Devotional

మే 13 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

మే 13 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

1. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 13 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మే 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12న అంకురార్పణం జరుగుతుందని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలను వారు తెలిపారు.13 న ధ్వజారోహణం పెద్దశేష వాహనం, 14న చిన్నశేష వాహనం హంస వాహనం , 15న సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం , 16న కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారని పేర్కొన్నారు. 17న మోహినీ అవతారం గరుడ వాహనం, 18న హనుమంత వాహనం గజ వాహనం, 19 న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం , 20న రథోత్సవం జరుతుందని, 21న చక్రస్నానం ధ్వజావరోహణం నిర్వహించ నున్నామని తెలిపారు.బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని వివరించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ. వెయ్యి చెల్లించి పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, ఒక లడ్డు, వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు.

2. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మంగళవారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఉదయం ఏడు గంటల సమయంలో రాజగోపురం ద్వారం నుంచి పెద్ద నాగుపాము బయటకు వెళ్తూ కనిపించింది. దీంతో భక్తులు భయకంపితులై పరుగులు తీశారు. నాగుపామును పట్టుకునేందుకు కొందరు ప్రయత్నించగా వృథానీరు బయటకు వెళ్లే పైప్‌లోకి దూరింది. పాములు పట్టుకోవడంలో నిపుణుడైన ఆలయ ఉద్యోగి లక్ష్మణ్‌కు సమాచారం అందించడంతో నాగుపామును పట్టుకొని పట్టణానికి దూరంగా ఉన్న పొదల్లో వదిలేశాడు.

3. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. సెక్యూరిటీ లోపంతో సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో మొబైల్ ఫోన్లతో అభిమానులు వీడియోలు తీశారు. అభిమానుల తాకిడితో ఆలయం లోపలరైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. పోలీసులుదుర్గ గుడి అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా గందరగోళం నెలకొంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది.