DailyDose

రేపటి నుంచి నెల్లూరులో ఉపరాష్ట్రపతి పర్యటన – TNI తాజా వార్తలు

రేపటి నుంచి నెల్లూరులో ఉపరాష్ట్రపతి పర్యటన – TNI తాజా వార్తలు

* ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రేపటి(మంగళవారం) నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు వెంకటాచలంకు ఉపరాష్ట్రపతి రానున్నారు. 27న ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌ను జాతీకి అంకితం చేయనున్నారు. ఆపై అల్లూరులో దేవిరెడ్డి శారద స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభోత్సవంలో వెంకయ్య పాల్గొననున్నారు. 28న స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. 29 ఉదయం ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు తిరుగుపయనం అవనున్నారు

* రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలోని ఓ భవంతి సోమవారంనాడు కుప్పకూలింది. శిథిలాల క్రింద పలువురు చిక్కుకుపోయారు. మూడు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.కాగా, క్షతగాత్రులు, మృతులు, ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు.

*సీపీఎస్‌ను కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో సీఎంవో లో ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను విజయవాడకు రాకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ నిర్బంధించడం పట్ల టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ , ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు.

*ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం నేపథ్యంలో ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 412 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. చివరి గింజ కొనే వరకు రైతులకు అందుబాటులో ఉండాలని హరీష్‌రావు సూచించారు. నాడు ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలో సిద్దిపేట ప్రధాన భూమిక పోషిస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు

*సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చీరాల రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్ళే యూటీఎఫ్ నాయకులు, టీచర్లను గుర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చీరాల, వేటపాలెం పరిధిలో 30 మంది టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*యూటీఎఫ్ సీఎంఓ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో మచిలీపట్నంలో గల బస్టాండు, రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సామాన్య ప్రజలను ఆపి వెనక్కి పంపించేస్తున్నారు. బంధువులు చనిపోయారని, వెళ్లాలని కోరినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. దీంతో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం విచారణ కూడా చేయకుండా వెనక్కి పంపడంపై మండిపడుతున్నారు.

*ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా.? అని ప్రశ్నించారు. సి.పి.ఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. సుయ్యి మంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి ప్రతిపక్షాలు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

*దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్‌ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,60,086కు చేరింది. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందారు. 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ అయ్యింది. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.

*ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని కలవనున్నారు. అనంతరం సీజేఐ ఎన్వీ రమణతో భేటీ కానున్నారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజానాథ్ సింగ్‌ల అపాయింట్‌మెంటును సైతం బిశ్వభూషణ్ కోరారు. రేపు ఉదయం విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.

* సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చీరాల రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్ళే యూటీఎఫ్ నాయకులు, టీచర్లను గుర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చీరాల, వేటపాలెం పరిధిలో 30 మంది టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*యూటీఎఫ్ సీఎంఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణాటాటా సీరియస్‌గా తీసుకున్నారు. యూటీఎఫ్ ఉపాధ్యాయులు తలపెట్టిన నిరసనలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సీఎంఓ ముట్టడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని సీపీ కాంతి రాణా వెల్లడించారు.

*హైదరాబాద్: జిల్లాల్లో ప్రతీ సోమవారం ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం కానుంది. గ్రీవెన్స్ డే రెండేళ్లుగా ఆగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్‌భవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని గవర్నర్ ప్రకటన చేశారు. ఇప్పటికే రాజ్‌భవన్ దగ్గర ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు గవర్నర్ కార్యాలయం చేసింది.

*ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మే 20 వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొంది.రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి.

*సంగం బ్యారేజీ పనులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ పనుల వివరాలను మంత్రి కాకాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి బ్యారేజ్ పనులు పూర్తి చేసి జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

*తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం లో పదోన్నతుల కోసం కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగోన్నతులు పొందుతున్నారు. ఫలితంగా వర్సిటీ ప్రతిష్ఠ మసకబారుతోంది. దీనిపై సమాచార హక్కు చట్టం కింద ఇద్దరు న్యాయ వాదులు సమాచారం కోరడంతో నకిలీ సర్టిఫికెట్ల తంతు వెలుగులోకి వచ్చింది. అయినా ఈ కుంభకోణానికి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు కరువయ్యాయి. ఇంకా అనేకమంది ఇలా నకిలీ పత్రాలతో పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా అవకాశం పొందాలంటే పార్ట్‌-1, సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌గా అవకాశం దక్కాలంటే పార్ట్‌-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

* నాటికలు, హరికథలు, బుర్రకథలు వంటి కళల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను నేటితరం వారికి తెలియచేసే అవకాశం ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ అన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో ఆదివారం రాత్రి శ్రీకారం, రోటరీ కళాపరిషత్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉభయ రాష్ట్రాల నాటికల పోటీలకు న్యాయమూర్తి బి.కృష్ణమోహన్‌, ఆయన సతీమణి న్యాయమూర్తి జస్టిస్‌ వసంతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. కళాకారులు నాటికల ప్రదర్శనల ద్వారా సమాజసేవ చేస్తున్నారన్నారు. నీతి, విలువలు, ఐకమత్యం పెంపొందించేవిధంగా ప్రజల్లో చైతన్యం కలిగేవిధంగా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో కళాకారుల ప్రదర్శనల కోసం ప్రభుత్వం, ప్రజలు ఒక వేదిక నిర్మిస్తే బాగుంటుందన్నారు. జస్టిస్‌ వసంతలక్ష్మి మాట్లాడుతూ ప్రేమ పూర్వకంగా సమాజంలో మార్పును తీసుకురాగల శక్తి నాటకరంగానికి ఉందన్నారు. కార్యక్రమంలో సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

