DailyDose

కువైత్‌లో ప్రవాస భారతీయుడు మృతి – TNI నేర వార్తలు

కువైత్‌లో  ప్రవాస భారతీయుడు మృతి – TNI  నేర వార్తలు

* కువైత్‌లో ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. అక్కడి సభా చెస్ట్ ఆస్పత్రిలో సెల్వరాజ్(59) అనే భారత వ్యక్తి శుక్రవారం చనిపోయాడు. అనారోగ్యంగా ఉండడంతో సెల్వరాజ్‌ను కుటుంబ సభ్యులు సభా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ గత పాతికేళ్లుగా కువైత్‌లో రెస్టారెంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగాఫ్ బ్లాక్-4లో అతడికి చెందిన కీర్తి రెస్టారెంట్ ఉంది. సెల్వరాజ్‌కు భార్య సావిత్రి, పిల్లలు గోపిక, కీర్తి, విష్ణు ఉన్నారు. అతడి హఠాన్మరణంతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంధువులు, స్నేహితులు సెల్వరాజ్ మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

*చిన్న సైజు విమానం సోడా ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఈ దుర్ఘటన జరిగింది. హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న సైజు విమానం.. సోడా బాటిళ్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం జాక్మెల్ సౌథర్న్ కోస్టల్ సిటీకి వెళ్లే క్రమంలో ఓ చోట ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. విమానం సీటింగ్ కెపాసిటీ ఐదు మాత్రమే అని చెప్పారు.

*దిల్లీలోని గాజియాబాద్లో సినిమా స్టంట్ను తలపించేలా ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు.. బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ రైడర్ కొన్ని సెకండ్ల పాటు గాల్లో పల్టీలు కొట్టాడు. అనంతరం కారు పైకప్పు మీద పడి.. కిందకు జారిపోయాడు. దీంతో ఆ రైడర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉండటం వల్ల.. అతడికోసం గాలిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

*హైదరాబాద్- వరంగల్ ప్రధాన రహదారి బీబీనగర్ టోల్‌గేట్ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీకొట్టిన ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరుకావడానికి వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలి వద్ద ఆగారు. ప్రమాదాన్ని చూసి వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు.

*గుడివాడ రెవిన్యూ ఇన్స్పెక్టర్ అరవిందు పై హత్యాయత్నం కేసులో పోలీసుల పురోగతి.అరవింద్ ఫిర్యాదు మేరకు పది మందిపై 353,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గుడివాడ రూరల్ పోలీసులు.ఆర్.ఐ పై హత్యాయత్నానికి పాల్పడిన రాధాకృష్ణ, లక్ష్మణరావులతో పాటుగా దాడి చేసిన 9 మంది అరెస్ట్, అరెస్టయినవారిలో బాల నేరస్తుడు.

* పల్నాడు జిల్లా నరసరావుపేటలో కళ్యాణ్ జ్యువెలరీ షాపులో పనిచేసే రామాంజనేయులు కిడ్నప్ కు గురయ్యాడు. జంగం బాజి అనే వ్యక్తి మరికొందరు షాపులోనికి వచ్చి తన భర్తను అపహరించారని రామాంజనేయులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

*అనకాపల్లి: జిల్లాలోని పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం లేకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

*ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లా గుర్హా కలా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను తండ్రి, సోదరుడు కలిసి గొంతు నులిపి చంపారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్‌మార్టం కోసం పంపారు. అనంతరం ‘పరువు హత్య’ కింద కేసు నమోదు చేశారు.

*అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుంచంగి గ్రామంలో నిర్వహణలో లేని క్వారీలో హత్య జరిగింది. పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. మృతుడి వివరాలు కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*జైళ్ళలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ఆ శాఖకు బోంబే హైకోర్టు సూచించింది. జైళ్ళలో ఉంటున్న ఖైదీలు తమకు తగిన వైద్య సదుపాయాలు లేవని చెప్తూతమకు బెయిలు మంజూరు చేయాలని కోరడానికి అవకాశం లేకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపింది. దీనివల్ల భీమా-కొరెగావ్ కేసులో నిందితుడు వరవరరావుమరికొందరు ఖైదీల ఫిర్యాదులు పరిష్కారమవుతాయని పేర్కొంది. అలాంటపుడు భవిష్యత్తులో ఈ కారణాన్ని చూపుతూ బెయిలును కోరడానికి అవకాశం ఉండదని తెలిపింది.

*ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్టీచర్ మధ్య అనుచిత సంబంధంపై ఆ గ్రామస్థులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరిద్దరూ పాఠశాలలోని స్టోర్ రూమ్‌లో అనుచిత రీతిలో లైంగికశృంగార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండటాన్ని వారు చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

*ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ ఇంట్లో శవమై కనిపించారు. వీరందరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానంతరం వారున్న ఇంటికి దుండగులు నిప్పు పెట్టినట్లు సమాచారం. సామూహిక హత్యలు ప్రయాగరాజ్ జిల్లాలో కలకలం రేపింది. సంఘటన స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులతోపాటు జిల్లా ఎస్పీ తరలివచ్చారు.కుటుంబసభ్యులంతా ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు.నివాసం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా ఐదుగురు వ్యక్తులు దారుణంగా మృతి చెందినట్లు గుర్తించారు.పోలీసులు విచారణ ప్రారంభించినా హత్యకు గల కారణాలను మాత్రం ఇంకా నిర్ధారించలేకపోయారు.గత వారం నవాబ్‌గంజ్ జిల్లాలో ఓ దుండగుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో పొడిచి చంపారు.

