Business

జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! – TNI వాణిజ్య వార్తలు

జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! – TNI వాణిజ్య వార్తలు

* ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 30 వరకూ 6.50 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇది 6.75 శాతంగా ఉంది. కస్టమర్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బట్టి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫరు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ (మార్ట్‌గేజెస్, ఇతర రిటైల్‌ అసెట్స్‌) హెచ్‌టీ సోలంకి తెలిపారు.
*ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ న్యూట్రల్‌ డెలివరీలను చేపడుతున్నట్టు ప్రకటించింది. అంటే డెలివరీల్లో భాగంగా వినియోగించిన ప్లాస్టిక్‌కు సమాన మొత్తాన్ని 100 శాతం రీసైకిల్‌ చేస్తారు. ఇందుకోసం ఐఎస్‌వో ధ్రువీకరణ ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సంస్థలతో చేతులు కలుపుతోంది.
ఈ సంస్థలు ప్లాస్టిక్‌ను సేకరించి ప్రాసెస్‌ చేస్తాయి. స్థిర ప్యాకేజింగ్‌ విధానంలో మూడేళ్లలో 10 కోట్ల ఆర్డర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ‘ప్రస్తుతం ప్లాస్టిక్‌ లభిస్తున్న ధరలో అందుబాటులోకి వచ్చేలా బయోడీగ్రేడబుల్, ఇతర ప్లాస్టికేతర ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ముఖ్యమని కంపెనీ గుర్తించింది. ఫుడ్‌ డెలివరీలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, తొలగించడం కోసం మరింత కృషి జరగాల్సి ఉంది.అన్ని రకాల వంటకాలకు స్థిరమైన ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రయత్నాలను పెంచుతున్నాం. ఈ చొరవతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతుంది. ఆదాయం, లాభంపైనా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భూమికి ఏది మంచిదో అది వ్యాపారానికీ మంచిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మిగతావన్నీ సరిగ్గా చేసినప్పుడు లాభాలు వస్తాయని కూడా విశ్వసిస్తున్నాను. ఇది ఖచ్చితంగా సరైన దిశలో ఒక అడుగు’ అని ఆయన అన్నారు.
*ఆటోమొబైల్‌ సెక్టార్‌లో ధరల పెంపు సీజన్‌ నడుస్తోంది. వరుసగా ఒక్కో కంపెనీ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ కూడా ప్యాసింజర్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ తాజా పెంపు కూడా తక్షణమే (2022 ఏప్రిల్‌ 23) అమల్లోకి వస్తుందని తెలిపింది. కార్ల తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా వెల్లడించింది.టాటాలో అనేక మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. వివిధ మోడళ్లు, వేరియంట్లు అన్నింటి మీద సగటున 1.1 శాతం ధర పెరిగింది. టాటా నుంచి నెక్సాన్‌, హారియర్‌, టియాగో, టిగోర్‌, ఆల్ట్రోజ్‌ మోడళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇవి కావాలనుకునే వారు ఇకపై పెరిగిన ధర చెల్లించకతప్పదు. కాగా కమర్షియల్‌ వెహికల్స్‌కి ధరల పెంపు నుంచి టాటా మినహాయింపు ఇచ్చింది.
*దేశంలో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), యాక్సిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో ఇందుకు నాంది పలికాయి. అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించే ఎంసీఎల్‌ఆర్‌ రుణాల వడ్డీ రేట్లను బ్యాంకులు స్వల్పంగా 0.05 నుంచి 0.10 శాతం మేర పెంచాయి. దీంతో ఏడాది కాలపరిమితి ఉండే ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రుణాలపై వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది.
*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు.
*ప్రపంచ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదగాలనుకుంటున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 2,500 కోట్ల డాలర్లకు, ఉద్యోగుల సంఖ్య దాదాపు 6 లక్షల స్థాయికి చేరుకుందని టీసీఎస్‌ సీఈఓ, ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ శుక్రవారం ఓ సదస్సులో పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆదాయాన్ని ప్రస్తుత స్థాయికి రెండింతలు, మూడింతలు, నాలుగింతల స్థాయికి పెంచుకోవాలని ఆకాంక్షిస్తోందన్నారు. పలు విభాగాల్లో టీసీఎస్‌ ఇప్పటికే ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీగా ఉందని గోపీనాథన్‌ అన్నారు. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగానికి ఐటీ సేవలందించే విషయంలో టీసీఎస్‌ అతిపెద్ద కంపెనీ అని, ఉద్యోగులపరంగా రెండో స్థానంలో ఉందన్నారు.
*ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ గ్రూప్‌నకు రుణదాతలు భారీ షాకిచ్చారు. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఆస్తుల విక్రయ ఒప్పందానికి ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) రుణదాతలు వ్యతిరేకంగా ఓటు వేశారు. రిలయన్స్‌ రిటైల్‌తో డీల్‌కు అనుమతి కోరుతూ జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో 75 శాతానికి పైగా వాటాదారులు, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతల నుంచి మద్దతు లభించినప్పటికీ, సెక్యూర్డ్‌ రుణదాతల నుంచి అవసరమైన 75 శాతం అనుకూల ఓటింగ్‌ను సాధించలేకపోయామని ఎఫ్‌ఆర్‌ఎల్‌ తెలిపింది. అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలతో పోలిస్తే, సెక్యూర్డ్‌ రుణదాతలకు రుణాల రికవరీ విషయంలో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది.
*ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) లిమిటెడ్‌ మరో భారీ కొనుగోలు జరిపింది. దేశంలో అతిపెద్ద ఽథర్డ్‌పార్టీ మెరైన్‌ సర్వీస్‌ కంపెనీ ఓషియన్‌ స్పార్కల్‌ లిమిటెడ్‌ (ఓఎ్‌సఎల్‌)లో 100 శాతం వాటాను రూ.1,530 కోట్లకు దక్కించుకుంది. ఏపీసెజ్‌ తన అనుబంధ విభాగమైన అదా నీ హార్బర్‌ సర్వీసెస్‌ ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
*ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రభుత్వ ప్రణాళికకు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం భారీగా గండికొట్టింది. ఈ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.30,000 కోట్లకు తగ్గించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్‌ కథనం వెల్లడించింది. గత టార్గెట్‌తో పోలిస్తే 40 శాతం తక్కువిది. ఎందుకంటే, ఎల్‌ఐసీలో 7 శాతం వాటా విక్రయం ద్వారా రూ.50,000 కోట్ల మేర సమీకరించాలని ఈ నెలలో ప్రభుత్వం భావించింది.
*అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మన ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 874.18 పాయింట్లు బలపడి 57,911.68 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 256.05 పాయింట్ల లాభం తో 17,392.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు 3.50 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మారుతి సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, టీసీఎస్‌ షేర్లు 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేసుకున్నాయి.
*దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా.. భారత ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెడుతోంది. హై ఎండ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ క్రాస్‌ఓవర్‌ ఈవీ6 తో ఈ ఏడాదే భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు కియా ప్రకటించింది. మే 26న ఈ ఎలక్ట్రిక్‌ కారు బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారత్‌లో పరిమిత సంఖ్యలో కేవలం 100 ఎలక్ట్రిక్‌ కార్లను మాత్రమే విక్రయించనున్నట్లు కియా ఇండియా ఎండీ, సీఈఓ తే జిన్‌ పార్క్‌ వెల్లడించారు. రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో ఈ కారును తీసుకువస్తోంది. సింగిల్‌, డ్యూయల్‌ మోటార్‌ వెర్షన్స్‌తో 58 కేడబ్ల్యుహెచ్‌, 77.4 కేడబ్ల్యూహెచ్‌తో ఇది అందుబాటులో ఉండనుంది.
*భారత్‌ నుంచి సేవల ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. భారత్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న ‘ఇండియా ఎకనామిక్‌ కాంక్లేవ్‌’లో రాజన్‌ ఈ అభిప్రా యం వ్యక్తం చేశారు. అయితే సమాచార భద్రత, గోప్యతకు పశ్చిమ దేశాలు ఇచ్చే ప్రాధాన్యతను మనం అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటేనే, ఈ ఎగుమతి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతామన్నారు.
*భారత్‌ నుంచి సేవల ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. భారత్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న ‘ఇండియా ఎకనామిక్‌ కాంక్లేవ్‌’లో రాజన్‌ ఈ అభిప్రా యం వ్యక్తం చేశారు. అయితే సమాచార భద్రత, గోప్యతకు పశ్చిమ దేశాలు ఇచ్చే ప్రాధాన్యతను మనం అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటేనే, ఈ ఎగుమతి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతామన్నారు.