Food

నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. @ పలమనేరు

నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. @ పలమనేరు

కోవిడ్‌ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి.

కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి.
9
ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్‌గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్‌గా మారింది. కోవిడ్‌ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్‌ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్‌ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి.

*పెరుగుతున్న పెంపకం-వినియోగం
గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్‌కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్‌ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు.దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్‌కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్‌వేర్‌లు సైతం నాటుకోళ్ల ఫామ్‌లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు.

*బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు.

*నాటుకోడి పులుసు హోటళ్లు
పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి.

*పుంజు రూ.5 వేలు
ప్రస్తుతం నాటుకోడి(లైవ్‌) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్‌ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్‌ ఉంటుంది.

*ఎంతో ఆరోగ్యం
నాటుకోడిలో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్‌-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్‌ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది.