Politics

కాంగ్రెస్‌‌కు పీకే షాక్.. సోనియా ఆహ్వానం తిరస్కరణ

కాంగ్రెస్‌‌కు పీకే షాక్.. సోనియా ఆహ్వానం తిరస్కరణ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్‌లో చేరబోనని స్పష్టం చేసిన ఆయన.. కేవలం కాంగ్రెస్‌కు సలహాదారుడిగా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వెలువడిన ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. మూడు దఫాలు కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన ప్రశాంత్ కిశోర్.. 2024 సాధారణ ఎన్నికల ప్రణాళికను కూడా పార్టీ పెద్దలకు అందించిన విషయం తెలిసిందే.

2024 సాధారణ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’లో చేరబోనని పీకే స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్‌ ప్రజెంటేషన్, ఆయనతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ను ఏర్పాటు చేసింది. ఈ గ్రూపు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సలహాలు, సూచనలు విషయంలో పీకేని అభినందిస్తున్నామని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. కాగా.. కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రణాళికను ప్రశాంత్ కిశోర్ స్వేచ్ఛకు వదిలేయబోమని కాంగ్రెస్ పేర్కొందని సమాచారం. పీకే ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.