Kids

చేపమింగిన కంకణం

చేపమింగిన కంకణం

కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్లాడు. దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రిచెట్టు దర్శనమిచ్చింది. ఆ చెట్టు తూర్పుకొమ్మను ఎక్కి వెళ్లిన వసంతునికి మనుషుల అలికిడి లేని ఒక కోట కనిపించింది. ఆ కోటలో తారసపడిన కళావతిని వసంతుడు ప్రేమించాడు. కళావతిని బంధించిన రాకాసి ఆయువు గుట్టు తెలుసుకున్న వసంతుడు, దానిని హతమార్చాడు.

రాకాసి పీడ వదిలిపోయిన తరువాత పూర్తి ఏకాంతం లభించిన వసంతుడు కళావతి ఆనందంగా కొంతకాలం గడిపారు. సమీపంలోని సముద్రానికి వెళ్లి కేరింతలు కొడుతూ ఒకరోజంతా వినోదించారు. ఆ వినోదంలో పడి, తన కుడిచేతివేలికి ధరించిన నవరత్నాలు పొదిగిన కంకణం నీటిలోకి జారిపోవడాన్ని కళావతి పాపం… గమనించలేదు. వసంతునితో కలిసి తన స్థానానికి వెళ్లిపోయింది.

సముద్రంలో పడ్డ ఆ కంకణాన్ని, ఒక పెనుచేప మింగింది. ఆ చేప వంగదేశంలోని ఒక జాలరి వలలో చిక్కింది. మామూలు చేపలకంటే అయిదారు రెట్లు పెద్దదైన ఆ చేపను ఆ జాలరి తమ రాజైన కందర్పకేతునికి సమర్పించి, గొప్ప బహుమానం పొందాడు.

కందర్పకేతుడు ఉత్సాహం కొద్దీ ఆ చేపను తానే దగ్గరుండి కోయించాడు. దాని కడుపులో నుంచి నవరత్నాలు పొదిగిన అపూర్వమైన కంకణం బయటపడటం ఆశ్చర్యపడుతూ చూశాడు. దానిని పరీక్షించి చూడగా, అది స్త్రీలు ధరించే కంకణమని నిర్ధారణకు వచ్చాడు.

‘ఇంత సొగసైన కంకణాన్ని ధరించే ఆ స్త్రీ ఇంకెంత సొగసుకత్తెయో కదా! పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ ఇటువంటి స్త్రీ సాహచర్యం లభించదు. ఎలా అయినా ఆమెను పొందాలి. కానీ ఎలా?! ఆమె ఏ దేశపు స్త్రీ కావచ్చు?!’ అని కందర్పకేతుడు తనలో తాను కొన్నిరోజులు మథనపడ్డాడు. చివరికి ‘ఈ కంకణాన్ని ధరించిన స్త్రీని తెచ్చి అప్పగించినవారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది’ అని దేశమంతా ప్రకటించాడు.

ఊరు, పేరు, సరైన ఆనవాళ్లు తెలియని మనిషిని కనిపెట్టడం ఎలాగో తెలియక… ఎవరూ ఆ ప్రకటనకు స్పందించలేదు. కానీ ఒక మాయలమారి ముసలమ్మ మాత్రం ముందుకొచ్చింది.

“రాజా! మీరు కోరిన నారీమణిని నేను తీసుకురాగలను. అసలిప్పుడే ఆమె మీకు దక్కిందని భావించండి. నాకు విచిత్ర వస్తువులతోనూ, సకల సాధనాలతోనూ నిండిన ఒక ఓడను ఇప్పించండి” అని అడిగింది.

రాజు ఆమె కోరినవన్నీ ఏర్పాటుచేశాడు.

ఆ తరువాత వృద్ధురాలు… ఆనాడు జాలరివానికి చేప దొరికిన దిక్కులో ఓడను నడిపించుకుంటూ వెళ్లింది. పదిహేను రోజుల ప్రయాణం తరువాత తీరం చూడగలిగింది. ఓడలోని సర్దారులను అక్కడే ఉండమని ఆజ్ఞాపించి, చిన్న దోనె సాయంతో రేవు చేరింది.

