NRI-NRT

దావోస్‌కు మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్

దావోస్‌కు మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మే 22 నుంటి 26 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలకు భారత్‌ నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఏపీ నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దావోస్‌ వెళ్లనున్నారు.వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాలు భారీ స్థాయిలో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల సారథులు వీటికి వరుస కట్టబోతున్నారు. భారత్‌ నుంచి కూడా ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు, సీఈవోలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

*దావోస్‌కు మంత్రి కేటీఆర్
మే 22 నుంచి 26 వరకూ జరిగే ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోపాటు మరికొన్ని రాష్ట్రాల నేతలు హాజరై తమ ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ నుంచి కనీసం 100 మంది సీఈవోలు, ప్రపంచవ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖులు ఈ సదస్సు కోసం ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, ఆయన వారసులు ఈషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలాతోపాటు హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, పేటీఎం, యాక్సిస్‌ బ్యాంకు, టాటా స్టీల్‌ తదితర సంస్థల సారథులు ఉన్నారు.‘‘400కు పైగా సెషన్లు నిర్వహించనున్న ఈ సదస్సులో వివిధ రంగాల నుంచి 2,000 మందికిపైగా పాల్గొంటారు. జీ7, .జీ20 తదితర కూటముల సభ్య దేశాల ప్రతినిధులూ హాజరు కానున్నారు’’ అని డబ్ల్యూఈఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరిలో జరగాల్సిన ఈ సమావేశాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతి కారణంగా వాయిదా పడ్డాయి.