Business

యాపిల్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌ బాటిల్స్‌ – TNI వాణిజ్య వార్తలు

యాపిల్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌ బాటిల్స్‌  – TNI వాణిజ్య వార్తలు

*టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో యాపిల్‌ దిట్ట. ఫింగర్‌ ప్రింట్‌, స్మార్ట్‌వాచ్‌, నాచ్‌ డిస్‌ప్లే .. ఇలా ఏదైనా సరే యాపిల్‌ ప్రవేశ పెడితే వెంటనే ఫాలో కావడానికి అనేక మంది కస్టమర్లు రెడీగా ఉంటారు. తదనంతర కాలంలో మిగిలిన కంపెనీలు అదే టెక్నాలజీని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. యాపిల్‌ సంస్థ తాజాగా స్మార్ట్‌ వాటర్‌ బాటిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది, యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ బాటిళ్లు అమ్మకానికి పెడుతోంది. ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిళ్లు యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌తో సింక్రనైజ్‌ అవుతాయి. ఆ తర్వాత నిత్యం మనం తీసుకుంటున్న నీరు. మనం చేస్తున్న శారీరక శ్రమ తదితర వాటిని బేరీజు వేస్తుంది. ఈ డేటా ఆధారంగా ఎంత నీరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ను హిడ్రేట్‌స్పార్క్‌ సంస్థ తయారు చేసింది. హిడ్రేట్‌ స్పార్క్‌ ప్రో, హిడ్రేట్‌ ప్పార్క్‌ ప్రో స్టీల్‌ రెండు వెర్షన్లలో లభిస్తోంది. స్పార్క్‌ ప్రో ధర రూ.4,500 (59.95 డాలర్లు), స్పార్క్‌ ప్రో స్టీల్‌ ధర రూ. 6,000 (79.95 డాలర్లు)గా ఉన్నాయి. గతంలో యాపిల్‌ సంస్థ స్మార్ట్‌వాచెస్‌.. గుండె పోటుతో ఇబ్బంది పడుతున్న వారినికి సంబంధించి అలెర్ట్‌లు పంపించి ప్రాణాలు కాపాడిన వార్తలు చక్కర్లు కొట్టాయి. రేపు ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ గురించి ఎన్ని విశేషాలు బయటకు వస్తాయో చూడాలి.

*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.

*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.

*టెస్లా కంపెనీ భారత్‌లో తయారీ యూనిట్‌ పెడితే తప్పకుండా స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చైనాలో తయారు చేసే టెస్లా కార్ల దిగుమతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించేది లేదని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. భారత్‌ ముందు తమ ఈవీ కార్ల దిగుమతులను అనుమతిస్తే, ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు విషయం తర్వాత పరిశీలిస్తామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ గతంలో ప్రకటించారు. ఇందుకోసం 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకా న్ని 40 శాతానికి తగ్గించాలని కోరారు. దీంతో భారత్‌లో టెస్లా కార్ల ప్రవేశం సందిగ్ధంలో పడింది.

*అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీ (ఐసీఈ) హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. డేటా, టెక్నాలజీ, మార్కెట్‌ మౌలిక సదుపాయాలను అందిస్తున్న ఐసీఈ 2019లో హైదరాబాద్‌లో 500 మంది నిపుణులు, ఉద్యోగులతో గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంలో 900 మంది పని చేస్తున్నారని ఐసీఈ ఇండియా అధిపతి సచ్‌పతి తెలిపారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా 2022 చివరి నాటికి హైదరాబాద్‌ కేంద్రంలో మరో 300 మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు.

*ఇన్వెస్టర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవో వివరాలు రానే వచ్చాయి. ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.902- 949గా కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. పాలసీ హోల్డర్లకు రూ.60 తక్కువకే షేర్లు ఇవ్వాలని బోర్డ్ ప్రతిపాదన చేసింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు రూ.45 తగ్గుదలతో షేర్లు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు బోర్డ్ నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలుస్తుందని భావిస్తున్న ఎల్ఐసీ ఐపీవో మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు రెండు రోజులు ముందుగా మే 2న ఐపీవో ఓపెన్ కానుంది. మంగళవారం సమావేశమైన ఎల్‌ఐసీ బోర్డ్ ఐపీవో ఇష్యూ సైజును 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కాగా ఎల్‌ఐసీలోని కేంద్రప్రభుత్వ వాటా మొత్తంలో 3.5 శాతాన్ని రూ.21 వేల కోట్ల వ్యాల్యూయేషన్‌కు విక్రయించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

*టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. ప్రముఖ సామాజిక వేదిక ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంపై అమెరికాకు చెందిన మరో ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్… ట్విట్టర్‌ను $44 బిలియన్లకు ఎలోన్ మస్క్ కొనుగోలు ప్రక్రియ పూర్తైన వెంటనే చైనా ట్విట్టర్‌పై ప్రభావం చూపుతుందని బెజోస్ ఆలస్యంగా ఒక ట్వీట్‌ను పంచుకున్నారు. ‘చైనీస్ ప్రభుత్వం టౌన్ స్క్వేర్‌పై కొంచెం పరపతి పొందిందా ?’ అంటూ బెజోస్ చైనాతో మస్క్ యొక్క వ్యాపార సంబంధాలను సూచించాడు. టెస్లా CEO 2018 లో షాంఘైలో ఓ తయారీ కేంద్రాన్ని స్థాపించడంతోపాటు, కార్పొరేట్ తన బ్యాటరీలలోకి వెళ్లే సామాగ్రిని ఉత్పత్తి చేసేందుకు చైనీస్ కార్పొరేషన్‌లపై ఆధారపడి ఉంటుందన్న విషయాలు తెలిసినవే. మస్క్ ద్వారా కార్పొరేట్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ బోర్డు నిన్న(సోమవారం) అంగీకరించింది.