ఆమె అదృష్టం కొద్దీ ఆవేళ వసంతుడు కళావతి మళ్లీ సముద్రస్నానానికి వచ్చారు. వారిని అల్లంత దూరాన చూడగానే, వృద్ధురాలు ఇసుకలో కూలబడి… గోలుగోలున ఏడవసాగింది. వసంతుడు కళావతి ఆమె వద్దకు పరుగున వచ్చారు.

“అమ్మా! ఎవరు నువ్వు? ఇక్కడికెలా వచ్చావు? ఎందుకిలా ఏడుస్తున్నావు?!” అని అడిగారు.

వృద్ధురాలు ఏడుపుమాని కళావతిని ఆపాదమస్తకం పరిశీలించింది. కందర్పకేతుడు చూపించిన కంకణానికి జోడీ అయిన కంకణం కళావతి ధరించి ఉండటం గమనించింది.

ఇటువంటి సుందరీమణి కోసం తన రాజు విరహానికి లోనుకావడం సమంజసమే అనుకుంది.

ఆ తరువాత వన్నెచిన్నెలుగా రాగాలు తీస్తూ, “అమ్మా! నా పాపిష్ఠి కథ ఏమని చెప్పుకోను?! కోరుకున్న పిల్లను తెచ్చి కొడుక్కి కట్టబెట్టాను. అదేమో పరమ గయ్యాళి. నా బిడ్డకు నామీద ఏం నూరిపోసిందో ఏమో కానీ, వాడు నన్ను చావచితక బాదేశాడు. స్పృహ తప్పాక నన్ను ఈ సముద్రంలో పారేశాడు. మెలకువ వచ్చి చూసేసరికి ఈ గట్టున ఉన్నాను. ఇప్పుడు ఎటుపోవాలో తెలియడం లేదు. మీరు నా పాలిట దేవతల్లా కనిపించారు. దయచేసి నన్ను మీతో తీసుకుపోండమ్మా!” అని బతిమాలుకుంది.

కళావతి మనసు కరిగిపోయింది. “అవ్వా! ఇదిగో ఈ కనిపించేదంతా మా రాజ్యమే. ఇక నుంచి మేమిద్దరం నీ మనవళ్లమే అనుకో. నువ్వెలా చెబితే మేమిద్దరం అలా నడుచుకుంటాం” అన్నది.

పాచిక పారిన సంతోషంలో మాయదారి వృద్ధురాలు వారితో పాటు వెళ్లింది. కొంతకాలం పాటు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్లతో కాలం గడిపింది. వారికి కమ్మగా వండిపెట్టేది. దగ్గరుండి వడ్డించేది. కళావతికి స్వయంగా జడవేసేది. నలుగు పెట్టి, తలంటు పోసేది. ఆమె మనసెరిగి నడుచుకునేది.

కళావతికి ఒక తోడు దొరకడంతో వసంతుడు వాళ్లిద్దరినీ వదిలి, తరచుగా వేటకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు.

ఇలా కొంతకాలం గడిచింది.

ఒకనాడు ముసలిది, “అమ్మా కళావతీ! నా జీవితం నీ అధీనం చేశాను. మీ భార్యాభర్తలిద్దరూ పచ్చగా పదికాలాలు ఉండటం కంటే నేను కోరుకునేదేమీ ఉండదు. నీ మగడు బలశాలి కనుక, నరమానవుడు కనబడని ఇలాంటి చోట మనం ధైర్యంగా బతక గలుగుతున్నాం. కానీ అమ్మా! నీ మగడు ఎప్పుడు పడితే అప్పుడు వేటకు పోతున్నాడు. ఏమో అన్నిరోజులూ మనవి కాదు కదా! ఎవరు ముందో, ఎవరు వెనకో చెప్పలేం. కాబట్టి నా సలహా విను. నీకు నచ్చితే అలా చేయవచ్చు. నీ మగనికి తన ఆయుర్దాయం విషయం తెలుసేమో కనుక్కో! జాతకంలో కానీ, సాముద్రికంలో కానీ అతనికి మంచి ఆయుర్దాయం ఉందని తెలిస్తే మనం ధీమాగా ఉండొచ్చు.” అని గొప్ప నీతిమంతురాలిలా బోధించింది.
ఒకప్పుడు పంజరంలోని చిలకలో బ్రహ్మరాక్షసి దాచుకున్న తన ఆయువు గుట్టును గురించి… ఇలాగే అడిగి తెలుసుకున్న విషయం కళావతికి ఆ క్షణాన గుర్తులేదు. ‘అవ్వ చెప్పిందంతా నిజమే కదా’ అనుకుంది.