* భార్యా వియోగంతో బాధపడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను భారత్‌ బయోటెక్‌ సీఎం డీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, డైరెక్టర్‌ డాక్టర్‌ సుచిత్ర ఎల్లా ఆదివారం పరామర్శించారు. నగరి మండలం అయనంబాకంలో ఆయన్ను ఆదివారం పరామర్శించారు. ఎన్నో ఏళ్లుగా నారాయణ భార్య వసుమతిదేవి తాము కుటుంబ మిత్రులమని పేర్కొన్నారు. ఆమె తమ మధ్య లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఈ విషాదం నుంచి నారాయణ కోలుకుని తిరిగి చురుగ్గా ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్‌ సుచిత్ర తెలిపారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తినాయుడు కూడా నారాయణను పరామర్శించారు.

*పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో 16వ శతాబ్దం నాటి శిల్పాలను ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమ ని శివనాగిరెడ్డి గుర్తించారు. ఆ యన నాగిరెడ్డిపాలెంలో ఆదివారం పర్యటించారు. నాగిరెడ్డిపా లెం, మన్నెసుల్తాన్‌పాలెం మధ్య ఉన్న పొలాల్లో విజయనగర రాజుల కాలంలో నిర్మితమై, శిథిలమైన వీరభద్ర ఆలయాన్ని పరిశీలించారు. వీరభద్రుడు, భద్రకాళీ శిల్పాలు పగిలిపోయి, నేలకొరిగి ఉండడాన్ని ఆయన గుర్తించారు.

*మెడికల్‌ కౌన్సెలింగ్‌లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పదుల సంఖ్యలో సీట్లు బ్లాక్‌ అయ్యాయి. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సీట్లు బ్లాక్‌ అయిన విషయం బయటకు రాకపోతే మాత్రం ఒక్క మాప్‌ అప్‌ రౌండ్‌తోనే సరిపెట్టేవారు. కానీ మెడికల్‌ సీట్ల మాఫియా వ్యవహారం మొత్తం బయటపడటంతో తప్పులు దిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోసారి మాప్‌ అప్‌ రౌండ్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మిగిలిపోయిన బీ, సీ కేటగిరి సీట్ల భర్తీ కోసం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు ఆప్షన్‌ పెట్టుకునేందుకు సమయం ఇచ్చారు. మరోవైపు ఆదివారం ఇచ్చిన నోటిఫికేషన్‌లో కఠిన నిబంధనలు పొందుపరిచారు. రెండో విడత మాప్‌ అప్‌ రౌండ్‌లో సీటు తీసుకుని జాయిన్‌ కాకపోతే మాత్రం ఆ అభ్యర్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు వారిని మూడేళ్ల పాటు మెడికల్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా డీబార్‌ చేస్తామని వెల్లడించారు

*విద్యార్థులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ సహపంక్తి భోజనం చేశారు. సేవాశిక్షలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌తో కలసి ఆయన శ్రీకాకుళంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి పరిస్థితులు.. సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను గురించి వివరించారు. పదోతరగతి విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠం బోధించారు. అనంతరం భోజనం వడ్డించారు. విద్యార్థులతో కూర్చుని సహపంక్తి భోజనం కూడా చేశారు. రాజీవ్‌ విద్యామిషన్‌ సమకూర్చిన పుస్తకాలను పంపిణీ చేశారు.

* గిరిజన విద్యాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి వి.చినవీరభద్రుడు విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ పీజీ సెంటర్‌లో ఉన్న గిరిజన బాలురు వసతిగృహాన్ని ఆదివారం సందర్శించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఇక్కడకు వచ్చారు. భోజనం వండించి వడ్డించారు. ఆయన కూడా వసతి గృహంలోనే భోజనం చేశారు.

*త్వరలో 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. కొన్ని దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఆదివారం నల్లగుట్ట చుట్టాలబస్తీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్‌ రాబోతుందనే చర్చ జరుగుతున్న నేపఽథ్యంలో తరుణంలో ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, అర్హులైన వారు టీకా బూస్టర్‌ డోసును తీసుకోవాలని కోరారు.

*కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న కాలువ నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌లో రైతులు ఆదివారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు.. ‘అయ్యా భూ ధర్మం చేయండి రైతు గారు’ అని యాచకుడు అడుగుతుండగా.. ‘ఇచ్చేది లేదురా? కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ వైఖరి తెలిపారు.

*ఉస్మానియా వర్సిటీ విద్యార్థులతో మే 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశం కానున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఓయూలో తలపెట్టిన ఈ సమావేశానికి అనుమతి కోరడం కోసం సోమవారం తాను వర్సిటీ వైస్‌ చాన్సలర్‌(వీసీ)ను కలువనున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యవ విద్యార్థులతో రాహుల్‌గాంధీ సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఆయన ఓయూను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడుతారని తెలిపారు. విద్యార్థులూ తమ సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. అన్ని సమస్యలకూ ఆయన పరిష్కార మార్గం చెబుతారని పేర్కొన్నారు. వర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాల నేతలూ రాహుల్‌ పర్యటనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

* త్వరలో 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. కొన్ని దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఆదివారం నల్లగుట్ట చుట్టాలబస్తీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్‌ రాబోతుందనే చర్చ జరుగుతున్న నేపఽథ్యంలో తరుణంలో ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, అర్హులైన వారు టీకా బూస్టర్‌ డోసును తీసుకోవాలని కోరారు.

*విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండరామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు గైర్హాజరయ్యారు.