Kids

రాతిపువ్వుతో లాభాలెన్నో…

Auto Draft

రాతిపువ్వు (రాక్‌ మాస్‌, స్టోన్‌ ఫ్లవర్‌) అనేది ఒకరకం మసాలా మొక్క. నాచు జాతికి చెందినది. హిమాలయాలు, అతి చల్లని ప్రాంతాల్లో కొండరాళ్ల సందుల్లో పెరుగుతుంది. శైలేయకం. శిలాపుష్ప, ఛరీలా, శీతశివ, పథ్థర్‌ కా ఫూల్‌ ఇలా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే పైకి ఏ విధమైన సుగంధమూ ఉండదు. వంటకాల్లో చేర్చినప్పుడు, తాలింపుకోసం నూనె లేదా నెయ్యిలో కొద్దిగా వేసి వేడి చెయ్యగానే దీని సుగంధం బయటకు వచ్చి రుచివర్ధకంగా పనిచేస్తుంది. శాకాహార వంటకాల్లోనూ, బిర్యానీ పులావ్‌ లాంటి మాంసాహార వంటకాల్లోనూ సుగంధ ద్రవ్యంగా దీన్ని విస్తృతంగా వాడతారు. ఛరేలీ లేదా దగద్‌ ఫూల్‌ అని అడిగితే పెద్ద షాపింగ్‌ మాల్సులోనూ, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థల్లోనూ దొరుకుతుంది. చెట్టినాడు మసాలాల్లో ఇది తప్పక కలుస్తుంది. మహారాష్ట్రవాళ్లు గోడమసాలా అనీ, ఉత్తరప్రదేశ్‌ వాళ్లు పోట్లిమసాలా అనీ పిలుస్తారు. గరమ్‌ మసాలాల్లో దీన్ని ఎక్కువగా కలుపుతారు.

ప్రయోజనాలివి…
మార్కెట్టులో ఇది ఎండినదే మనకు దొరుకుతుంది. కానీ, పూర్వపు రోజుల్లో దీన్ని ఆకుపచ్చగా లేతగా ఉన్నప్పుడే కోసుకొచ్చి కూరగా వండుకునేవారని నలుడి పాకదర్పణాన్ని బట్టి తెలుస్తోంది. మౌలికంగా ఇది చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. చలవ చేస్తుంది, గుండెకు మేలుచేస్తుందని బాగా వాడతారు. కొవ్వుని కరిగిస్తుంది స్థూలకాయం, షుగరువ్యాధులను హరిస్తుంది. కీళ్లవాతాన్ని నివారిస్తుంది. రక్తవృద్ధినిస్తుంది. లివర్‌ వాపుని తగ్గిస్తుంది. టీబీ లాంటి క్ష్షీణింపచేసే వ్యాధుల్లోనూ, ఎలెర్జీ వ్యాధుల్లోనూ విశేషంగా దీన్ని వాడతారు. విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఔషధ విలువలున్న శక్తిదాయక ఆహారద్రవ్యం.తక్కువ మోతాదులోనే ఎక్కువ పనిచేస్తుంది.మూత్రపిండాల్లో రాళ్లను కరిగించటం కోసం దీన్ని నీళ్లలో వేసి టీ కాచుకుని రెండుపూటలా తాగుతారు. ఇది మూత్రవిసర్జన ఎక్కువగా అయ్యేలా చేస్తుంది. రాయిని కరిగించటానికి, బయటకు కొట్టుకొచ్చేందుకు సహకరిస్తుంది. మూత్రపిండాల్లో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది. డయాలసిస్‌ మీద ఉన్నవారికి మేలుచేస్తుంది. జీర్ణకోశాన్ని బలపరుస్తుంది. పాదాలకు, ముఖానికి, చేతులకు నీరుపట్టటాన్ని (ఎడీమా) తగ్గిస్తుంది. ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యల్ని నివారిస్తుంది. కరోనా సమస్యలతో బాధపడేవారికి దీని టీ బాగా ఉపయోగిస్తుంది. వాపు తగ్గించే గుణంతో పాటు పుండుమానేలా చేసే గుణం కూడా దీనికి ఉంది. అనేక ఆయింట్‌మెంట్లలో దీన్ని కలుపుతారు.ఔషధాన్ని ఆహారపదార్ధాల్లో ఒకటిగా తీసుకోవటం అనేది గొప్ప ఆలోచన. ఈ శైలేయం అనే రాతి పువ్వు చాలా కొద్ది మోతాదులో ఆహార పదార్థాల్లో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి సైడ్‌ ఎఫెక్టులు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. తక్కువ మోతాదులో వాడితే సరిపోతుంది. మోతాదు ఎక్కువైతే ఇబ్బందులుంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనే జీవనీయ గుణాలను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. మూడుదోషాల సమతుల్యతను సాధించే ఆహార యోగ్యమైన ఔషధద్రవ్యంగా భావించింది. హానికర మసాలాలకన్నా రాతిపువ్వు వాడకాన్ని కొనసాగించటం మంచిది.