వసంతుని ముందు తన భయాన్నంతా వెళ్లబోసుకుంది. అతడు విలాసంగా నవ్వి, “పిచ్చిదానా! భయపడకు. నాకు వచ్చిపడ్డ భయమేమీ లేదు. నా మిత్రుడైన కళాదుడొకడు నా ప్రాణాలను ఈ కత్తి ఒరలో దాచి ఉంచాడు. కావాలంటే ఈ ఒరను నీ దగ్గర ఉంచుకో. ఇది నిక్షేపంలా ఉన్నంతకాలం నేను జీవించి ఉంటానని గుర్తు పెట్టుకో” అన్నాడు.
పాపం వసంతుడు! కళావతి అడిగిన వెంటనే తన రహస్యాన్ని చెప్పకుండా ఉండాల్సింది! నిదానించి ఆలోచిస్తే వృద్ధురాలి పథకం అతనికి తప్పకుండా తట్టి ఉండేది. కానీ అలా జరగలేదు.

ఆ తరువాత రెండురోజులు గడిచాయి.

ఆవేళ పున్నమి రాత్రి.

వసంతుడు కళావతి నడిరాత్రి వరకూ కామకేళిలో గడిపి గాఢనిద్రలో మునిగిపోయారు. ఆ సమయంలో వృద్ధురాలు మెల్లిగా కళావతి తన మంచం పక్కనే పెట్టుకున్న ఒరను బయటికి తీసుకుపోయింది. ఒక గరుకురాయిమీద అరగదీయడం మొదలుపెట్టింది.

వెనువెంటనే వసంతునికి మరణవేదన కలగసాగింది. నిట్టూర్పులతో మొదలై అటూ ఇటూ కొట్టుకోవడం ప్రారంభించాడు.

అది గమనించిన కళావతి తన మగడిని నిద్ర లేపడానికి ప్రయత్నించింది. మంచం పక్కన ఒర కనిపించకపోవడంతో ఇది వృద్ధురాలు పనే అని కొంతసేపటికి పోల్చుకోగలిగింది. వెనువెంటనే దాన్ని వెతుక్కుంటూ వచ్చింది.

గబగబా ఒరను లాక్కుని, “ఒసేయ్‌ నిర్భాగ్యురాలా! ఎంత ద్రోహానికి ఒడిగట్టావే?! నిన్ను సొంతమనిషిలా చూసుకున్నందుకు ఇదా ఫలితం?!” అని తిట్టిపోసింది. “నాకింక దిక్కెవరు?!” అని పెద్దపెట్టున విలపించసాగింది. వృద్ధురాలు అప్పటికప్పుడు అట్టు తిరగేసింది. “పిల్లా! నా మాట విను. నీ మగడు నీతో నిజం చెప్పాడో లేదో పరీక్ష చేద్దామని ఇలా చేశాను కానీ, నాకు ద్రోహబుద్ధి లేదు. ఇంతకూ అతగాడు ఎలా ఉన్నాడో చూద్దాం పద” అంటూ కళావతిని బయలుదేరదీసింది.

వసంతునిలో కదలికలు లేవు. అతను కొనవూపిరితో ఉన్నాడు కానీ, చనిపోలేదు. ఆ విషయం గ్రహించలేక, అతడు చచ్చిపోయాడనే తలచింది.

“పిల్లా! ప్రమాదవశాన ఇలా చేశాను. పోనీ పరవాలేదు. ఇతణ్ని నేను బతికించగలను. నాదగ్గర ఒక సిద్ధౌషధం ఉంది. దాన్ని ప్రయోగించాలంటే నువ్వు సముద్రజలాల్లో తలస్నానం చేయాలి. లే… పద. ఆలస్యం పనికిరాదు” అని త్వరపెట్టింది.

ఆ మాయలమారి చెబుతున్న మాటల్ని ఇంకా నమ్ముతూనే ఉన్న కళావతి దానిని అనుసరించింది.

