Movies

అప్పుడు మా ఆయ‌న‌కు నో చెప్పా..

అప్పుడు మా ఆయ‌న‌కు నో చెప్పా..

నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలు… ఇలా భిన్న పాత్రలతో నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్న సుహాసిని మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ముచ్చట్లు..

*మధ్య తరగతి కుటుంబమే..
తమిళనాడులోని పరమకుడి మా ఊరు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో కారు కాదుకదా, కనీసం ఫ్రిజ్‌ కూడా ఉండేది కాదు. నేను చదువుకున్నది కూడా మునిసిపల్‌ స్కూల్లోనే. నాన్న చారుహాసన్‌, బాబాయ్‌ కమల్‌హాసన్‌ అప్పటికే సినిమాల్లో నటిస్తున్నారు. నాన్నకు తోడుగా ఉంటానని నన్నూ పంపారు. రామకృష్ణ మిషన్‌వారి శారద విద్యాలయ, క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో నా చదువు సాగింది.

*ఎప్పుడూ కమర్షియల్‌ కాదు..
ఎప్పుడూ నేను గ్లామర్‌ హీరోయిన్‌గా ఎదగాలని ఆలోచించలేదు. డబ్బు కోసం సినిమాలు ఒప్పుకోలేదు. మనం వేసుకునే దుస్తులనుంచి చేసే పనుల వరకు అన్నిటినీ అందరూ గమనిస్తారు. అందుకే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన దర్శకులు కె. బాలచందర్‌, సత్యజిత్‌ రే. బాలచందర్‌గారి దర్శకత్వంలోని ‘సింధు భైరవి’లో నా పాత్రకు జాతీయ పురస్కారం దక్కింది.
99
*అనుకోకుండా నటినయ్యా..
చదువుకునే రోజుల్లో బ్యాంక్‌ మేనేజర్‌ కావాలనేది నా కల. నాన్నేమో నన్ను ఇంజినీర్‌గానో, కలెక్టర్‌గానో చూడాలనుకున్నారు. అమ్మ నన్ను ఇంగ్లిష్‌ లెక్చరర్‌ చేయాలనుకునేది. కానీ అవేవీ కాకుండా.. బాబాయ్‌ ప్రోత్సాహంతో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరాను. అచ్చంగా పక్కింటి అమ్మాయిలా ఉంటానని బాలూ మహేంద్రగారు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు వచ్చింది. అప్పుటికి నా వయసు పందొమ్మిది.

*అంతా స్నేహితులే..
పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా చెప్పుకొంటూ పోతే పెద్ద లిస్ట్‌ అవుతుంది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మా బ్యాచ్‌లో 108 మంది అబ్బాయిలైతే నేనొక్కదాన్నే అమ్మాయిని. చిరంజీవి, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, మోహన్‌.. దాదాపు 30మందితో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ కూడా ఉంది.
9
*అరేంజ్డ్‌ మ్యారేజే కానీ..
నేను హీరోయిన్‌ అయ్యాక మణిగారు ఒక కథతో నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చలేదు. నేను చేయనని చెప్పేశాను. తర్వాత మేం కలవలేదు. అయితే మణిరత్నంగారి అన్నయ్య, మా నాన్నగారు మంచి స్నేహితులు. వాళ్లు ముందే మాట్లాడుకుని మా పెండ్లి నిశ్చయించారు. ఆ తర్వాతే, మమ్మల్ని ఓసారి కలిసి మాట్లాడుకోమని చెప్పారు. అప్పుడే మళ్లీ కలిశాం. కాసేపు మాట్లాడుకున్నాక తెలిసింది.. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒక్కటేనని.

*అన్నీ బ్యాలెన్స్‌ చేస్తా..
నాకు చదవడం, రాయడం, నేర్చుకోవడం.. చాలా ఇష్టం. ఒకే చట్రంలో ఎప్పుడూ ఇరుక్కుపోకూడదు. లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని వృథా చేసుకోకుండా పియానో నేర్చుకున్నా. దక్షిణాది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. ప్రస్తుతం ఫ్రెంచ్‌ నేర్చుకుంటున్నా. దర్శకురాలిగా టీవీ సిరీస్‌తోపాటు షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌ చేశా. ఓ మీడియా ఆర్గనైజేషన్‌తోనూ పనిచేస్తున్నా. రాజా రవివర్మ చిత్రాలను రీక్రియేట్‌ చేసేందుకు కృషి చేస్తున్నా. NAAM ఫౌండేషన్‌ ద్వారా సమాజంలో అవసరమైన వారికి చేయూత అందిస్తున్నాం.