NRI-NRT

హైద‌రాబాద్‌లో 3.3 ల‌క్ష‌ల చ.అడుగుల విస్తీర్ణంలో గూగుల్ క్యాంప‌స్

హైద‌రాబాద్‌లో 3.3 ల‌క్ష‌ల చ.అడుగుల విస్తీర్ణంలో గూగుల్ క్యాంప‌స్

అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.తెలంగాణ ప్ర‌భుత్వం, గూగుల్ సంస్థ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. పౌర సేవ‌లు, విద్య‌, ఇత‌ర రంగాల్లో ప్ర‌భుత్వానికి గూగుల్ సాంకేతిక స‌హ‌కారాన్ని అందించ‌నుంది. ఇప్ప‌టికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంతో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో గూగుల్ త‌న మూలాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. ఇంత‌కు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్య‌క్ర‌మాల‌కు దారి తీశాయ‌న్నారు. యువ‌త‌, మ‌హిళ‌లు, విద్యార్థులు, పౌర‌సేవ‌ల్లో మార్పు తీసుకురావ‌డంపై దృష్టి సారించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2030 లోపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్‌ సైన్సెస్‌లో డేటా సైన్స్‌ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్‌ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడుతున్నదని చెప్పారు. దీంతో నైపుణ్యం కలిగిన 450 మందికిపైగా ఇంజినీర్లు పనిచేస్తారన్నారు.

థర్మో ఫిషర్స్‌ కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందని చెప్పారు. ఈ సంస్థ పరిశోధన కోసం ఏటా 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తున్నదని తెలిపారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్‌ ప్రతినిధులను కలిశానని గుర్తుచేశారు.పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమని చెప్పారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్‌, ఇక్రిశాట్‌, సీఎస్‌ఐఆర్‌ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్‌ కేపబిలిటి సెంటర్లకు కూడా హైదరాబాద్‌ మంచి ప్రదేశమని వెల్లడించారు.