కౌంటర్లు, ఏటీఆర్​ఎస్​తో కూడిన… 26 సెక్యూరిటీ స్క్రీనింగ్‌ యంత్రాలు, 44 ఎమిగ్రేషన్‌, 44 ఇమిగ్రేషన్‌ కౌంటర్లు, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మరిన్ని లాంజ్‌లు, రిటైల్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ అవుట్‌లెట్లు, 44 కాంటాక్ట్‌ గేట్లు, 28 రిమోట్‌ డిపార్చర్‌ గేట్లు, 9 రిమోట్‌ అరైవల్‌ గేట్‌లు, రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి 4 కొత్త రాపిడ్‌ ఎగ్జిట్‌ ట్యాక్సివేలు, ప్రయాణికులు విమానంలోకి ఎక్కడం, దిగేందుకు వీలుగా 3 కొత్త ఎయిరో బ్రిడ్జీలు, కాంటాక్ట్‌లెస్‌ ప్రయాణం కోసం 6 ఈ-గేట్‌లు మొదలైనవి ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రెండో రన్‌వే నిర్మాణం చేసేందుకు జీఎంఆర్​ యాజమాన్యం సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి బ్లూ ప్రింట్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.