Business

బుల్‌ జోరు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ – TNI వాణిజ్య వార్తలు

బుల్‌ జోరు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌  – TNI వాణిజ్య వార్తలు

* వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో దూసుకుపోతుంది. గత రెండు రోజులకు భిన్నంగా ఈరోజు బ్లూచిప్‌ కంపెనీలకు తోడు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు కూడా లాభాలు అందించాయి. హెవీ వెయిట్‌ రిలయన్స్‌ షేర్లు ఈ రోజు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి.ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు వందల పాయింట్లు పైగా లాభమంతో మొదలైంది ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో గంటగంటకు లాభపడుతూ పోయింది. ఉదయం 57,458 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 57,991 పాయింట్లను టచ్‌ చేసింది. చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 57,911 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 256 పాయిం‍ట్ల లాభంతో 17,392 పాయింట్ల వద్ద ముగిసింది.ఈరోజు మార్కెట్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా, మారుతి సుజూకి ఇండియా, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, రిలయన్స్‌ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.

*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.

*వరిపంటపై సుడిదోమ నివారణకు జపాన్‌కు చెందిన నిహాన్‌ నోయాకు కార్పొరేషన్‌ (ఎన్‌ఎన్‌సీ) అనుబంధ సంస్థ నికినో ఇండియా ఆర్కెస్ట్రా పేరుతో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. పంటకు మేలు చేసే పురుగులకు హాని చేయకుండా సుడి దోమను మాత్రమే నివారించే విధంగా జపాన్‌ టెక్నాలజీతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం సుడిదోమ నియంత్రణకు ఆరేడు సార్లు క్రిమిసంహారిణులను స్ర్పే చేయాల్సి వస్తోంది. కొత్త ఉత్పత్తితో ఈ అవసరం ఉండదని నికినో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ టొముకా నకిరో తెలిపారు. మరో మూడు కొత్త ఉత్పత్తులను కూడా కంపెనీ విడుదల చేయనుంది.

*హైదరాబాద్‌కు చెందిన అంకుర హాస్పిటల్స్‌ వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.400 కోట్లతో విస్తరణ కార్యకలాపాలను చేపట్టనుంది. మహిళలు, పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కలిగిన అంకుర హాస్పిటల్స్‌ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మొత్తం 12 ఆసుపత్రులను కలిగి ఉంది. ఇందులో తొమ్మిది హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ‘‘విస్తరణలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ల్లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 4 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కు దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం’’ అని అంకుర హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఒక్కో ఆసుపత్రిలో 120 పడకలు అందుబాటులోకి వస్తాయి.

*అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ వ్యాపార కార్యక్రమం(బిజినెస్ షో) సెప్టెంబరు 28, 29 తేదీల్లో జరగనుంది. ‘బిజినెస్ ఎక్స్‌పో షో 2022’ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని సింగపూర్ దక్కించుకుంది. ఈ ప్రముఖ ఈవెంట్ పాతిక సంవత్సరాలుగా కొనసాగుతోంది. అంతేకాకుండా… వేల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సహా వ్యాపార నిర్ణయాధికారులు ఈ షోలో పాల్గొననున్నారు. సింగపూర్‌ ఆర్థిక వ్యవస్థ మరింత ఉత్తేజం పొందడానికి ఈ ‘షో’ను కీలకంగా భావిస్తారు. అంతేకాకుండా… సింగపూర్ ప్రముఖ ప్రపంచ వ్యాపార శక్తి కేంద్రమని ప్రపంచానికి గుర్తు చేయడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం. ‘ఈ ఈవెంట్ మా వ్యాపార యజమానులకు ఎప్పటికప్పుడు ఓ ధీటైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా… ఇది ఆర్థిక వృద్ధికి కిక్ స్టార్టర్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది’ అని సింగపూర్ నేతలు పేర్కొంటున్నారు.

*ఆఫ్రికాకు బియాండ్ ది గ్రిడ్ ఫండ్(బీజీఎఫ్‌ఏ) ఊలుకు $ 2.5 మిలియన్ల నిధులను అందించనుంది. సోలార్ హోమ్ సిస్టమ్స్ ప్రొవైడర్ బుర్కినా ఫాసోలోని గ్రామీణ ప్రాంతాల్లో తన కార్యకలాపాలను విస్తరించడానికి నిధులను ఉపయోగిస్తుంది. ఆఫ్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ ప్రొవైడర్ ఊలు బుర్కినా ఫాసోలో తన కార్యకలాపాల కోసం ‘బియాండ్ ది గ్రిడ్ ఫండ్ ఫర్ ఆఫ్రికా’ నుండి మద్దతును పొందనుంది. ఈ బహుపాక్షిక నిధుల విధానం వ్యాపారాభివృద్ధి కోసం ఊలుకు $2.5 మిలియన్లను అందిస్తోంది. బుర్కినా ఫాసోలోని గ్రామీణ ప్రాంతాల్లో, కంపెనీ సోలార్ హోమ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఆఫ్రికాలో పనిచేస్తున్న ఇతర సోలార్ కిట్ ప్రొవైడర్ల మాదిరిగానే… ఈ కంపెనీ వాణిజ్య, పారిశ్రామిక(సీ&ఐ) కస్టమర్ల కోసం సోలార్ సిస్టమ్‌లను కూడా ఇన్‌స్టాల్ చేస్తుంది.

*రియల్టీ రంగానికి రుణాలు ఇచ్చే ముందు ఎన్‌బీఎ్‌ఫసీలు ఆ కంపెనీల ప్రాజెక్టులకు అన్ని నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అలాగే ఎన్‌బీఎ్‌ఫసీల సీఎండీలు సహా డైరెక్టర్లు, వారి బంధువులు, వారికి అనుబంధం గల సంస్థలకు రూ.5 కోట్లకు పైబడి రుణాలివ్వరాదని తాజా మార్గదర్శకాల్లో ఆర్‌బీఐ స్పష్టంచేసింది. రూ.5 కోట్లకు లోబడిన రుణాలు మాత్ర మే ఎన్‌బీఎ్‌ఫసీలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

*ప్రపంచకుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తలచుకుంటే చిటికెలో శ్రీలంక అప్పులను తీర్చేయగలడు. ఆయన కోరుకుంటే రాజవైభోగాలను అనుభవించగలడు. కానీ అవేమీ తనకు వద్దంటున్నాడు. నివాసం ఉండడానికి ఇప్పుడు ఇల్లు లేదని, అక్కర్లేదని మస్క్ చెప్పాడు. స్నేహితుల అదనపు బెడ్‌రూంలలో నిద్రపోతానని తెలిపాడు. తనకు సొంత స్థలం కూడా వద్దని, స్నేహితులకు చెందిన స్థలాల్లోనే ఉంటున్నట్టు పేర్కొన్నాడు. బ్రిటీష్- అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్ అండర్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడని న్యూయార్క్ టైమ్స్ ఓ వార్త ప్రచురించింది. టెస్లా కంపెనీ ఇంజనీరింగ్ వర్క్ ఎక్కువగా కొనసాగుతున్న బే ఏరియాకి వెళ్తే.. స్నేహితుల అదనపు బెడ్‌రూంలలో నిద్రపోతాను. స్నేహితుల వద్దకు అటుఇటు తిరుగుతుంటానని వివరించాడు. తనకు నౌక లేదని, సెలవులు తీసుకోబోనని వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా సంపదలో అసమానతలు, బిలియనీర్ల డబ్బు ఖర్చుపై అడిగిన ప్రశ్నకు పైవిధంగా మస్క్ స్పందించాడు. మొత్తానికి విలాసాలకు డబ్బు ఖర్చుపెట్టబోనని స్పష్టంగా చెప్పాడు.

*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ఎక్స్‌4 మోడల్‌లో సిల్వర్‌ షాడో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.71.9 లక్షలు- రూ.73.9 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉన్నాయి. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 3 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్న ఈ మోడల్‌ను చెన్నైలోని ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.