Politics

లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు మంజూరు

లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు మంజూరు

రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు డొరండ ట్రెజరీ కేసులో శుక్రవారం బెయిలు మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనకు సీబీఐ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

లాలూ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ యాదవ్‌కు హైకోర్టు బెయిలు మంజూరు చేసిందన్నారు. సగం శిక్షా కాలం జైలులో గడపటం, ఆరోగ్య సమస్యలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఉపశమనం ఇచ్చిందన్నారు. రూ.1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని, రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించినట్లు తెలిపారు.
లాలూకు రాంచీలోని స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధించింది. ఈ కుంభకోణం జరిగిన సమయంలో లాలూ బిహార్ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ ఇచ్చిన బూటకపు చలానాలు, బిల్లులను ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లియర్ చేసిందని, ఆ సొమ్మును ట్రజరీ ద్వారా విడుదల చేశారని కేసు నమోదైంది. డొరండ ట్రెజరీ నుంచి 1995-96లో రూ.139.35 కోట్లు అక్రమంగా విడుదలైనట్లు ఆరోపణలు నమోదయ్యాయి.