NRI-NRT

అమెరికా వ‌ర్జీనియాలో వ్య‌వ‌సాయం చేస్తున్న తెలంగాణ మ‌హిళ‌

అమెరికా వ‌ర్జీనియాలో వ్య‌వ‌సాయం చేస్తున్న తెలంగాణ మ‌హిళ‌

వర్జీనియా. లౌడెన్‌ కౌంటీలో ఓ స్కూలు. ఆడిటోరియం కిటకిటలాడుతున్నది. అందరికీ బుక్‌లెట్స్‌ పంచారు. విద్యార్థుల్లో ఆ బుక్‌లెట్‌లో ఏముందో అన్న చర్చ. ఇంతలో 20 నిమిషాల నిడివిగల ఒక వీడియో ప్రదర్శించారు. విద్యార్థులంతా ఐదో తరగతి చదివే సాహితి వైపు చూస్తూ.. ‘విశాలి మీ అమ్మనా?’ అని అడగడం మొదలుపెట్టారు. ‘ఔను.. మా అమ్మే. తను రైతు’ అని గర్వంగా చెప్పింది సాహితి. స్థానిక ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక భారతీయ రైతు విశాలి! సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే మూలాల మీద ప్రేమతో రైతుగా మారిన విశాలి కొణతం సాగు సంగతులు ఆమె మాటల్లోనే..
t2
లౌడెన్‌ కౌంటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌వారు ప్రతి సంవత్సరం పదిమంది రైతులను నామినేట్‌ చేస్తారు. ఈ ఏడాది ఆ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ రైతు నేనే. వ్యవసాయం కూడా ఒక వృత్తే అని తెలియజేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. దీంట్లో భాగంగా బుక్‌లెట్స్‌ ముద్రించి పాఠశాలల్లో పంచుతారు. వీడియోలు ప్రదర్శిస్తారు. నామినేట్‌ అయిన రైతు విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి లోకల్‌ ఫుడ్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. మా చిన్నపాప సాహితి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం చేశారు. నా బుక్‌లెట్స్‌, వీడియో చూసి విద్యార్థులు ‘సాహితీ! మీ అమ్మ విశాలి గ్రేట్‌’ అన్నారట. చాలా గర్వంగా చెప్పింది మా సాహితి.
t3
మేము ఉండేది వర్జీనియాలోని లౌడెన్‌ కౌంటీలో. ఐటీ ఫీల్డ్‌లో ఉన్నాను. ఏడేండ్ల క్రితం మా పెరట్లో కూరగాయల సాగు మొదలుపెట్టాను. భారతీయ కూరగాయలన్నీ పండిస్తున్నా. అదికాస్తా వ్యవసాయం దాక తీసుకొచ్చింది. కొంత భూమిని లీజ్‌కు తీసుకొని మార్చిలో పని మొదలుపెట్టాను. భూమికోసం ఎక్కడెక్కడో తిరిగాం. ఎక్కడ బోర్డ్‌ కనిపిస్తే అక్కడికి వెళ్లేవాళ్లం. ఎకరా విస్తీర్ణంతో మొదలైంది మా సాగు. వచ్చే సంవత్సరం ఐదెకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. మా పొలంలో కాడ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. మా ఫామ్‌ పేరు స్ప్రౌటింగ్‌ రూట్‌ ఫామ్‌, ట్యాగ్‌లైన్‌ A Dream to go back to the Roots.
t4
ఫామ్‌ టు హోమ్‌
మా పంటను రెస్టారెంట్లకు, స్టోర్లకు ఇవ్వొద్దనీ.. ఫామ్‌ టు హోమ్‌ కస్టమర్లకే అందించాలనీ ముందే అనుకున్నాం. సేంద్రియ పద్ధతిలో ఓ భారతీయ రైతు పండిస్తున్న కూరగాయలని తెలియగానే నేరుగా పొలం దగ్గరికే వస్తున్నారు. వాళ్లే తెంపుకొంటున్నారు. పొలాల్ని చూస్తున్నారు. డబ్భు ఎనభై కుటుంబాలు మా దగ్గర కూరగాయలు తీసుకెళ్తాయి. ఆర్డర్‌ చేస్తే హోం డెలివరీ చేస్తాం. అదికూడా చుట్టుపక్కల మాత్రమే.
t5
వ్యవసాయంపై ఇష్టంతో
మాది మోత్కూరు దగ్గర ఆరెగూడెం. మా నాయిన బక్కారెడ్డి. ఎన్ని సమస్యలొచ్చినా వ్యవసాయాన్ని వదల్లేదు. నాకు బాగా గుర్తు. నాయినెప్పుడూ వ్యవసాయంతో వేలకు వేలు సంపాదించింది లేదు. అయినా సేద్యమంటే ఇష్టం. నాయినకు ఇష్టమైన పనుల్లో ఏదో ఒకటి కొనసాగించాలని అనుకునేదాన్ని. లౌడెన్‌ కౌంటీలో ఇల్లు తీసుకొని అచ్చం మా ఊర్లో నాయిన డిజైన్‌ చేసినట్లుగానే ఇంటి వెనక కూరగాయలు, ఇంటిముందు పూల మొక్కలు పెట్టాను.
t6
మూలాలకు దూరం కావద్దు
నేను వ్యవసాయం చేస్తానని చెప్పగానే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇక్కడ సేద్యం అంత సులభం కాదు కూడా. కానీ నేను పట్టువీడలేదు. నా ఆలోచనకు మావారు శ్రీధర్‌రెడ్డి, మా పెద్దక్క బిడ్డ అర్చన మద్దతు లభించింది. మా ఆయనది కూడా వ్యవసాయ నేపథ్యమే. మా అత్తమ్మ, మామయ్య ఇప్పటికీ వ్యవసాయంలోనే ఉన్నారు. అయితే రైతు పరిస్థితిరోజురోజుకూ దీనంగా మారడం చూసి వ్యవసాయంపై కోపం పెంచుకున్నారు. ఆ కోపమంతా నేను వ్యవసాయంలోకి దిగిన తర్వాత తగ్గిపోయింది. మా అమ్మాయిలు కూడా నన్ను, వ్యవసాయాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నేను వాళ్లకు వ్యవసాయాన్ని మాత్రమే కాదు మన మూలాల్ని కూడా పరిచయం చేస్తున్నా.