“పిల్లా! వట్టినేల మీద కూర్చుని తలంటుకోకూడదు. అదుగో అక్కడున్న చిన్నదోనెపైన కూర్చుందువు గానీ!” అన్నది.

కళావతిని దోనెలో కూర్చోబెట్టి, తలపై కుంకుడు పులుసు పోయసాగింది. కళావతి రెండుచేతులతో కన్నులు మూసుకుని ఉండగా, ఒకచేత ఆమెకు తలంటుతూ రెండోచేత్తో దోనెను నడుపుతూ పోయింది.

తలంటు పూర్తయ్యేసరికి, కళావతిని ఓడవద్దకు చేర్చింది. సర్దారుల సాయంతో ఓడలోకి ఎక్కించింది. వాళ్లు ఆమెను ఒక రమ్యమైన గదిలోకి నెట్టి తలుపులు బిగించారు.
దారి పొడవునా, “పాపాత్మురాలా! ఎన్ని కుట్రలు పన్నావే! నిరపరాధులం అయిన మమ్మల్ని ఇలా చేయడానికి నీకు చేతులెలా వచ్చాయే?! నా భర్తను విడిచి, నా ప్రాణం నిలబడదు” అని కళావతి కన్నీరు కారుస్తూ, ముసలిదాన్ని తిట్టిపోస్తూనే ఉంది.

“పిల్లా! నీ మగడు చచ్చినట్లే. ఏడిస్తే మళ్లీ లేచి వస్తాడా? నన్ను చంపుతాడా? ఇంతకీ నీ భాగ్యం గొప్పది. మా రాజు కందర్పకేతుడు నిన్ను కోరుకుంటున్నాడు. అతణ్ని వరించు. నీ రూపాన్ని, యవ్వనాన్ని పండించుకో” అని వృద్ధురాలు బుద్ధులు చెప్పింది.

ఓడ వంగదేశం చేరింది.

కళావతి అందాన్ని చూసిన కందర్పకేతునికి మతి పోయింది. మోహాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా మూర్ఛపోయి, కొంతసేపటికి తేరుకున్నాడు. ఆనాడు చేపమింగిన కంకణానికి జత అయిన కంకణాన్ని కళావతి చేతికి చూపించింది వృద్ధురాలు.

కళావతి వాలకాన్ని గమనించిన రాజు, “అవ్వా! నువ్వు కొన్నాళ్లు మచ్చిక చేస్తే తప్ప ఈమె నా మాట వినేలా లేదు. దయచేసి నువ్వీ సాయం చేసిపెట్టాలి” అన్నాడు. “రాజా! మగతనం చూపి లొంగదీసుకోక, ఈ బేలతనం ఎందుకు?” అని ప్రశ్నించింది ముసలిది.

“అవ్వా! ఆమెను బలవంతం చేయడం నా అభిమతం కాదు. ఆమె తనంత తాను వలచి, నన్ను బులిపించాలి” అన్నాడు కందర్పకేతుడు. “నీకు ఒక్క ఏడాది గడువిస్తున్నాను. ఈలోపుగా ఆమెను నాకు వశపరిచావంటే, ముందు ఒప్పుకున్న ప్రకారం అర్ధరాజ్యం నీదే!” అని హామీ ఇచ్చాడు.

***

వసంతుడు కొనవూపిరితో ఉన్నాడు కానీ, మరణించలేదు. కత్తి ఒరను పూర్తిగా అరగదీస్తే తప్ప అతను మరణించడు. వృద్ధురాలు సగం మాత్రమే అరగదీసిన, ఆ ఒర అతని పక్కనే పడి ఉంది. ఒరను బాగుచేసి, వసంతునికి స్వస్థత చేకూర్చాలంటే అతడి స్నేహితుడైన దండుడు అక్కడికి రావాలి. ఇప్పట్లో దండుడు అక్కడికి వచ్చే అవకాశం లేదు. వసంతుని కథ ఏమైందో తరువాత తెలుసుకుందాం.

