NRI-NRT

సౌదీలో విజిట్‌ వీసాల గడువు కుదింపు – వందలాది తెలుగు కుటుంబాలకు షాక్‌

సౌదీలో విజిట్‌ వీసాల గడువు కుదింపు –  వందలాది తెలుగు కుటుంబాలకు షాక్‌

అరేబియాలో సందర్శక వీసాల పునరుద్ధరణ గడువుపై అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ప్రవాసీలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు యేడాది ఉన్న ఈ వీసా గడువును ఇప్పుడు ఉన్నట్టుండి మూడు నెలలకే కుదించడంతో వందలాది తెలుగు ప్రవాసీల కుటుంబాల మాతృ భూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశంలో పని చేస్తున్న ప్రవాసీయులు.. వారి తల్లిదండ్రులు లేదా భార్యా పిల్లలను పిలిపించుకోవడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సందర్శక వీసాలు జారీ చేస్తుంది. దీని గడువు మూడు నెలలు ఉంటుంది. ప్రతి మూడు మాసాలకు ఒకసారి చొప్పున సంవత్సరం వరకు దీనిని రెన్యువల్‌ చేసుకోవచ్చు.రెండు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది కుటుంబాలు ఈ వీసాలతో గరిష్ఠంగా ప్రయోజనం పొందుతున్నాయి. ఐటీ రంగంలో పని చేస్తున్న చాలా మంది దీనిని ఉపయోగించుకుంటున్నారు. అయితే, నాలుగు రోజులుగా ఈ వీసా పునరుద్ధరణను అధికారులు నిలిపివేశారు. దీంతో గడువు దగ్గరపడిన కుటుంబాలన్నీ ఉన్న ఫలంగా తిరుగు పయనం కావలసిన పరిస్థితి నెలకొంది. ఫ్యామిలీ వీసా వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీంతో ప్రవాసీలు సులువుగా లభించే సందర్శక వీసాలతో తమ కుటుంబీకులను తీసుకురావడం సాధారణమైపోయింది. ఇది క్రమంగా పెరిగిపోతుండడంతో.. అధికారులు విజిట్‌ వీసాల గడువు కుదించారు.