సేంద్రియ పద్ధతిలోనే
మేం భారీగా పెట్టుబడి పెట్టలేదు. గ్రీన్‌హౌజ్‌ లాంటివాటి జోలికి పోలేదు. లీజ్‌ ఒక్కటే పెద్ద వ్యయం. కలుపు రాకుండా షీట్స్‌ వేయించాను. డ్రిప్‌ సిస్టమ్‌, కంపోస్ట్‌ వంటివాటి కోసం పోయినేడాది కూరగాయలతో సంపాదించిందంతా ఖర్చు పెట్టాను. పంటలన్నీ సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. మా ల్యాండ్‌ ఓనర్‌కు అగ్రికల్చర్‌ స్కూల్‌ ఉంది. అక్కడ మేం విద్యార్థులకు సాగు గురించి బోధించే అవకాశం ఇచ్చారు. ఆ స్టూడెంట్స్‌ మా ఫామ్‌కు వచ్చి ఏ పంట ఎలా సాగు చేయాలో తెలుసుకుంటున్నారు.
t7
పొద్దున లేస్తే పొలంకాడనే
పొద్దున తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్‌ పని. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేయను. పొద్దున ఐదింటికే పొలం దగ్గరికి వెళ్తా. ఇంటికొచ్చే వరకు ఎనిమిదిన్నర అవుతుంది. తొమ్మిదింటికి ఆఫీస్‌ పని స్టార్ట్‌ చేస్తాను. ప్రతీది ప్లాన్డ్‌గా చేస్తున్నాం కాబట్టి వ్యవసాయం విజయవంతంగా సాగుతున్నది. వీకెండ్స్‌లో శనివారం మొత్తం అక్కడే ఉంటాం. భవిష్యత్‌లో డెయిరీ పెట్టడంతోపాటు, సీజనల్‌ పండ్లు పండించాలని అనుకుంటున్నా. ఫామ్‌ దగ్గరే ఒక స్టోర్‌ పెట్టే ఆలోచన కూడా ఉంది.