వింతైన మర్రిచెట్టును చూసిన మిత్రులు అయిదుగురూ… ఆ చెట్టు కొమ్మలు ఎక్కడి వరకూ వెళతాయో చూసి రావాలని నిశ్చయించుకున్నారు కదా! వారిలో సాంబుడు మాత్రం అక్కడే చెట్టువద్దనే ఉండగా… వసంతుడు తూర్పు కొమ్మను ఎక్కి కళావతిని సొంతం చేసుకున్నాడు. చివరికి వృద్దురాలి మాయోపాయం వల్ల ఆమెకు దూరమయ్యాడు.

మర్రిచెట్టు దక్షిణపు కొమ్మను ఎక్కినవాడు మంత్రి కుమారుడైన రాముడు.

రథాన్ని నడిపించడానికి వీలైనంత విశాలమైన ఆ కొమ్మమీద అతని ప్రయాణం నాలుగు రోజుల పాటు సులభంగా గడిచిపోయింది. మరోరెండు రోజులు ప్రయాసపడుతూ నడవగా, ఒక పర్వతప్రాంత భూమి కనిపించింది.

ఆ పర్వతంపై దిగాడు కానీ, సాయంకాలమైనా శిఖరాన్ని కనిపెట్టలేకపోయాడు. మరో అయిదు రోజులపాటు ఆ పర్వతంపైనే గడిపాడు. మరొక్కరోజు చూసిన తరువాత కూడా శిఖరం కనబడకపోతే వెనక్కు తిరిగి వెళ్లిపోవాలని రాముడు నిశ్చయించుకున్నాడు.

ఆ మరునాడు సూర్యోదయం అవుతూనే తిరిగి తన అన్వేషణ మొదలుపెట్టాడు.

మధ్యాహ్న వేళకు అతనికో గుహ కనిపించింది. మసక వెలుతురు ఉన్న ఆ గుహలోకి ప్రవేశించి, ముందుకు పోగాపోగా దారి చీకటిగా మారింది. వెనుదిరిగి పోవడానికి మనసొప్పక, చేతితో గుహను తడుముకుంటూ ముందుకే సాగాడతను.

ఎంతగా తప్పించుకోవాలని చూసినా, పూర్వకర్మలనే పాశాలు మానవుణ్ని బంధించి, అతడిని తగిన చోటనే పడవేస్తాయని చెప్పిన పెద్దలమాటలను గుర్తు చేసుకుంటున్నాడు. అడుగులు ముందుకు వేస్తున్నాడు.

చాలాసేపటి తరువాత అతడి చేతికి ఒక కవాటం తగిలింది. ఆ కవాటాన్ని ముందుకు తోయగా లోపల వెలుగు కనిపించింది. విశాలమైన ఒక గదిలో ఎత్తయిన వేదికమీద గడ్డం పెరిగిన మహర్షి ఒకాయన కన్నులు మూసుకుని జపం చేసుకుంటూ కనిపించాడు.

రాముడు ఆయన పాదాల వద్ద సాష్టాంగపడి లేచాడు. ఆయన కన్నులు తెరిచే సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు.

అలా ఎంతసమయం గడిచిందో తెలియదు.

చివరికి మహర్షి కన్నులు తెరిచాడు. రాముణ్ని చూసి చిరునవ్వు నవ్వాడు. “అదృష్టవంతుడివి నాయనా! పన్నెండేళ్లకు ఒకసారి కానీ, నేను సమాధినుంచి బయటికి రాను. సరిగ్గా ఈ వేళతో ఆ పన్నెండేళ్లూ ముగిశాయి కనుక, నాతో మాట్లాడగలుగుతున్నావు. ఏం కావాలో కోరుకో!” అన్నాడు.

ఆ మాటతో రాముడికి మహదానందం కలిగింది. “నన్నిక్కడినుంచి బయట పడేయండి స్వామీ!” అని కోరాడు.

“తథాస్తు” అన్నాడు స్వామి.

కన్నుమూసి తెరిచేసరికి రాముడు గుహ బయట ఉన్నాడు.

అక్కడే చిన్నపొరబాటు జరిగింది.

అలాకాకుండా, “స్వామీ! నేను బయలుదేరి వచ్చిన చోటికి చేర్చండి” అని రాముడు కోరుకుని ఉంటే బాగుండేది. అదృష్టమో, దురదృష్టమో కానీ అలా జరగలేదు.