Politics

ఈ దేశంలో కొత్త రాజ‌కీయ శ‌క్తి ఆవిర్భ‌వించాలి

ఈ దేశంలో కొత్త రాజ‌కీయ శ‌క్తి ఆవిర్భ‌వించాలి

ఈ దేశం స‌రైన ప‌ద్ధుతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్న‌ది ఉన్న‌ట్టుగా అమ‌లు కావాలంటే, అంబేద్క‌ర్ స్ఫూర్తి నిజం కావాలంటే, మౌలికమైన‌టువంటి మార్పులు చేర్పులు చేసుకుని అద్భుత‌మైన ప్ర‌త్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజ‌కీయ శ‌క్తి ఈ దేశంలో ఆవిర్భ‌వించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. తెలంగాణ తరహాలోనే భూకంపం పుట్టించి- విద్రోహ శక్తులను తరిమికొడుదామ‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన.. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి, గ‌తిని, స్థితిని మార్చ‌డానికి, దేశాన్ని స‌రైన ప్ర‌గ‌తి పంథాలో న‌డిపించ‌డానికి హైద‌రాబాద్ వేదిక‌గా కొత్త ఎజెండా, ప్ర‌తిపాద‌న‌, సిద్ధాంతం త‌యారై దేశం న‌లుమూల‌ల వ్యాపిస్తే ఈ దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ గుంపు కాదు.. కూట‌మి కాదు.. ప్ర‌త్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెత‌కాలి. నూత‌న వ్య‌వ‌సాయ విధానం, నూత‌న ఆర్థిక విధానం, నూత‌న పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవ‌స‌ర‌మైన వేదిక‌లు త‌యారు కావాలి. ఆ భార‌త‌దేశం ల‌క్ష్యంగా పురోగ‌మించాలి. సంకుచిత రాజ‌కీయాలు వ‌ద్దు. దేశానికి అభ్యుద‌య ప‌థం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుప‌డ‌త‌ది. ఉజ్వ‌ల‌మైన భార‌త్ త‌యారవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు.