Food

పనసపై మనసు

పనసపై మనసు

ఓ పెళ్లిని పనస బిర్యానీ పదే పదే గుర్తు చేస్తుంది. ఇంకో శుభ కార్యానికి పనస గూన పులుసు ప్రత్యేకత తీసుకువస్తుంది. మరో ఇంటిలోని విందు పనస పొట్టు కూర వల్లనే పది కాలాలు గుర్తుంటుంది. ఉత్తరాంధ్రలో.. ప్రత్యేకించి ఉద్దానంలో పనసపై మనసు పడని వారు లేరు. తొనలు తీసి తిన్నా, ముక్కలు కొట్టి రుచిగా కూర వండినా, ఘుమఘుమలాడే బిర్యానీ చేసినా దీని రుచికి సాటి లేదంతే. ఊరు అదిరిపోయేలా డీజే మోగనీ.. వీధి మెరిసిపోయేలా లైటు సెట్టింగులు ఎన్ని పెట్టనీ.. ఊరేగింపు పక్క ఊరి వరకు జరగనీ.. ఎన్ని అట్టహాసాలైనా ఉండనివ్వండి.. ఆ వేడుక పది తరాలు గుర్తుంచుకోవాలంటే మాత్రం ఆ బాధ్యత పనసదే. అంతటి ఘనమైనది కాబట్టే  ‘పనస పొట్టులో ఆవ పెట్టుకుని.. తరతరాలుగా తిన్నారు..’ అని ఎస్పీ బాలు ఇష్టంగా పాడారు.    
 
**తెలుగు వారికి ప్రతి సీజన్‌కు ఓ ప్రత్యేకమైన కూర ఉంటుంది. అందులోనూ మన ఉత్తరాంధ్ర వారి జిహ్వ చాపల్యం ఎవరికీ తీసిపోదు కదా. వేసవి వస్తే ఉద్దానం వారు పనస కోసం పనిగట్టుకుని వెతుకుతారు. దీని తొనల రుచి అందరికీ తెలిసిందే. కానీ కాయను ఎన్ని రకాలుగా వండవచ్చో సిక్కోలుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. విస్తట్లో ఎన్ని కూరలు వడ్డించినా పనస కూర పడనిదే మనసు నిండదు మరి. అంతేకాదు పనస పండ్లు సీజన్‌లో మిత్రులకు, బంధువులకు, అధికారులకు ఉద్దానం ప్రాంతీయులు బహుమతులుగా ఇచ్చే సంప్రదా యం ఇప్పటికీ కొనసాగుతోంది. దీని సీజన్‌ వచ్చేసింది. పచ్చటి తోరణాలు కట్టిన ఇళ్లలో ఇప్పటికే పనస కాయలు కొలువుదీరి ఉన్నాయి.  
panasa1
**రకరకాలు..
కేవలం మండు వేసవి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ పండు దొరుకుతుంది. జిల్లాలో కర్జూరం, కర్పూరం, బురద, నిత్య వంటి రకాలున్నాయి. వీటిలో కర్జూరం రుచి చూసి తీరాల్సిందే. కర్పూరం, బురద, నిత్య రకాలను పిందె దశలోనే విక్రయిస్తారు. ఇవి కూరలకి మహత్తరంగా ఉంటాయి. దళారులు చెట్టు వద్దే వీటిని కొనేస్తారు. పనస పండిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అయితే 11 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచితే 3 నుంచి 6 వారాల వర కు ఉంటాయి. పండ్లతో పాటు పనసకా య పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్నచిన్న ముక్కులు గా కోసి కూర చేస్తా రు. దీన్ని పనస పొట్టు కూర అంటారు. ఇండియాతో పాటు నేపా ల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా వియత్నాం దేశాల వారు పనసను వంటల్లో విరివిగా వాడతారు.

**విందు.. పసందు  
పనస పిందెలుగా ఉన్న సమయంలో పనస పొట్టుతో వివిధ రకాలైన వంటకాలకు ఉపయోగిస్తారు. పనస ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, çపనస హల్వా, పనస పకోడీ, పనస గూన చారు, పనస చిల్లీ, పనస కుర్మా, పచ్చడి ఎవరికైనా తెగ నచ్చేస్తాయి. వీటి పిక్కలను కూడా నిప్పుల మీద కాల్చుకుని తినడం మనవారికి అలవాటే. వీటి తొనలు తీపిగా ఉన్నా ఇంటిలో సుగర్‌ లెవెల్స్‌ పెంచవు. విటమిన్‌ ఎ,సిలు సమృద్ధిగా ఉంటాయి. పనస కలపతో వీణలు, మద్దెలు కూడా చేస్తుంటారు.