NRI-NRT

‘గోల్డెన్‌ వీసా’ విక్రయాలను ప్రారంభించిన శ్రీలంక.. అసలేంటిది?

‘గోల్డెన్‌ వీసా’ విక్రయాలను ప్రారంభించిన శ్రీలంక.. అసలేంటిది?

పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు లంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షించేందుకు శ్రీలంక ‘గోల్డెన్ ప్యారడైజ్ వీసా ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎఫ్‌ న్యూస్‌ పేర్కొంది.

*గోల్డెన్ ప్యారడైజ్ వీసా ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
ఈ ప్రోగ్రామ్‌ కిందా ఏ దేశానికి చెందిన పౌరుడైనా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా దీర్ఘకాలిక వీసాతో శ్రీలంకలో నివసించడంతో పాటు వ్యాపారం చేసుకోవచ్చు. గోల్డెన్ ప్యారడైజ్ వీసా ప్రోగ్రామ్ కింద, విదేశీ పౌరులు కనీసం భారతీయ కరెన్సీలో రూ.76.5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల పాటు శ్రీలంకలో నివసించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదే సమయంలో 75వేల డాలర్లు వెచ్చించి అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ఐదు సంవత్సరాలు మంజూరు చేసేందుకు సైతం లంక ప్రభుత్వం ఆమోదించింది. అయితే, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ఎంతో సహాయపడుతుందని శ్రీలంక కేంద్ర మంత్రి నలక గోదాహేవా పేర్కొన్నారు.

*శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్షీణించింది
శ్రీలంకలో చమురు, విద్యుత్ సహా ఆహారం కొరత తీవ్రంగా ఉన్నది. మందుల కొరత సైతం వెంటాడుతున్నది. ఈ క్రమంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నిరసనలు తెలియజేస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకరంగం తీవ్రంగా ప్రభావితం కావడంతో శ్రీలంక ఆర్థికంగా దెబ్బతిన్నది. మరో వైపు అంతర్జాతీయ ద్రవ్యనిధితో బెయిల్‌అవుట్‌పై చర్చలు జరిపేందుకు శ్రీలంక అధికారులు గతవారం అమెరికా చేరుకున్నారు.