*మురికినీటి తొట్టెలో విషవాయువు సోకి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందిన ఘటన విషాదానికి దారితీసింది. మదురై కార్పొరేషన్‌ 70వ వార్డు నేతాజీ రోడ్డు నెహ్రూ నగర్‌లో ఉన్న కార్పొరేషన్‌ పంపింగ్‌ స్టేషన్‌లో అలంగానల్లూర్‌కు చెందిన లక్ష్మణన్‌, మడక్కుళం ప్రాంతానికి చెందిన శివకుమార్‌, శరవణన్‌ తాత్కాలిక కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో, గురువారం రాత్రి వారు తొట్టెను శుభ్రం చేస్తున్న సమయంలో తొట్టెలో పడడంతో విషవాయువు సోకింది. వారి కేకలు విన్న సహచరులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గంట శ్రమించి ముగ్గురిని వెలికి తీసినా కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. వీరిని రక్షించేందుకు యత్నించిన కార్తీక్‌ అనే వ్యక్తి కూడా విషవాయువుతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్‌ అనీశ్‌ శేఖర్‌, మదురై కార్పొరేషన్‌ మేయర్‌ ఇంద్రాణి, డిప్యూటీ మేయర్‌ నాగరాజన్‌, పోలీస్‌ కమిషనర్‌ సెంథిల్‌కుమార్‌ పరిశీలించారు. కాగా, తొట్టెను శుభ్రం చేసే కాంట్రాక్ట్‌ పొందిన వీఆర్జీ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన రమేష్‌, లోకనాథన్‌, విజయానంద్‌లపై మదురై ఎస్‌ఎస్‌ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసారు.

* పాతగొడవల నేపథ్యంలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. కర్రల తో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధి వారాసిగూడ పోచమ్మ ఆలయం వెనక వీధిలో శుక్రవారం జరిగింది. ముషీరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడికి, వారాసిగూడకు చెందిన వంశీకి పాతగొడవలున్నాయి. ఈ నెల 16న సాయి, వంశీ గ్యాంగ్‌లు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో సాయి కొంతమంది యువకులను తీసుకుని వంశీ ఇంటికి వచ్చాడు. ఓ ఇంటి నిర్మాణం వద్ద కట్టెలను తీసుకుని వంశీ, అతడి స్నేహితులపై దాడి చేశారు. వంశీతోపాటు మరో యువకుడికి గాయాలు కావటంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

*హైదరాబాద్: నగరంలో ఓ సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌లోని సాయి గెస్ట్ హౌస్‌లో ప్రసాద్ నాయుడు (49) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కడప జిల్లాలో ల్యాప్‌టాప్‌ పేలి తీవ్రంగా గాయపడ్డ యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. బి.కోడూరు మండలం మేకవారిపల్లెకు చెందిన సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనర్సమ్మ దంపతుల కుమార్తె సుమలత(22) బెంగళూరులో మ్యాజిక్‌ టెక్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. 18న ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌ (డెల్‌) ఆన్‌ చేసి చార్జింగ్‌ పెట్టి పనిచేస్తుండగా పేలి తీవ్రంగా గాయపడ్డంతో చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు.

*ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిర్వాహకుల నుంచి రూ.32,54,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ డీఎస్పీ రమ్య విలేకరులకు వివరాలను వెల్లడించారు. పుదుచ్చేరి రాష్ట్రం యానాంకు చెందిన ముద్దనూరి ప్రదీప్‌, ఒంగోలుకు చెందిన బెత్తబోయిన వెంకటేశ్వర్లు ఆంధ్రా-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొడికొండ చెక్‌పోస్ట్‌ సమీపంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించేవారు. హిందూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన్‌, చిలమత్తూరు ఎస్‌ఐ రంగడు దాడిచేసి నిందితుల నుంచి రూ.32,54,500, 57 సెల్‌ఫోన్లు, రెండు కమ్యూనికేటర్‌ బాక్సులు, రెండు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు.

*చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సంకల్పంతో పలు చేనేత కార్మికసంఘాలు ఐక్యంగా ఈ నెల 23న విజయవాడలో జరుపతలపెట్టిన చేనేత మహాధర్నాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి మంగళగిరిలోని చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులను వారి ఇళ్లవద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 9:30 గంటలకు పాతమంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మికసంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ నివాసానికి పోలీసులు వెళ్లి అయన్ను ముందస్తుగా అరెస్టు చేశారు.

*అద్దె చెల్లించకపోవడంతో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రానికి భవన యజమాని తాళం వేశారు. ఇదే కేంద్రానికి విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయని, ఎన్నిసార్లు అడిగినా చెల్లించికపోవడంతో స్థానిక విద్యుత్‌శాఖ అధికారులుఈ నెల 4న విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారు. గ్రామానికి చెందిన మానుకొండ భాస్కరావు వైఎ్‌సఆర్‌ సీపీ అభిమాని. గ్రామస్తులు కోరడంతో ఆర్‌బీకే సెంటర్‌ ఏర్పాటుకు అద్దె ప్రాతిపదికన తన భవనాన్ని ఇచ్చారు. సిబ్బంది కరెంట్‌ బిల్లు చెల్లించలేదు సరికదా 14నెలలుగా పేరుకుపోయిన అద్దె బకాయిలు అడిగితే సంబంధిత శాఖ నుంచి డబ్బులు రాకపోతే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని దురుసుగా సమాధానం చెప్పారని, గత్యంతరం లేకనే కేంద్రానికి తాళం వేశానని యజమాని భాస్కరరావు తెలిపారు.

*తిరుమల కొండమీద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్ల మీద హఠాత్తుగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో భక్తులు విస్తుపోయారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత దాదాపు అరగంటకు పైగా ఈ ప్రసారాలు సాగాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక చింతన పెంచడం కోసం తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌ కార్యక్రమాలను వీటిలో ప్రసారం చేస్తుంటారు. అయితే శుక్రవారం సాయంత్రం భక్తికార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. ఉన్నట్టుండి స్ర్కీన్‌ల్లో హిందీ సినిమా పాటలు రావడం మొదలయ్యాయి. సాయంత్రం 5.40 నుంచి 6.15 గంటల వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్దనున్న ఓ స్ర్కీన్‌లో వీటిని చూసిన భక్తులు గగ్గోలు చేశారు. దీంతో వెంటనే ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఆపే ప్రయత్నం చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ ముందున్న స్ర్కీన్‌పై మాత్రం అరగంట పాటు సినిమా పాటలు, యాడ్‌లు వచ్చాయి. ఓవైపు మైకుల్లో గోవిందనామాలు వినిపిస్తుండగా, ఇంకోవైపున స్ర్కీన్‌పై సినిమా పాటలు రావడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. పూడూర్ స్టేజీ దాటినా తర్వాత లారీని రెండు వ్యాన్లు ఢీ కొట్టాయి. ఆ వెంటనే కోడి గుడ్ల లోడ్‌తో వెళ్తున్న వాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో స్థానికులు కోడి గుడ్లను ఎగబడి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.

* కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చల్లగిరగల గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

* పాతగొడవల నేపథ్యంలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. కర్రల తో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధి వారాసిగూడ పోచమ్మ ఆలయం వెనక వీధిలో శుక్రవారం జరిగింది. ముషీరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడికి, వారాసిగూడకు చెందిన వంశీకి పాతగొడవలున్నాయి. ఈ నెల 16న సాయి, వంశీ గ్యాంగ్‌లు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో సాయి కొంతమంది యువకులను తీసుకుని వంశీ ఇంటికి వచ్చాడు. ఓ ఇంటి నిర్మాణం వద్ద కట్టెలను తీసుకుని వంశీ, అతడి స్నేహితులపై దాడి చేశారు. వంశీతోపాటు మరో యువకుడికి గాయాలు కావటంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

* నందవరం మండలంలోని మిట్టసోమాపురం గ్రామానికి చెందిన బోయ జయలక్ష్మి(20) గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం దైవందిన్నె గ్రామానికి చెందిన బోయ జయలక్ష్మికి మిట్టసోమాపురం గ్రామానికి చెందిన పరశురాముడికి వివాహమైంది. వీరి పెళ్లికి పరశురాముడి ఇంట్లో పెద్దలకు ఇష్టం లేదు. దీంతో జయలక్ష్మిని బావ లక్ష్మన్న, వరసకు అక్క అయిన రాజేశ్వరి వేధిస్తుండేవారు. జయలక్ష్మి తన భర్తతో కలసి వేరు కాపురం పెట్టింది. అయినా పరశురాముడి బంధువులు ఘర్షణ పడుతుండేవారు. గురువారం రాత్రి జయలక్ష్మి, భర్త పరశురాముడు భోజనం చేసి ఇంట్లో నిద్రించారు. రాత్రి పరశురాముడు నిద్ర లేచి చూచేసరికి జయలక్ష్మి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. అయితే మృతురాలి తండ్రి వెంకటేశ్‌ తన కుతురు మృతిపై అనుమానం ఉందని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను పెబ్బేరు మండలం శాగాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

*రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. స్థిర, చర ఆస్తులు కలిసి మొత్తం 3.5 కోట్ల రూపాయల మేర ఉన్నట్టు అనిశా తనిఖీల్లో బయటపడింది. శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌, వాసవినగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు బృందాలు సోదాలు జరిపాయి.ఇళ్లు, ఇంటి స్థలాలకు చెందిన పత్రాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి ఆభరణాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రాములును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.